11.6
తత్రైకస్థ౦ జగత్కృత్త్స్న౦ ప్రవిభక్త మనేకధా
{11.13}
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా
అప్పుడు అర్జునుడు అనేక విధములుగ విభజింపబడియున్న జగత్తును దేవదేవుడగు శ్రీ కృష్ణపరమాత్ముని దేహమునందు ఒక్కచోటనే ఉన్నదానినిగ దర్శి౦చెను
ఇక్కడ యోగులను, శాస్త్రజ్ఞులను విభ్రాంతులను చేసే సృష్టి రహస్యములు చెప్పబడినవి. నేను ఖగోళ శాస్త్రజ్ఞులు, అణు శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయాలను తెలిసికొని ఆశ్చర్య చకితుడైనాను. అదీ అంతా దేవుని మాయలో ఒక చిన్న అంశం మాత్రమే. శాస్త్రజ్ఞులు కూడా ఆ విషయాలను పూర్తిగా విశ్లేషణ చేయలేక సతమత మవుతున్నారు. మనము సూర్యుని ఆచ్ఛాదన లేని కళ్ళతో చూడలేక ఉన్నాము. అట్టిది క్వాసార్స్ అనే నక్షత్రాలు సూర్యునికన్న కొన్ని వేల రెట్లు ప్రకాశవంతమై ఉన్నాయి. ఇంకా న్యూట్రాన్ నక్షత్రాల సాంద్రత ఎంత అంటే ఒక గరిటెడు కోట్లాను కోట్ల టన్నుల బరువు ఉంటుంది. అంత సాంద్రత ఉన్నప్పుడు, గురుత్వాకర్షణ ఎంతో ఎక్కువగా ఉండి, దానివలన న్యూట్రాన్ నక్షత్రం కొన్నాళ్ళకు విస్పోటిస్తుంది. అటు తరువాత కోట్లాను కోట్ల టన్నుల పదార్థము కృష్ణ బిలాల్లో అంతర్ధాన మవుతుంది. మనం "అది ఎటువంటిది? ఆ పదార్థము ఎక్కడికి పోయింది?" అని అడిగితే శాస్త్రజ్ఞులు నుంచి సమాధానము లేదు.
అర్జునుడు సదా మార్పు చెందే విశ్వం దేవునిలో ఇమిడి ఉందని తెలిసికొన్నాడు. గీత దీన్ని ఒక పద్యంలా చెపుతుంది. శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయాలు అర్జునుని అనుభవంతో ఏకీభవిస్తాయి. జీవులను పరిశోధించే శాస్త్రజ్ఞులు జీవులన్నీటిలో డిఎన్ఎ అనబడే రసాయనము ఉంటుందని నిర్థారించేరు. అది మనకు జంతువులతోనూ, పక్షులతోనూ, చేపలతోనూ సంబంధం ఉందని చెపుతుంది. ఇంకా అది మనని విశ్వమంతటా ఉన్న జీవులతో -- ఎందుకంటే విశ్వం లో అగుబడే రసాయనాలు, భూమి మీద ఉన్న రసాయనాలు ఒక్కటే--మనకు సంబంధం ఉన్నదని తెలుపుతుంది.
దేశకాలాలు, పదార్థ-శక్తులు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. అవి ఒక అణువు యొక్క కేంద్రకం నుంచి దూరంగా ఉన్న నక్షత్రం వరకు సమానంగా ఉన్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ పదార్థము, శక్తి ఒకటేనని చెప్పెను. కాబట్టి నా చేతిలోని ఎలక్ట్రాన్ తక్కిన ప్రపంచంతో ప్రభావితమౌతుంది. మనము ఉపపరమాణువులను (subatomic) చూడగలిగితే, నాది అనుకునే వస్తువులు శక్తిలో అంతర్ధానమవుతాయి. విశ్వమంతా కాంతి రూపములోనున్న శక్తితో నిండిపోతుంది. శ్రీరామకృష్ణ పరమహంస కూడా దీనితో ఏకీభవిస్తారు. ఉపపరమాణువులు ఘన పదార్థము కాక, ఒక సెకనులో అతి తక్కువ భాగంలో, కనిపించి మాయ మవుతాయి. ఇది దేవుడు మనతో దోబూచులాడుతున్నాడు అని అనిపిస్తుంది. అతడు కనిపించి, ఎంత వేగంగా అంతర్ధాన మవుతాడంటే, మనమెన్నటికీ ఆయనను పట్టుకోలేమనిపిస్తుంది.
మనము ప్రకృతిని ఎంత లోతుగా శోధిస్తే, సర్వత్రా ఉన్న అంతరిక్షం నుంచి, సూక్ష్మమైన ఉపపరమాణువుల వరకు దేవుని మాయను చూడవచ్చు. నేను దూరదర్శినిలో, సూక్ష్మదర్శినిలో చూసిన పదార్థాలు, అందంగానే కాక, గీతలో చెప్పిన విధంగా భగవంతుని నుంచి ప్రసరణమైనవని నమ్ముతాను. అందువలన నాకు ఆండ్రోమెడా పుంతతో సంబంధం ఉంది. సూక్ష్మరూపాల నుంచి స్థూల రూపాల వరకు దేవునిచే ప్రభావితమౌతాయి.