Bhagavat Gita
1.7
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ
{1.33}
త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ
ఎవరి కొరకు మేము రాజ్యమును, భోగములను, సుఖములను ఆశించుచున్నామో, వారే ప్రాణధనముల మీద ఆశను వీడి యుద్ధము నందు నిలబడియున్నారు
ఆచార్యాః పితరః పుత్రా స్తథైవచ పితామహాః
{1.34}
మాతులా శ్శ్వశురాః పౌత్రాస్స్యాలా స్సంబంధిన స్తథా
గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావలు, మరియు బంధువులును
ఏతాన్న హన్తు మిచ్చామి ఘ్నతో అపి మధుసూదన
{1.35}
అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కింను మహీకృతే
ఓ మధుసూదనా! వీరు నన్ను చంపవచ్చినను, త్రైలోక్యాధిపత్యము లభించినను నేను వీరిని చంపను. ఇక భూమికొరకు చంపజాలనని చెప్పవలెనా?
నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్స్యాజ్జనార్దన
{1.36}
పాపమేవాశ్రయే దస్మాన్ హ త్త్వైతా నాతతాయినః
జనార్థనా! దుర్యోధనాదులను వధించి మనము పొందే సంతోషమేమున్నది? పాపులైన వీరిని జంపిన మనకు పాపమే కలుగును
తస్మా న్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రా న్స్వ బాంధవాన్
{1.37}
స్వజనం హి కథం హత్వా సుఖిన స్స్యామ మాధవ
ఓ మాధవా! అందుచేత, బంధువులతో గూడి దుర్యోధనాదులను చంపుట మనకు తగదు. బంధువులను వధించి మనమెట్లు సుఖించెదము ?
యద్య ప్యేతే న పశ్య౦తి లోభోపహత చేతనః
{1.38}
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్
కథం న జ్ఞేయ మస్మాభిః పాపా దస్మా న్నివర్తితుమ్
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి ర్జనార్థన
{1.39}
లోభముచేత మనసు చెడిన ఈ కౌరవులు కులక్షయముచే కలుగు దోషమును, మిత్ర ద్రోహముచే కలుగు పాతకమును గాంచలేకున్నారు. జనార్థనా! కులక్షయముచే కలుగు దోషమును చక్కగా గ్రహించిన మేము ఈ పాపము నుండి మరలుటకు ఎందుకు ప్రయత్నించకూడదు?
కులక్షయే ప్రణశ్య౦తి కులధర్మా స్సనాతనాః
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో అభి భవత్యుత
{1.40}
కులక్షయము వలన పరంపరాగతములైన ధర్మములు నశించుచున్నవి. ధర్మము నశించుట వలన కులమంతటను అధర్మము వ్యాప్తి చెందును
అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః
స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణసంకరః
{1.41}
అధర్మము వ్యాప్తి నొందినచో కులస్త్రీలు చెడిపోవుదురు. స్త్రీలు చెడిపోవుటవలన వర్ణసంకరము కలుగును ఀ
మనము జీవైక్యాన్ని పొందటానికి ఉద్యోగాలని, కుటుంబాలని, సమాజాన్ని వదిలి ఎక్కడో అడవిలోకి వెళ్ళి తపస్సు చేసికోనక్కరలేదు. బంధు మిత్రులతో కలసి మెలసి వారిలోని దైవత్వాన్ని చూసి మైమరచి, ఇతరులకై అవసరమయితే సుఖాలను త్యజించి వారి సంతోషానికై బ్రతకవచ్చు. ఇదే మనకి దేవునికి మధ్యనున్న స్వచ్ఛంద భావాలను తొలగించుకునే మార్గము.
అర్జునడు శ్రీకృష్ణుని మాధవ -- అనగా మధు వంశీయుడు --, వార్ష్నేయ -- అనగా వ్రిష్ని వంశీయుడు -- అని సంబోధించెను. వంశము ఐకమత్యానికి, నిస్వార్థ ప్రేమకు ప్రతీక. అర్జునునికి తన కుటుంబ బాధ్యతలమీద కలిగిన సందిగ్దత మనకు కూడా వర్తిస్తుంది. మనము పోటీ పడి, స్వార్థ పూరితులమై కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేము. భార్యాభర్తల మధ్యన, తలిదండ్రులు పిల్లలు మధ్యన, అన్నాచెల్లెళ్ళ మధ్యన, ఎక్కడ చూసినా పోటీ కనబడుతుంది. క్రమంగా పోటీ ఇంటినుంచి పాఠశాలలకు, సంస్థలకు, అంతర్జాతీయ సంబంధాలకు ప్రాకుతుంది. దానివలన అపనమ్మకము, సందేహము, ఈర్ష్య కలుగుతాయి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేనికై పోటీ పడనక్కరలేదు. ఎందుకంటే ఆనందము, జ్ఞానము మనలోనే ఉన్నాయి కనుక.
ఒక కుటుంబ సభ్యుడు ఆధ్యాత్మిక జీవనం అవలంబిస్తే తక్కిన వాళ్ళు ప్రభావితమౌతారు. తద్వారా రణ రంగంగా తలపించే ఇల్లు శాంతియుతంగా మారుతుంది. ఇది స్త్రీలకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే వారిలో సహనశీలత, ప్రేమ మొదలగునవి సహజంగా ఉంటాయి. కుటుంబ౦ మీద విశ్వాసం, ఐక్యమత్యంగా ఉండడం తలిదండ్రుల పిల్లల మధ్యనే కాదు. ఎవరైతే మన క్షేమం, బాగు కోరుతారో వారిని కూడా కలుపుకొని ఒక కుటుంబంగా భావించాలి. ఆనందమయి మా అని పిలవబడే యోగిని ఇలాగ చెప్పేరు: "మన దేహంలోని అవయవాలు వేర్వేరు పనులు చేస్తాయి. కొన్ని పనులు తక్కినవాటికన్నా ఉత్తమమైనవి. కానీ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఒక్క అవయవము తన క్రియను కోల్పోకూడదు. అలాగే మన బాంధవ్యాలన్నిటిలోనూ ప్రేమతో మెలగాలి. దీన్ని ఒక అలవాటుగా చేసుకొంటే సమస్త మానవాళి మన కుటుంబమవుతుంది. నాది, నీది అనే భావన పోతుంది. ఇదే భక్తి యొక్క గమ్యం." 38
No comments:
Post a Comment