Bhagavad Gita
18.12
ముక్తసంగో అనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః
{18.26}
సిద్ధ్యసిద్ద్యో ర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే
ఫలాపేక్ష రహితుడును, అహంకారము లేనివాడును, ధైర్యముతోను, ఉత్సాహముతోను గూడిన వాడును, కార్యములు సిద్ధించినను, సిద్ధించకపోయినను వికారము చెందని వాడును అగు కర్త సాత్త్విక కర్తయని చెప్పబడును
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఅశుచిః
{18.27}
హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః
అనురాగము గలవాడు, ఫలాశ గలవాడు, లోభియు, హింసా ప్రవృత్తి గలవాడు, శుచిత్వము లేనివాడు, హర్షశోకములతో గూడినవాడును అగు కర్త రాజస కర్తయని చెప్పబడును
ఆయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో అలసః
{18.28}
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే
యుక్తుడు గానివాడు, పామరుడు, జడుడు, వంచకుడు, ఇతరుల బ్రతుకులను పాడుచేయువాడు, సోమరి, దుఃఖించువాడు, కాలయాపన చేయువాడు తామస కర్త యని చెప్పబడెను
కర్త అనగా ఒక కార్యమును చేయువాడు. పై శ్లోకములు కర్త యొక్క లక్షణములు, నడవడిక వెనుకనున్న మానసిక స్థితి తెలుపుచున్నవి.
స్వార్థపూరితునకు రాజసిక, తామస ఆలోచనలు వచ్చిన, మనస్సు స్థిర భావనలతో గూడి, చేతనము యందు చీకటి నెలకొలును. అట్టివారు తమకు తెలియకుండానే చీకటిలో బ్రతికెదరు. వారికి తెలిసిన ప్రతిఒక్కటీ కాంతివంతమని తలుస్తారు. సరిగ్గా చూడలేక, వాళ్ళు దారుణమైన కార్యాలు చేస్తారు. ఎక్కడైతే ప్రమాదము లేదో వాళ్ళు అనుమానిస్తారు. ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలో వాళ్ళు పరిగెత్తుకు వెళతారు. వాళ్ళకు భాద్యత గల ఉద్యోగాలు ఇచ్చినా, వారి ఉద్దేశ్యములు మంచి వైనా వారి నిర్ణయములను నమ్మలేము.
సాత్త్వికునికి నిర్ధిస్టమైన ఆలోచనలు ఉంటాయి. వానికి జీవితములో ఒక గమ్యముండి ప్రతి రోజూ అమూల్యమైనదని తలచును. మన౦ చిరకాలం బ్రతకము. సాత్త్వికుడు ఆ విషయమును గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఇతరుల మంచికొరకై పని చేయును.
మనమందరికి హృదయపు లోతులలో ఇటువంటి మంచి భావన ఉంటుంది. కాని చాలామందికి ఇతరులకు మంచిని ఏ కారణము లేక ప్రేమతో ఇవ్వడం తెలియదు. ఒకనికి దానము చేసిన వారు దానివలన కలిగే పేరు ప్రఖ్యాతుల గూర్చి అంచనా వేస్తారు. వారికి నిస్వార్థంగా ఒక గొప్ప కార్యమునకై ఇతరులతో కలసి పనిచేయుట తెలియదు. అట్టివారికి నిస్వార్థముతో తమ వస్తువులును, సమయాన్ని, ప్రతిభని ఇచ్చి తద్వారా మానసిక వొత్తిడిని లేదా స్పర్థని తొలగించుకోవటం తెలియదు.
నేను కాలేజీ లో చదువుతున్నపుడు వేసవి సెలవులలో నా గ్రామం చుట్టప్రక్కలున్న గ్రామాలలో తిరగాలని అనిపించింది.
అలా తిరుగుతూ ఉంటే నా గ్రామంకన్నా విలక్షణంగా ఉన్న ఒక గ్రామంకి వెళ్ళేను. ఆ గ్రామస్తులు నిరక్షరాస్యులు. వారికి చదవడం, వ్రాయడం రాదు. వారి గ్రామంలో ఒక పాఠశాల లేదు. వాళ్ళు ఒక ఉపాధ్యాయునికి వేతనమివ్వలేని పేదలు. వాళ్ళు నన్ను ఆ గ్రామంలో నివసించి తమకు చదువు చెప్పమని అడిగేరు. నేను ఎక్కడ నివసించాలని అడిగేను. వారు ఒకని ఇంట్లో ఉండవచ్చని చెప్పేరు. నాకున్నది మూడు నెలల సెలవులు. వాళ్ళకి ఏమి నేర్పించాలని సందిగ్దంలో పడ్డాను.
"మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటారు" అని అడిగేను.
"మాకు కావలసింది వ్యాపారానికి కావలసిన లెక్కలు చేయడం. పురాణాలు చదవగలిగేటంత, చుట్టాలకి, మిత్రులికి ఉత్తరాలు వ్రాసేట౦త అక్షర జ్ఞానం"
"అది చాలా కష్టమైన పని"
"కాని ఇది వేసవి. మేము ఉదయం పొలాల్లో పని చేసి, రాత్రి మీ దగ్గర చదువు నేర్చుకోవడానికి వస్తాము"
వారి పట్టుదల నన్ను కదలించింది. "మీకు పాఠశాల భవనం ఉందా?"
"లేదు కానీ రాత్రికి రాత్రి కట్టేస్తా౦"
నేను నమ్మలేకపోయాను. నా జీవితంలో మొదటి సారి గ్రామాల్లో నివసించే వారి పట్టుదలను చూసేను. నేను ఒక కొండ మీద ప్రదేశాన్ని చూపించి అక్కడ పాఠశాలను కట్టమని చెప్పేను.
రాత్రి 8 గంటలకు ప్రతి ఇంటినుంచి ఒక గ్రామస్తుడు పాఠశాలకు వచ్చేవారు. వాళ్ళు రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసి, రాత్రి చదువు నేర్చుకోవడానికి రావడం నన్ను ఆకట్టుకుంది.
అలాగ ఆ వేసవి అంతా వాళ్ళకు పాఠాలు చెప్పేను. వాళ్ళకి చదవడం, వ్రాయడం, లెక్క పెట్టడం క్రమంగా అబ్బింది. అది వాళ్ళ జీవితంలో సాధించిన గొప్ప కార్యము. అయినప్పటికీ నేను వాళ్ళ దగ్గర చాలా నేర్చుకొన్నాను. వాళ్ళ దగ్గరనుంచి ఒక పైసా కూడా తీసికోలేదు. వాళ్ళ ప్రేమకొద్దీ నాకు వాళ్ళ తోటలో పండిన పళ్ళు ఇచ్చేవారు. నేను వాళ్ళకు ఇచ్చిన దానికన్నా బదులుగా ఎక్కువు పొందేను. సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పినట్లు "ఇతరులకు ఇస్తే మనం ఎంతో తిరిగి పొందుతాము" 416
No comments:
Post a Comment