Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 3

Bhagavat Gita

12.3

యే త్వక్షర మనిర్దేశ్య౦ అవ్యక్తం పర్యుపాసతే {12.3}

సర్వత్రగ మచింత్యంచ కూటస్థ మచలం ధృవమ్

సంనియమ్యే౦ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః {12.4}

తే ప్రాప్నునంతి మామేవ సర్వభూతహితే రతాః

ఎవరయితే ఇంద్రియములను నిగ్రహించి, అంతటను సమబుద్ధి కలిగి, సర్వ ప్రాణులకు మేలు చేయుటయందు పరమాసక్తి గలవారై అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తమును, సర్వత్రగము, చింతించుటకు వీలు కానిదియు, కూటస్థము, అచలము, ధృవము నైన బ్రహ్మమును ఉపాసించుచున్నారో వారే నన్ను పొందుచున్నారు. ఀ

నిర్గుణ దైవాన్ని ఊహించలేం. కానీ దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులలో అట్టి దైవాన్ని బ్రహ్మన్ అని అంటారు. ఈ రోజుల్లో గుణములతో కూడిన దైవాన్ని పూజించడం మూఢ నమ్మకం లేదా మేధ యొక్క బలహీనత అని తలిచేవారు చాలా మంది ఉన్నారు. జ్ఞాన యోగం మేధకి సంబంధించినది కాదు. మేధ ద్వంద్వాలని -- ఉదాహరణకు తెలిసికొనేవాడు, తెలిసికోబడేది -- విశ్లేషిస్తుంది. నిర్గుణ దైవాన్ని తెలిసికోవాలంటే ద్వంద్వాలను అధిగమించాలి. అంటే తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది ఏకమై ఒకే అఖండమైన బ్రహ్మన్ ఉన్నాడనే జ్ఞానము కలుగుతుంది. దీనినే నిర్వికల్ప సమాధి అని అంటారు. శ్రీ రామకృష్ణ ఉప్పుతో చేయబడిన బొమ్మ దృష్టాంతం ఇచ్చేవారు. ఒక ఉప్పుతో చేయబడ్డ బొమ్మ సముద్రంలో ప్రవేశించిన వెంటనే కరిగిపోతుంది. మరి సముద్రం యొక్క విస్తీర్ణం చెప్పేది ఎవ్వరు?

యోగులు నిర్వికల్ప సమాధిలో అన్ని భేదాలను అధిగమించి బ్రహ్మన్ లో రమిస్తారు. కానీ దాన్ని వివరించేది ఎలాగ అన్న ప్రశ్న మిగిలిపోతుంది. 13 వ శతాబ్ది మైస్టర్ ఎక్ హార్ట్, 8 వ శతాబ్ది ఆది శంకరులు ఈ విషయాన్ని విశ్లేషించారు. 5 వ శతాబ్ధి డై ఓనిసియస్ ది అరియో పెగైట్ ఇలా వ్రాసెను:

తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది మధ్య గల భేదాన్ని దాటితే సాధకుడు పేరులేని, రూపంలేని వాస్తవ౦తో ఏకమై పదార్థాల కంటే విలక్షణమైన స్థితి పొందుతాడు. తన మేధను, మనస్సును నిశ్చలం చేసి తెలుసుకోవడానికి అతీతమైన స్థితిలో ఉంటాడు

జ్ఞాన యోగం, కర్మ యోగం, భక్తి, రాజ యోగం మొదలైన మార్గాలు నిజానికి వేర్వేరు కావు. అవి అన్నీ ఒకే ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే మార్గాలు.

దాన్ని అర్థం చేసికోవడానికి జ్ఞాన మార్గా౦లో వెళ్ళిన వ్యక్తుల జీవిత చరిత్రలను పరిశోధించాలి. ఆది శంకరుడు నిర్గుణ బ్రహ్మన్ ని ఏకం అద్వితీయం -- అనగా రెండవది లేదు--అని తన స్వీయానుభవంతో వర్ణించేరు. ఆయన అద్వైతాన్ని స్థాపించినా శివుడు, పార్వతి మొదలైన సగుణ దేవతలయందు భక్తితో అనేక స్తోత్రాలు వ్రాసేరు. ఉదాహరణకు:

నీవు జగన్మాతవు

నా యందు నీకున్న ప్రేమ గురించి అనుమాన మెందుకు?

ఒకని లెక్కలేనన్ని తప్పులు చేసినా

వాని తల్లి వానిని ఎప్పటికీ విడిచి పెట్టదు

శంకరులు 32 వ ఏట కైవల్యం పొందేరు. అంతకు ముందు ఆయన భారత దేశంలోని శకలాలుగా ఉన్న మతాలను ఏకం చెయ్యడానికై, అనేక మఠాలు స్థాపించుటకై, ఉపనిషత్తులకు భాష్యం వ్రాయడానికై తన సమయాన్ని అర్పించేరు.

