Thursday, March 10, 2022

Chapter 13 Section 2

13.3

క్షేత్రజ్ఞo చాపి మాం విద్ది సర్వ క్షేత్రేషు భారత {13.2}

క్షేత్ర క్షేత్రజ్ఞ యో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ

నేను సర్వ క్షేత్రములను తెలిసినవాడను. క్షేత్రాన్ని తెలిసికొనుట , క్షేత్రమును తెలిసినవాడు నిజమైన జ్ఞానం

నువ్వు నీ క్షేత్రమనుకొంటే, వేరే రైతుఅవసరం లేదు. విత్తనాలు యాధృచ్చికముగా వస్తాయి, ఎవరూ పాత లేదు అని నమ్ముతావు. పంట మంచిదో కాదో యాధృచ్చికముగా జరుగుతుంది. ఒక మంచి పంట పండితే --ఎలాగైతే ఆరోగ్యం, ఆనందం, ప్రేమించే కుటుంబం, నమ్మకమైన మిత్రులు ఉంటే -- "అదృష్టం నన్ను వరించింది" అంటావు. లేక పంట సరిలేకపోతే అది నీకు సంభందించినది కాదు. "దురదృష్టం నాకు కలిగింది. అతివృష్టి, అనావృష్టి. అకాల వానలు కలిగేయి". గీత ఈ రెండు విరుద్ధ భావాలను సవరిస్తుంది: "నువ్వు నీ విత్తనములను పెంచుకొనుటకు, పంటను పండించుకొనుటకు పూర్తి కారణము. వేరొకరు కారణం కాదు. నువ్వు విత్తనములు కొరకై వేచి చూచిన, ఒక రోజా పూల తోట చేయలేవు."

ఒక క్షేత్రాన్ని దాని మటుకు వదిలేస్తే, అది క్రమంగా కలుపు మొక్కలతో నిండిపోతుంది. ఏదైతే ఏపుగా పేరుగుతుందో అది తక్కిన వాటిని ఆక్రమిస్తుంది. ఇదేవిధంగా ప్రయత్నంలేనిదే ఒకని వ్యక్తిత్వము అహంకారంగా మారుతుంది. అహంకారం వానిపాటికి వదిలేసిన కలుపు వంటి సంస్కారములు. అక్కడ పుష్పాలు ఉన్నాయి గాని ఏపుగా పెరిగిన కలుపు మొక్కలతో మారుబడ్డాయి.

మనం అలిస్ ఇన్ వండర్ లాండ్ (Alice's Wonderland) కి ఒకమారు వెళ్దాం. మనం స్టీవ్ తనను తోటతో తాదాత్మ్యం చెందితే ఏమవుతుంది అన్న విషయం గురించి క్రిందటి శ్లోకంలో ప్రశ్నించేము. నేను ఇప్పుడు తోటే తాను స్టీవ్ అనుకొంటే ఏమవుతుందని అడుగుతాను.

తోటలో స్టీవ్ పిల్లలను కలుద్దామని వెళ్ళేవనుకో. ఒక కప్పు వైన్ (Wine) తాగి ఎండలో పడుకున్నావనుకో. నిద్ర లేచినవెంటనే ఆ తోట ఒక అరణ్యం లాగ అగుబడుతుంది. ఆ తోట పెద్ద పెద్ద కాండాలతో , వాటిని మించిన పుష్పాలతో నీ తలమీద ఊగిసలాడి మౌన సంభాషణ కావిస్తుంది. క్రమంగా నువ్వు చిన్న రూపాన్ని ధరించి ఆ మౌన సంభాషణను అర్థం చేసుకొనే సామర్థ్యం కాలవాడివి. ఆ తోటలోని చెట్లు తమలో తాము ఆలోచనలను పంచుకోగలవు. ఎలాగంటే మన శరీరంలోని కణాలు మాట్లాడుకున్నట్టు. ఆ చెట్లు తెలివిగల ఒక సమిష్టిగా వ్యవహరిస్తున్నాయి. కేబేజు (cabbage), కేరట్టు(carrot) వస్తూ పోతూ ఉంటాయిగానీ తోట ఎక్కడికీ పోదు. ఇక్కడ జీవితం కొనసాగిస్తున్నది ఆ తోట. తోటకే తెలివి, వాక్చాతుర్యం, ఆలోచనా శక్తి,, స్థిరత్వం ఉన్నాయి. "నేను ప్రసిద్ధమైనదానిని" అని అనుకొంటుంది. "నాకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఉంటే చెప్పు" అని అంటుంది.

