Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 12

Bhagavat Gita

12.12

యస్మానో ద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః {12.15}

హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః

ఎవని వలన లోకమునకు భయము కలుగదో, లోకమువలన ఎవడు భయము నొందడో, సంతోషము, క్రోధము, భయము, ఉద్వేగము నుండి ఎవడు ముక్తుడో వాడు నాకు ప్రియుడు.

నా అమ్మమ్మ "నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒడిదొడుకులు ఉంటాయి. నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఖాతరు చెయ్యని వారు ఉంటారు" అని చెప్పేది. జీవితం సహజంగా ఎత్తుపల్లాలతో ఉంటుంది. గీత చెప్పేది మనమలా ఉండనక్కరలేదని.

ఈ మధ్య బయోరిథమ్ మీద చాలా ఎక్కువగా చదువుతున్నాను. ఈ సిద్ధాంతం ప్రకారం మనలోని భావాలు కొన్నాళ్ళు పైకి కొన్నాళ్ళు క్రిందకి వెళ్తూఉంటాయి. ఒక వారం ఆనందంగా ఉండి, మరో వారం విచారంగా గడపడమన్నమాట.

మనమీ ఒడుదొడుకులను ఒక పఠం మీద గీస్తే, మన లక్ష్యాలను ఒక ప్రణాళికతో సాధించవచ్చు. కానీ జీవితం మన ఒడుదొడుకుల మీద ఆధారపడి లేదు. గీత చెప్పినట్టు జీవిత మనకణుగుణముగా ఉంటే ఆనందపడి, మనకి వ్యతిరేకంగా ఉంటే ఇంకా ఆనందపడడం సాధ్యం కాదు. అనగా ఎత్తుపల్లాలను పట్టించుకోకుండా నిరంతరం ప్రసన్నంగా ఉండలేము.

మనలో చాలామంది ఆనందం ఒక సమస్య అని అనుకోము. కానీ నిజానికి ఆనందం క్షీణించి మనను నిరాశ కుదేలు చేస్తుంది. అంటే సమస్య నిరాశ. ఏది మీదకి వెళుతుందో, అది తప్పక క్రిందకి వస్తుంది అన్న సత్యం ఇక్కడ వర్తిస్తుంది. ఆశ, నిరాశ జోడీగా వస్తాయి. మనస్సు ఆశతో ఉంటే ఉల్లాసంగా ఉంటాము, లేకపోతే నీరసంగా ఉంటాము. ఆశానిరాశలతో మనస్సు వికలంగా ఉంటుంది.

ఈ రోజుల్లో నిరాశని (depression) ఒక మానసిక వ్యాధిగా పరిగణిస్తారు. కొన్ని కోట్లమంది ఈ వ్యాధితో బ్రతుకుతున్నారు. దానికై వైద్యులు మందులు ఇస్తారు. అవి కొన్ని లక్షణాలను ప్రభావితం చేస్తాయికాని దాన్ని పూర్తిగా వేళ్ళతో పెకళించలేవు.

నిరాశకు మన ఇంద్రియాలు దోహదం చేస్తాయి. ఇంద్రియాలు మనస్సుకు కిటికీల వంటివి. ఒకనికి సంతోషం తొందరగా కలగవచ్చు. వానిలోని కిటికీలు బార్లా తెరవబడి ఉంటాయి. ఎందుకంటే వానికి బాహ్య ప్రపంచంలోని ప్రేరణ కలిగించేవన్నీ కావాలి. వాని చూపు అంతర్గతంలో ఉండి ఏమవుతున్నాదో తెలీదు. ధ్యానం చేయకపోతే వానికి విశ్లేషణం చేసే జ్ఞానం లేదు. కొన్నాళ్ళకి వానికి ఇష్టంలేనిదేదో వస్తుంది. అప్పుడు కిటికీలు మూయబడినవై వానిని బంధీగా చేస్తాయి. ఇదే నిరాశ.

నిరాశతో ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ అంతర్ముఖంగా ఉండి, ఇంద్రియాలు పంపే సంకేతాలను విస్మరిస్తారు. వారిని సినిమాకు తీసికువెళ్తే ఆనందించరు. మాట్లాడినా వాళ్ళు అర్థం చేసికోరు. ఎందుకంటే వారి దృష్టి వారి లోపల ప్రసరిస్తున్నాది. అంటే బయట విషయాలతో వారికి ప్రమేయం లేదు. "నన్నెవరూ ప్రేమించరు. నాకు ఎవరూ ఇష్టం లేదు. నాకు నేనంటే కూడా ఇష్టం లేదు" అని అనుకొంటారు.

నిరాశ వలన అనుబంధాలు ముఖ్యంగా ప్రభావితమౌతాయి. అనుబంధాలు మన సుఖశాంతులకు మూలం. ఇతరులతో కలసిమెలసి ఉండడం వలన మిక్కిలి ఆనందం కలుగుతుంది. దానికి దృష్టిని బాహ్యంగా ప్రసరింపజేయాలి. కానీ ఇంద్రియాల కిటికీలు మూసేస్తే ఇతరులతో సంబంధం ఉండదు. ఆనందంగా వుండే సమూహం లో ఉన్నా ఇంకా నిరాశే కలుగుతుంది.

ధ్యానంలో కూడా ఇంద్రియాలను మూసేసి, మనస్సు అంతర్ముఖం చేస్తాము. కాని ఇది స్వచ్చంధ౦గా చేస్తాము. అలాగే ధ్యానం తరువాత మళ్ళీ మామూలుగా ఉంటాము.