శంకరులు అద్వైత ప్రతిపాదనలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి అనేక విధాలుగా వివరించేరు. అది వర్ణింప శక్యము కానిది ఎందుకంటే అది అంతటా ఉంది. దానికి ద్వితీయం లేదు. దానిని భాషతో, ఆలోచనలతో పట్టుకోలేము. అది అక్షరం--అనగా ఎప్పటికీ తరిగి పోయేదికాదు, ఆద్య౦తాలు లేనిది, ఎప్పటికీ నాశము కానిది. అది అనిర్దేశ్య౦ -- దాన్ని చూపలేము; దాన్ని నిర్వచించ లేము; అది బయట, లోపల ఉండేది. అవ్యక్తం -- అనగా వ్యక్తము కానిది, చూడబడనిది ఎందుకంటే చూసేవారు వేరుగా లేరు కనుక. సర్వత్రగం -- అది అన్ని చోట్లా ఉండి, ప్రతిదానికి ఉనికి నిచ్చేది. అచలం-- అనగా మార్పు లేనిది.

ఉపనిషత్తులు "తత్ త్వం అసి" అనగా నీవు దానిగా ఉన్నావు అంటాయి. ఇది మన సహజ స్థితి. ఆత్మ రూపేణ మనమెప్పుడూ పుట్టలేదు, ఎప్పటికీ చనిపోము. నేతి, నేతి ప్రక్రియతో నేను దేహాన్ని కాదు, మనస్సును కాదు అని చెప్పుకుంటూ పోవచ్చు. కానీ దానివలన మన చేతన మనస్సు ఎంతవరకు ప్రభావితమౌతుందో చెప్పలేము. మనకి కోపం, అనుమానం, సందిగ్దం మొదలైన మానవ లక్షణాలు ఎప్పటికీ ఉండేవే. కాబట్టి ఇవి జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడవు. కొందరిలో అవి అహంకారాన్ని పెంచి తమపై అనురాగాన్ని పెంచుతాయి.

అలాగే జ్ఞాన యోగానికి సంబంధించిన విషయాలు శ్రీకృష్ణుడు చెప్పిన పై శ్లోకాల్లో ఉన్నాయి. సమ్నియమి ఇన్ద్రియగ్రామం -- అనగా దేహం మన స్వాధీనంలో ఉండడం. ఇంద్రియాలను నియంత్రించడం. సర్వత్ర సమబుద్ధయ --అనగా ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండుట; ఇంద్రియాలతోనూ, వస్తువులతోనూ తాదాత్మ్యం లేకుండుట; శత్రువులు, మిత్రులు లేకుండుట. సర్వభూతహితే రతాః -- అనగా ఇతరులను సేవించి ఆనందం పొందుట; స్వార్థమే ఎప్పుడూ చూసికోకుండుట. నా ఉద్దేశంలో "జ్ఞాన యోగం ఆచరణలో పెట్టగలిగితే, దానితో అవసరం లేదు; అవసరమైతే దానిని ఆచరణలో పెట్టలేము".

ఈ నేపథ్యంలో శ్రీ రామకృష్ణ బృందావనంలోని గోపికల కథ చెప్తారు. మనము శ్రీకృష్ణునిపై భక్తి ఉంటే ఆ గోపికల లాంటివారలమే. ఒక రోజు ఒక జ్ఞాన యోగి బృందావనానికి వచ్చేడు. అక్కడ గోపీకలందరూ ఒక అవతారపురుషుడ్ని ఆరాధిస్తున్నారని చూసి, వాళ్ళకు బ్రహ్మన్ గురించి వివరించేడు. వాళ్ళు చివరకు "మాకు ఇదేమీ అర్థం కాలేదు. మాకు తెలిసిందల్లా చూసి, ఆనందించి, ప్రేమించ గలిగిన శ్రీకృష్ణుడు" అని చెప్పేరు.

శ్రీకృష్ణుడు చెప్పేది మన మేధమీద మనకి ఎంతో నమ్మకమున్నా అది నిర్గుణ బ్రహ్మన్ ని చూడలేదు. మనమున్న స్థితిలో దేహ రహితమైన చేతనాన్ని ఎలా పట్టుకోగలం? ఆత్మ శాశ్వతమైనది, మార్పులేనిది కావచ్చు. కాని దానికి ఒక ఉపాధి అవసరం. ఇదే అవతారాల యొక్క రహస్యం. దేవుడు మానవ రూపాల్లో అవతారాలు ఎత్తి మన ఊహకు అందేలా చేసికోబడి, మనను ఐకమత్యంతో నడిపించగలిగే శక్తి. సెయింట్ బెర్నార్డ్ "కనిపించని దైవము భౌతికమైన మానవ రూపాముతో అవతారమెత్తడానికి కారణం పరస్పర ప్రేమతో బ్రతుకుతున్న మనల్ని తన వైపు త్రిప్పుకొని, క్రమంగా ఆధ్యాత్మికమైన ప్రేమను పెంపొందించడానికి". 340

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...