"నువ్వు అనేక కొమ్మలు, రెమ్మలు, విత్తనాలు. అవేమీ పెద్ద గొప్ప కాదు" అన్నావు. శాస్త్రాల గూర్చి కల్పితం (Science Fiction) చదివేవారు, ఇది ఒక ప్రమాదకరమైన ప్రక్రియ అని చెప్తారు. ఎందుకంటే నువ్వు తోట మధ్యలో ఉండి దానిని విమర్శిస్తున్నావు. కానీ ఆ తోటకి ఎంతో అహంకారం ఉంది. మీరు గ్రహించి ఉండేవుంటారు అహంకారానికి తోట చిహ్నం. "నీ సంభాషణ మార్చుకో. నువ్వు నా పరిధిలో ఉన్నావు. నువ్వు నాతో వాదిస్తే నిన్ను మింగేయగలను" అని భయపెడుతుంది.

"నిన్ను తయారు చేసిందెవారు?" అని అడిగేవు.

"ఎవరూ కాదు. నేను నా అంతటే పెరిగేను"

ఇప్పుడా తోటలోని బాటలు పెద్ద పెద్ద రహదారులుగా నీకు కనిపిస్తున్నాయి. క్యారెట్ (carrot) ప్రపంచం , బీట్రూట్ (beet root) పుంత కనిపిస్తున్నాయి. నువ్వు ధైర్యం తెచ్చుకొని "నువ్వు నీకు కావలసిన మొక్కను పెంచగలవా " అని తోటను అడిగేవు.

తోట గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయి "నాకు ఇష్టమైన మొక్కలనే పెంచుతాను. ఏదైతే ఇక్కడ పండుతుందో నాకది ఇష్టం" అంది.

"పెద్ద గాలీ వానా వస్తే ఏమి చేస్తావు?"

"నేను మొదట చస్తాను. కానీ కొంచెం కాలం గడిచిన తరువాత మళ్ళీ పెరిగి పెద్దదాన్ని అవుతాను. ఈ మొక్కలు వచ్చి పోతాయి. కానీ నేను శాశ్వతం."

నువ్వు తల విదుల్చుకొని "తోటా నీ అంతట నువ్వు చేయగలిగిందేమీ లేదు. ఒక తోటమాలి నీకు అనేక సేవలు చేయాలి. విత్తనాలను పాతి, నీళ్ళు పోసి, గొప్పులు త్రవ్వాలి. బాటలు వేయాలి. నీ ప్రేమేయం ఇందులో ఏమీ లేదు. నువ్వు నీ మాలి విశేషణాలన్నిట్నీ నీ సొంతం చేసుకొన్నావు. ఇందులో నీ ఘనత ఏమీ లేదు" అని అన్నావు.

మన అహంకారం ఇలాగే ఉంటుంది. మళ్ళీ తెలివితో. అది ఒక క్షేత్రానికే పరిమితం. కొన్ని కణాల సముదాయం. ఒక రకమైన ప్రక్రియ. దానికి స్వతంత్రమైన తెలివి లేదు. ఒక్క ఆత్మ మాత్రమే తెలిసినది.

క్షేత్రం అని వాడ బడిన మాట భారతదేశంలోని అనేక భాషలలో గుడిగా అనువదించవచ్చు (ఉదాహరణకు పుణ్యక్షేత్రం). సాధువులు తమ శరీరాలను గుడితో పోలుస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రతిఒక్కరిలో ఉన్నాడు. ఆ గుడికి గోపురం కట్టనక్కరలేదు. ఎక్కడైతే మన ఆత్మ ఉన్నదో అక్కడ మనలో భగవంతుని మూల విరాట్టు ప్రతిష్టితమై ఉంది. అట్టి ఆత్మ సర్వం తెలిసినది మరియు మన శ్వస్వరూపం.

మితిమీరి ఆహారం తినడం వలన ఆ గుడి అపరిశుభ్రం అవుతుంది. అలాగే పొగ త్రాగడం. అది అగరొత్తులు కి విరుద్ధం. మన శరీరాలను భగవంతుని గుడిగా తలచిన మనం దూరలవాట్లుకు బానిసలవ్వo, రోజూ వ్యాయాయం చేస్తాం, మంచి పదార్థాలను తగినంతగా భుజిస్తాo, మన శరీరాల్ని తగినవిధంగా పోషిస్తాo.

