Bhagavat Gita
3.18
సక్తాః కర్మ ణ్యవిద్వా౦సో యథా కుర్వన్తి భారత
{3.25}
కుర్యా ద్విద్వా౦ స్తథా అసక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్
అర్జునా! అజ్ఞానులగు జనులు ఫలాశతో ఏ విధముగ కర్మల నాచరింతురో, అలాగే జ్ఞానులు ఫలాపేక్ష లేక లోక కళ్యాణార్థము కర్మల నాచరింపవలెను
స్వలాభానికై, ఆనందానికై, పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడకూడదని చెప్పడం చాలా మంది విషయాలలో వ్యర్థం. ఎందుకంటే మనము వాటిని సాధించాలనే ఉద్దేశంతో పెరిగేం. తిరుగుబాటుదారు లేదా విప్లవకారుడు అనే పదాల్ని ప్రసార మాధ్యమాలలో వింటాం. చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకొంటారు. విప్లవకారుల మవ్వాలంటే ఎంతో సాహసం, ఓర్పు, దేవునిమీద విశ్వాసం ఉండాలి. మన కోర్కెలకు, ఇంద్రియాలకు ఎదురు తిరగడం నిజమైన విప్లవం. మనకు తెలిసిన పెద్ద విప్లవకారుడు, జీసస్ "నీ శత్రువులను ప్రేమించు; నిన్ను తిట్టేవారిని క్షమించు; నిన్ను ద్వేషించే వారికి మంచి చెయ్యి" అని చెప్పేరు. బుద్ధుడు తన నిర్వాణ బోధతో పెద్ద విప్లవం కలిగించేడు. అతడు మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని వదులుకోమని బోధించేడు. ఇతరులకు విప్లవంతో ప్రభావితం చెయ్యాలంటే వారిపై ఒత్తిడి పెట్టకూడదు. మన కుటుంబం, సమాజం, దేశం ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎలాగ ఐకమత్యంగా ఉంటుందో చేసి చూపించాలి. శ్రీకృష్ణుడు "భారత దేశాన్ని ప్రభావితం చెయ్యాలంటే స్వార్థాన్ని, స్వలాభాన్ని, కుతంత్రాలని పోగొట్టుకో" అని అర్జునునికి బోధిస్తున్నాడు.
గాంధీ మహాత్ముడు దీనికి తార్కాణము. అతడు కుటీరంలో నివసిస్తూ తన వద్దకు వచ్చిన వీధులు ఊడ్చే మనిషినీ, బ్రిటిష్ సామ్రాజ్య పౌరుడినీ ఒకేలాగ ఆదరించి, గౌరవించేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన రాజ భవనంలో నివసించక తన కుటీరంలోనే చివరివరకూ జీవనం సాగించేరు. ఆయన తనకు ఎటువంటి బహుమానాలు అక్కరలేదని, తన అహింసా వాదాన్ని ప్రపంచమంతా ఒప్పుకొని, పాటిస్తే చాలని అనేవారు. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటుంటే ఆయన ధ్యానం చేసేరు.
మనకు మనశ్శాంతి కావాలంటే మన హృదయంలోనూ, ఇంట్లోనూ శాంతియుతంగా ఉండాలి. అది కుటుంబ సభ్యుల మధ్య సంపూర్ణమైన ప్రేమ వలననే సాధ్యం. క్రమంగా ఆ ప్రేమని వ్యాపింపజేస్తే ప్రపంచాన్ని దాని పరిధిలోకి తెస్తాం. 178
No comments:
Post a Comment