Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 5 Section 6

Bhagavat Gita

5.6

బ్రహ్మ ణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః {5.10}

లిప్యతే న స పాపేన పద్మపత్రమివా౦భసా

తాను చేయు కర్మలను భగవానునికి సమర్పించి, ఆసక్తిని వీడి కర్మలను చేయువాడు, తామరాకు నీటిచేత అంట బడనట్లు పాపము చేత అంటబడడు

ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః {5.11}

నిర్దోష౦ హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనస్సు సమత్వభావమున స్థిరముగ నుండునో వారు ఈ జన్మమునందే జీవన్ముక్తులు. బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది. కావున వారు బ్రహ్మ నిష్ఠులే యగుదురు

న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం {5.12}

స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవి ద్బ్రహ్మణి స్థితః

స్థిరబుద్ధి కలిగి, మోహ రహితుడైన బ్రహ్మవేత్త బ్రహ్మము నందున్న వాడై ప్రియము కలిగినపుడు సంతసింపడు, అప్రియము కలిగినపుడు దుఃఖి౦పడు

కలువ పువ్వుని అనేక విధాలుగా వర్ణిస్తారు. దాని పర్యాయ పదము: పంకజ అనగా బురద నుండి పుట్టినది. కలువ ఆకు పెద్దదిగా ఉండి నీటి మీద తేలుతూ ఉంటుంది. కానీ దానికి తడి తగలదు. అలాగే మనము దేవుని శరణు కోరి, ఆయన చేతుల్లో పని ముట్టుగా పరోపకారం చేస్తూ ఉంటే, మనకు కష్టాలెదురైనా, అవి మనల్ని అంటిపెట్టుకొని ఉండవు. మనము సవాళ్లను అలుపు, ఒత్తిడి, విసుగు, విరామం లేకుండా ఎదుర్కోగలం.

మనము ఆధ్యాత్మిక సాధన కొంత స్వార్థంతో చేస్తాము. పరోపకారం చేస్తే మన౦ దేవుడ్ని పొందవచ్చనే భావం కలిగి ఉండచ్చు. అలాగే మన స్వార్థం కూడా చూసుకొంటాం. మన క్షేమం, ఇతరుల క్షేమం మీద ఆధారపడి ఉన్నదని, మనం ఇతరులకై పాటు పడితే, మన గురించి కూడా పాటు పడుతున్నామనే జ్ఞానం పొందటానికి కొంత సాధన అవసరం.

నిస్వార్థ సేవ యొక్క రహస్యం తెలియడానికి కొన్నేళ్ళు పడుతుంది. గొప్ప దాతలు ప్రజా సేవకై నడుం బిగించి, వారి స్వార్థం చూసుకొంటారు. నాకైతే ధ్యానం చేస్తే కాని నిస్వార్థ సేవ గురించి తెలియదని అనిపిస్తుంది. మనం పరులకై పని చేస్తున్నామని తలంచవచ్చు. కానీ వారి అవసరాలు ఏమిటో తెలియక పోవచ్చు. ఇతరుల అవసరాలు, వారి కష్టాలు తెలిసికోవాలంటే, మన అహంకారాన్ని వదులుకోవాలి. ధ్యానం ద్వారా అహంకారాన్ని పోగొట్టుకొని, ఎప్పుడూ మన గురించే ఆలోచించే మనస్తత్వాన్ని దూరం చేసికోవచ్చు.

ఒక చిన్న పిల్లవానికి తన అవసరాలు గురించి బాగా తెలిసి, ఇతరుల అవసరాల గురించి ఆసక్తి లేక పోవచ్చు. కానీ పెద్ద వాళ్ళకు ఇతరుల అవసరాల యందు ధ్యాస ఉండాలి.

మన౦ ఆధ్యాత్మిక సాధన కొంత అహంకారంతో, కొంత పరుల సేవకై మొదలపెట్టి ఉండవచ్చు. మొదట్లో మనం స్వర్గం, మోక్షం మొదలగు వాటి గురించి స్వార్థంతో కూడి ఉండవచ్చు. ఇటువంటి ప్రేరణ లేనిదే కర్మ చెయ్యడం కష్టమనిపించవచ్చు. మనం స్వలాభానికై కర్మ చేసినా, అది ఇతరులకు హాని చెయ్య కూడదు. ఉదాహరణకి: సిగరెట్టు పరిశ్రమలలో పనిచేసేవారు, అందరికీ క్యాన్సర్ వ్యాధిని తెప్పిస్తారు. అది వారి జీవనోపాధి కావచ్చు, కానీ అది ఆధ్యాత్మిక సాధనకు అడ్డు గోడ. వారికి ఎంతో కొంత చెడు కర్మ కలుగుతుంది. ప్రతి దినం మన ఉద్యోగం వలన పరోపకారం జరుగుతోందా లేదా అని ప్రశ్నించుకోవాలి. మన ఉద్యోగం ఇతరులకు హాని చేసేదైతే, దానివలన మనమెంత లాభం, అధికారం పొందినా, దానిని వదిలిపెట్టాలి. అలాంటి ఉద్యోగం కన్నా, పేదరికమే మేలు.

మనం స్వంత లాభానికై, డబ్బు, కీర్తి, ప్రతిష్ఠ లకై పని చేస్తే, నాడీ వ్యవస్థపై ఒత్తిడి కలుగుతుంది. మనల్ని అలసట పెట్టేది సాధారణమైన పని కాదు--స్వలాభానికై చేసే పని; ఏ పనైతే ఇష్టమో అది చేసి, ఇష్టం లేని పని చెయ్యకపోవడం. కర్మ ఫలం గురించి సదా ఆలోచిస్తూ ఉంటే మానసిక ఒత్తిడి, నిద్ర లేమి కలుగుతుంది. జయాపజయాలు గురించి ఆలోచిస్తూ పోతే మనకు ఆందోళన అలసట కలుగుతుంది. మనలో చాలామందికి భవిష్యత్ లో ఏమి జరుగుతుందో అనే ఆందోళన ఎక్కువై, అది దురదృష్ట వశాత్తూ జరిగిన నష్టం కన్నా విపరీతంగా ఉంటుంది. నష్టం ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు. కానీ ఆందోళన నిరంతరం ఉండేది. మనకు మన్నన లేదా ఛీత్కారము కలుగుతుందో తెలీదు. మనకు ఛీత్కార౦ తప్పదని తలుస్తే ఆందోళన ఉండదు.

కానీ భగవంతుని నమ్మిన వానికి మన్నన, ఛీత్కారం రెండూ ఒక్కటే. అవి వానిని మోహంలో దించవు లేదా నిరాశ కలిగించవు. ఎటువంటి నష్టాలు కలిగినా మనలోని దేవుడ్ని నమ్ముకొ౦టే భయముండదు. అటువంటి అనన్య భక్తి మనల్ని ఒత్తిడి, ఆందోళన, అపజయంపై దృష్టి లేక పని చేయిస్తుంది. ఈ విధంగా కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉండేవానికి శాంతము, భద్రత కలుగుతాయి. 312

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...