మందులు మూసుకున్న కిటికీలను అప్రయత్న పూర్వకంగా తెరిచి ఉంచుతాయి. దీనివలన కొందరి జీవితాలు బాగుపడచ్చు. కానీ అవి మనస్సులోని చాంచల్యాన్ని అరికట్టలేవు. మనం కిటికీలను ఇష్టానుసారం మూసి, తెరవ గలగాలి.

దానికై కొన్ని చిట్కాలు ఉన్నాయి. మొదటది ఒంటరిగా కాక నలుగురితో కలసి ఉండాలి. నిరాశ కలిగినప్పుడు ఒక గదిలో ఒంటరిగా బంధించు కోవాలని ఉంటుంది. కాని అలా కాక, నలుగురితో కలిసి ఉండడమో, శారీరకంగా శ్రమ -- ఇతరుల ఉపకారం కొరకైతే మరీ మంచిది-- పడడమో చెయ్యాలి. అలా చేస్తే మన చూపు అంతర్ముఖంగా ఉండదు. ఇతరులతో ఉన్నప్పుడు వారిపై చికాకు పడక, వారు చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం నేర్చుకోవాలి. మాట్లాడకపోయినా ఒకరు చెప్తున్నది విని, మందహాసం చేయవచ్చు. మొదట్లో అది నటన అనుకున్నా, క్రమంగా అది అలవాటై పోతుంది.

నిరాశని ఉంకో కోణంలో చూడవచ్చు. అది ప్రాణ శక్తి. అది ఒక కారులోని ఇంధనం వంటిది. ఎంతో ఉల్లాసంగా ఉంటే దాని ఖర్చు ఎక్కువవుతుంది. కొంత మంది ఉల్లాసంగా మాట్లాడుతూ పోతారు. వారి మనస్సు నియంత్రింపబడక ఉంటుంది. కొందరు సహజంగా రోజులో ఎన్నో పనులు చెయ్యాలని వేగం పెంచుతారు. ఇవి అన్నీ ప్రాణ శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తాయి. అది భౌతిక పరంగానేకాక, మానసిక పరంగా కూడా. గుండె వేగం పెరుగుతుంది, నరాలు బిగువుగా ఉంటాయి, ఊపిరి వేగవంతమౌతుంది. వీటన్నిటివలనా ప్రాణ శక్తి విపరీతంగా ఖర్చవుతుంది.

ప్రాణశక్తి క్షీణిస్తూ ఉంటే, ఉల్లాసం కూడా తక్కువవుతుంది. తరచు వెళ్ళే ప్రదేశాలు, ఎప్పుడూ కలిసే బంధుమిత్రులు మనల్ని ఉత్తేజ పరచవు. ఇవన్నీ నిరాశ యొక్క లక్షణాలు.

నిరాశ ఒక విధంగా మంచిదే. ఎలాగంటే మనమెప్పుడూ ఉల్లాసంగా ఉంటే మన ప్రాణశక్తి విపరీతంగా ఖర్చయి, ఇక బ్రతకడానికి మిగలదు. అజీర్తి ఎలాగైతే మన౦ తినే ఆహారం పడకపోతే లేదా ఎక్కువ ఆహారం తినడంవలన కలుగుతుందో, నిరాశ కూడా అలాగే. నిరాశ "నీవు ఇంద్రియాలను సక్రమంగా వాడటంలేదు. నీ మనస్సును స్థిమిత పడనివ్వటం లేదు. నీ మనస్సుకి, దేహానికి విశ్రాంతి ఇవ్వకపోతే నీకు ప్రాణశక్తి లేదు" అనే సందేశం ఇస్తుంది.

నిరాశ కలిగినప్పుడు లైంగిక వాంఛలు తగ్గుతాయి. ఎందుకంటే రతికి మించిన ప్రేరణ వేరొకటి లేదు. అది భౌతికంగానే కాదు. మానసికంగా కూడా. కానీ దానివలన ప్రాణ శక్తి ఎక్కువగా వ్యయమవుతుంది. లైంగిక వాంఛ లేక పోతే, ప్రాణ శక్తిని కూడబెట్టి, భవిష్యత్తులో ఉల్లాసం కలిగినప్పుడు వెచ్చించవచ్చు.

ఈ రోజుల్లో ప్రతీదీ ఉల్లాసంతో ముడి పెడతారు. దూర ప్రయాణాలు, హొటేళ్ళు, సంగీతం, కార్లు, చివరకు పెదవులకు రాసుకునే లిప్ స్టిక్ కూడా. అందరూ ఉల్లాసాన్నే కోరుకుంటే, మానవాళికి ముప్పు తప్పదు. ప్రజలు అన్ని చోట్లా ఉల్లాసం కోరితే, నిరాశ కలుగక మానదు.

ఇంద్రియాలను ఎక్కువగా వాడడం సమస్య కాదు. మన స్వచ్ఛంద నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. మనమెప్పుడూ మనమీదే ధ్యాస పెట్టుకొని, గతాన్ని నెమరువేస్తూ, భవిష్యత్తు గురించి బెంగ పడుతూ ఉంటే నిరాశ ఎక్కువవుతుంది. ఇవన్నీ ప్రాణశక్తిని వృధా చేస్తాయి. సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు:

ఆమె హృదయం ప్రేమతో ఉల్లాసంగా ఉంది

ఎందుకంటే మనస్సు దేవునిపై లగ్నమై ఉంది

అన్ని స్వార్థపూరిత బంధాలను త్యజించి,

అంతర్గతంగా ఉన్న దేవుని నుండి శక్తి పొందుతుంది

ఆమె తనగురించి కాక

ఇతరులలోని ప్రేమ స్వరూపుని సేవకై ఉంటుంది

జీవితమనే సముద్ర౦లోని కెరటాలపై

ఎదురీత చేసి ఆవలి ఒడ్డుకు చేరుతుంది

391

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 3000 BCE...