కానీ మనస్సును విడనాడం . అది కూడా మన గుడిలో ఒక భాగం. దానిని స్థిరంగా, దయతో ఉంచకపోతే ఎంత శరీరాన్ని బాగుపరచినా లాభం లేదు. అంటే శరీరం అస్వస్థకు గురి అవుతుంది. అభద్రత, ఆరోగ్యo ఎంత బాగున్నట్టుగా ఉన్నా, మన శరీర రక్షణ కణాలను నిర్వీర్యం చేస్తుంది. నేను ఇది వ్రాస్తూ ఉండగా, ఫ్లూ ( Flu) వ్యాధి మళ్ళీ ప్రబలినట్టు వార్తలు వస్తున్నాయి. "ఫ్లూ వస్తున్నాది. మీరు సిద్ధంగా ఉన్నారా?" అని పత్రికలు రాస్తున్నాయి. ఆ వార్త విన్న ప్రతివొక్కరు "అది నిజంగా వస్తోందా ? నేను సిద్ధంగా ఉన్నానా? నాకా వ్యాధి అంటుకొంటుందా ? నాకప్పుడే ఆ వ్యాధి సోకిందా?" అని తమను తాము ప్రశ్నించికొంటున్నారు. గీత ఫ్లూ మీద ఆలోచన చేస్తే నువ్వు ఫ్లూ అవుతావని అంటుంది. మన శరీరాన్ని కాపాడుకొని, పరులగూర్చి బ్రతికి, వ్యధ లేకుండా జీవించాలి. అలాగైతే మన భద్రత , వ్యాధి నివారణ శక్తి అధికంగా ఉంటుంది. ఒకవేళ ఫ్లూ నిజంగా వస్తే మనం అతివేగంగా దాని బారి నుంచి బయట పడతాము.

శరీరం ముమ్మాటికీ గుడి అని జర్మనీ దేశస్తుడు యోగి జొహనెస్ టాలెర్ (Johannes Tauler) అంటాడు. "కానీ శరీరం సరిగా పనిచేయాలంటే మనం దానినుండి డబ్బు పిశాచాలని, పిట్ట లమ్మేవారిని, మరి కొందరు కబ్జాదారులను భహిష్కరించాలి." అని అంటాడు. ఇది మానసిక లోలోతులకు పాతుకుపోయిన అహంకారం గురించి చెప్తున్న విషయం. గుడిలోనున్న దేవుడు ప్రకటితమవ్వాలంటే అహంకారం అనే దొంగను బయటకు త్రోలాలి

ఇక్కడ క్రిస్మస్ (Christmas) వస్తోంది. నా అమ్మను పెద్ద దుకాణానినికి సరదాగా తీసుకెళ్ళేను. అక్కడ క్రీస్తు (Christ) పుట్టిన సమయాన్ని (Nativity Scene) బొమ్మలతో ప్రదర్శించేరు. హిందువులు మేరీ మాతను సానుకూలంగా చూస్తారు. అందువలన నా అమ్మ ఆ బొమ్మలను చూసి భావోద్వేగం చెందింది. కానీ ఆ చిత్రకారులు ఒక తప్పు చేసేరు. ఎందుకంటే నా అమ్మ అడిగింది "అక్కడ ఉయ్యాల (Cradle) ఉంది గాని బాల క్రీస్తు (బొమ్మ) లేడు"

మనమందరకీ టాలెర్ దృక్పధంలో ఉయ్యాల తయారుగా మన హృదయాల్లో ఉంది. కానీ మన అహంకారం అడ్డు వస్తున్న కారణంవలన అంతర్ముఖులం కాలేకున్నాము. ఆ అహంకారం ఎంత పెద్దదంటే ఆ ఉయ్యాలను చీల్చి బయటకు వస్తోంది. అదృష్టవశాత్తూ మనం బాల క్రీస్తుని వెదికి హృదయ ఉయ్యాలలో పెట్ట నక్కరలేదు. నెమ్మదిగా మన అహంకారాన్ని బయటకు పంపిస్తే లోపల ఉన్నది దైవ స్వరూపమే !

సెయింట్ పాల్ (St. Paul) కూడా చెప్పినదిదే. "నేను మరణించేను, కానీ బ్రతికే ఉన్నాను. నాలో నివసించేది నేనుకాదు. అది క్రీస్తు. " ఒకానప్పుడు పాల్ ఆధ్యాత్మిక చింతన లేనివాడు. అతని వృత్తి గుడారాలు చేయడం. పేరు సాల్ (Saul) అతనికి కోపం అంతా ఇంతా కాదు. నాకైతే గుడారాల కర్రతో కొట్టే వాడనిపిస్తుంది. ఎవరైనా వచ్చి "నజారేత (Nazareth) క్రీస్తు అంటే నాకిష్టం లేదు" అంటే వెంటనే "నీకు తక్కువ ధరకు అమ్ముతాను" అనేవాడు. అతను డమాస్కస్ (Damascus) కి ప్రయాణించేటప్పుడు అతనిలో చెలరేగుతున్న మంటలు బయటకు పేలుడు వస్తువులా అగిపించాయి. మూడు రోజులు గ్రుడ్డివాడై , అచేతనుడై పడిపోవడంతో అతని అహంకారం పఠాపంచల్ అయిపోయి క్రీస్తు భక్తులకున్న సమత్వం వచ్చింది. అతను కళ్ళు తెరిచిన తరువాత ఒక నూతన వ్యక్తిలా ఆవిష్కరింపబడి తన క్రోధాన్ని దయ, ప్రేమగా మార్చుకొని రాత్రింబవళ్ళు క్రీస్తు సందేశాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేడు. మనం పాల్ లాగా నాటక ఫక్కీలో జీవించనక్కరలేదు. ఒక్క అహంకారాన్నే చంపుకుంటే మన చుట్టూ ఆనంద సంబరాలు జరుగుతాయి. "నూతనoగా అవతరించిన రాజుకు జయహో"

నేను సెయింట్ పాల్ గురించి చెప్పడం ఎందుకంటే అది మనందరికీ వర్తిస్తుంది. ప్రపంచంలో అతి పెద్ద అగాంతకుడు కూడా తన మనస్సును ప్రయత్నంతో మార్చుకోవచ్చు. నేను ఆంగ్లం బోధిస్తున్నప్పుడు ఈ విషయాన్ని సరదాకి మాక్బెత్ (Macbeth)ని ఉదాహరణంగా చేసుకొని చెప్పేవాడిని. మాక్బెత్ సహజంగా సౌమ్యుడు కాడు. మాక్బెత్ కూడా ధ్యానాన్ని నేర్చుకోవచ్చు. దానివలన విషాదంతో ముగిసే నాటకం మనం కోరుకుంటున్నట్టు సుఖాంతం అవ్వచ్చు. దురుసు, క్రూర స్వభావముగల మాక్బెత్ కూడా సాత్వికుడవ్వచ్చు. అతను మంత్రగాళ్లకు "ఎందుకు నాలో లోభత్వాన్ని పెంచుతారు? ఇదిగో ఒక మంత్రం. జీసస్ , జీసస్ , జీసస్. మీరు అది స్మరిస్తూ రాత్రంతా మీ మాయల లోకంలో గడపండి" అని చెప్పి ఉండచ్చు. మంత్రగాళ్లు నిజంగా వెలుపల లేరు. వాళ్ళు మనలోనే ఉన్నారు. వాళ్ళకు స్వస్తి చెప్పడానికి నిజమైన ధైర్యం ఉండాలి. ధైర్యం వలన స్వతంత్రం. దానివలన అంతులేని ఆనందం పొందవచ్చు.

గీత ఇక్కడ రెండు విధాలుగా జ్ఞానం సంపాదించవచ్చునని భోదిస్తోంది. క్షేత్రం లోపలైనా, వెలుపనైనా సదా మార్పు చెందుతూ ఉంటుంది. దానిని అపరా విద్య అనవచ్చు. ఇది ఒక మెట్టు క్రిందన ఉన్న జ్ఞానం. ఇది ఏమీ తక్కువగా చూడవలసినది కాదు. అంతా దానిని భోదించే గురువు మీద ఆధారపడి ఉంటుంది. మనం విద్యాలయాల్లో నేర్చుకొనే శాస్త్రాలు ఈ కోవకు చెందుతాయి. వాటి వలన మనకు చెడుకన్నా మంచే ఎక్కువ జరుగుతుంది. ఇకపోతే పరా విద్య ఒక మెట్టు మీదనుంది. అది ఉన్నత విద్య. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు ధర్మానికి కట్టుబడే లాగ పరా విద్య సహకరిస్తుంది. దానివలన విశ్వమంతా ఐక్యమత్యమైన ఒకటేనన్న జ్ఞానం ఉదయిస్తుంది.

మన మిత్రుడు స్టీవ్ మట్టిని విశ్లేషించినా, వాన పాముల సాంద్రతను కొలిచినా అది అపరా విద్య. అది మంచి పంట పండడానికి అవసరం. అలాగే తానెవారో తెలుసుకోవడం స్టీవ్ కి ఎంతో అవసరం. అతను మట్టి, విత్తనము, పంట కాదని ముందు మనం చూసేం. అది పరా విద్య. అంటే జ్ఞాత తననే జ్ఞేయంగా పరిశోధించడం.

క్రింద మెట్టులో ఉన్న మేధా శక్తిలా కాక ఆధ్యాత్మిక జ్ఞానం మన బుద్ధిని సూటిగా నిర్దేశిస్తుంది. నేను ఒక చిన్న పిల్లని ఉదాహరణగా చేసి విపులీకరిస్తాను. నేను ఆ పిల్లని అమెరికాకు ఫుల్బ్రైట్ స్కాలర్ (Fulbright Scholar) గా వచ్చినపుడు కలిసేను. నేను మొదట ఉద్యోగం చేసిన విశ్వవిద్యాలయంలో ఆమె ఉన్నత తరగతి విద్యార్థిని. ఆమెకి మంచి తెలివి, రూపం తో పాటు పట్టుదల కూడా వుంది. వీటన్నిటితో ఆమెకు విపరీతమైన కోపం ఉండేది. అది ఆధ్యాత్మిక చింతనకు అనుసంధానం చేస్తే ఉపయోగకరం.

ఆమె ధూమపానం ఎక్కువగా చేస్తుందని తెలిసి చాలా బాధపడ్డాను. అప్పట్లో ధూమపానo గురించి పరిశోధనలు ఇంకా జరగలేదు. అయినా నాకు అది ప్రమాదకరమని తెలుసు. దానివలన మన ఊపిరితిత్తులతో పాటు మనశ్శక్తి కూడా నాశనమవుతాయి. నన్ను ఆమె నమ్ముతుందని తెలుసు. ఆమెకి మిక్కిలి పట్టుదల కూడా ఉంది. కాబట్టి ఒకరోజు సూటిగా అడిగేను "మన మైత్రిని ఉపయోగించుకొని నిన్నొక ప్రశ్న అడగవచ్చా? నీకు ఇష్టం లేక పోతే ఇంకెప్పుడూ అడగను".

ఆమె అదోలా చూసి, "అడగండి" అంది

"నువ్వెందుకంత ధూమపానం చేస్తావు? నాకు నీ ఆరోగ్యం తలచుకొంటే బాధ వేస్తుంది"

ఆమె తన మేధనుపయోగించి చాలా సాకులు చెప్పింది. నేను అవి అన్నిటినీ విన్నాను. "ఒక బలంగా నాటిన అలవాటుని ఎదుర్కొని విజయం సాధిస్తే ఉన్న ఆనందం దానికి బానిస అయితే ఉందా?" అని అడిగేను.

ఆమె గుడ్లప్పగించి కొంచెంసేపు చూసింది. చిరునవ్వుతో అంగీకరించింది. నాకప్పుడు చేసిన బోధ పని చేసిందని నమ్మకం ఏర్పడింది. నాకు తెలిసి ఆమె మళ్ళీ ధూమ పానం చేయలేదు. నేను చెప్పిన సూటి మాటలు ఆమెలోని పట్టుదలను మేల్కొలిపి మంచి మార్పును తెచ్చేయి.

ఇది పరా విద్యకు అనగా ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నం. నేను ధూమపానం చేస్తూ ఎక్స్ రే (x-ray) లోని నాశనమైన ఊపిరితిత్తులను పరీక్షిస్తున్న వైద్యులనూ చూసేను. ఇది అపరా. ఎందుకంటే ఆ వైద్యునికి తెలుసు ధూమపానం చేస్తే ఏమవుతుందో. ఆయన జ్ఞానానికి కర్మకి పొంతన లేదు.

సెయింట్ ఫ్రాన్సిస్ (St Francis) "నీ జ్ఞానం నీ కర్మకున్న లోతు మాత్రమే" అని చెప్పేరు. అంటే అది మన మనశ్శక్తి కన్నా లోతుగా లేదు. ఉన్నత జ్ఞానం మన దైనింద కార్యాలకు చక్కగా అనుష్టించడానికి సహకరిస్తుoదని పై చెప్పిన వైద్యుని, విద్యార్థిని ఉదాహరణలు నిరూపిస్తాయి.

కొందరు ఆధ్యాత్మిక చింతన తామసానికి దారి తీస్తుందని నాకు చెప్పేరు. దీనికి భారత దేశాన్ని ఉదాహరణగా చూపిస్తారు. ప్రస్తుతం మన దేశం వెనుకబడి ఉంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక చింతన ప్రబలంగా ఉండేది. ఆనాడు చరిత్రలో మన దేశం మిక్కిలి ధనవంతమైనదిగా వర్ణించేరు. అలాగే సాంస్కృతి పరంగా మన దేశం ఉన్నత స్తితిలో ఉండేది. ఇతర దేశాలకు బానిసగా ఉన్నప్పుడు , అనగా స్వరాజ్యం లేనప్పుడు, మనం ఆధ్యాత్మికకు దూరం అయ్యాము. ఇప్పుడు, స్వరాజ్యం వచ్చిన తరువాత, మన పురోగతికి విజ్ఞానం కన్నా ఆధ్యాత్మికతే కారణం అని నేను భావిస్తాను. ఇదే గాంధీ మహాత్ముని స్పూర్తి. ఆయని ఘనతకి కారణం ఇదే. ఆయన కోట్లాది ప్రజలను ఆధ్యాత్మికతో మేల్కొలిపేరు. వారికి చిరకాలం నుండి ఉన్న ఆధ్యాత్మికను గుర్తు తెచ్చేరు. చాలా మంది భారతీయులకు వారిని ఆధ్యాత్మికవైపు తిప్పడానికి శ్రీ రామకృష్ణ గారి పాత్ర పెక్కుగా ఉందని తెలీదు. చరిత్రను తెలిసిని వారికి మన స్వాతంత్ర సమరంలో ఆధ్యాత్మికకు కాని అంశం లేదని తెలుస్తుంది. ఆధ్యాత్మికత మన సంస్కృతిని మార్చగలదు . ఈనాటి ప్రపంచ దేశాలతో ప్రభావితమవుతున్నా, మన సంస్కృతి ఎన్నటికీ చెరిగిపోదు.

ఆధ్యాత్మిక చింతన ఎన్నటికీ సోమరితనాన్ని పెంచదు. అది అంతర్ మరియు బాహ్య దుశ్శక్తులను ఎదుర్కొనడానికి అవసరమైన సంకల్పం, ఆయుధాలను సమకూరిస్తుంది. మానవులంతా సమైక్యతతో ఒకే గ్రహం మీద చోటు పంచుకున్నాము. మనందరం ఒకే ఇంటివాళ్ళం. ఒక గదిలో కుర్చీలు, బల్లలూ ఉండచ్చు; వేరొక గదిలో తివాచీలు, పాలరాతి గచ్చు ఉండవచ్చు; కానీ అవి అన్నీ ఒకే పైకప్పు క్రింద ఉన్నాయి. ఒక గదిలో పేదరికం ఉంటే, ఇంట్లోవారందరూ బాధ పడాలి. ఆ బాధ నైతిక విలువలవలన కావచ్చు లేదా ఆర్ధికంగా కావచ్చు. ఒక గదిలో నిప్పు పెడితే మొత్తం ఇల్లంతా కాలి పోతుంది. ప్రపంచ యుద్ధాల వలన ఇదే అవుతోంది. ఒక గదిలోనివారికి మహామారి వస్తే "అది వేరే గదిలో ఉంది. నాకు సంభందించినది కాదు" అని కాళ్ళు చాచుకొని కూర్చోలేం. మహామారి ఒక అంటువ్యాధి. కొంత సమయానికి అది ఇల్లంతా వ్యాపించి ఇంట్లోని వారందరిని వ్యాధిగ్రస్తులను చేస్తుంది. ఇక ఇంట్లో వ్యాధిలేని వైద్యులెక్కడ?

నూతన విజ్ఞానంతో ప్రస్తుతం మానవాళికి భూగోళమంతా స్వస్థత, శాంతి, సుఖాలతో నింపగల సామర్థ్యం ఉంది. మనముందు రెండు మార్గాలు ఉన్నాయి : ఒకటి అపరిమితమైన బాధ, దుఃఖం కలిగించునది; రెండవది అచింత్యనీయమైన ధనం, సుఖాలకు దారి తీసేది. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అపరా విద్య మననందరిని నాశనం చేస్తుంది. ఎందుకంటే దానికి మన గమ్యoగురించి తెలీదు. దానిని ఆధ్యాత్మిక జ్ఞానంతో మిళితం చేస్తే భూతల స్వర్గం ఆవిష్కరింపబడుతుంది.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...