Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 31

Bhagavat Gita

4.31

తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థ౦ జ్ఞానాసి నాత్మ {4.42}

ఛిత్త్వైనం సంశయం యోగ మాత్తిష్ఠోత్తిష్ఠ భారత

అర్జునా! అజ్ఞానము వలన నీ హృదయమున కలిగిన సంశయములను జ్ఞానమనెడి కత్తితో తెగగొట్టి యోగస్థుడవై కర్మ నాచరింపుము. లెమ్ము.

యోగ అనగా మనలోని ఖండితమైన చేతన మనస్సును ఏకం చేసి, జీవైక్య సమానతను పాటించి, భగవంతునిలో ఐక్యం చెయ్యడం. ఈ మధ్య యోగా అనే పదం వాడుకలోకి వచ్చింది. అది నిజంగా ఆసనాలకు సంబంధించినది.

శ్రీకృష్ణుడు మనల్ని సంశయములు లేకుండా చేసికోమని ప్రేరేపిస్తున్నాడు. కొందరు తమను ఇతరులు ప్రేమిస్తున్నారా లేదా అనే సంశయంలో ఉంటారు. ఎందుకంటే వారు మరొకరిని అఖండిత మనస్సుతో ప్రేమించలేరు గనుక. ప్రేమ యొక్క రహస్యం: మనల్ని ఇతరులు ఎంత ప్రేమిస్తున్నారో అడగక, వారిని సదా ప్రేమిస్తూ ఉండడమే. మనం ఎంత ప్రేమించాలని ప్రయత్నిస్తే, అంత ప్రేమని పంచగలం. కాలక్రమంలో మనమొక వ్యక్తిని 10 ఏళ్ల క్రిందటికంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమించాలి. మనం ఇతరుల సౌఖ్యము కోరి, వారిని మనకన్నా ముఖ్యులని తలిస్తే, ప్రతి ఒక్కరిలోనూ ప్రతిష్ఠితమైన దేవుని ప్రేమించగలం.

ధ్యానంలో ప్రవేశించినప్పుడు సహజంగా ఆధ్యాత్మిక సిద్ధాంతాల గురించి కొన్ని సంశయాలు కలుగుతాయి. మనము శాస్త్రజ్ఞులు చెప్పే గురుత్వాకర్షణ వంటి సిద్ధాంతాలని గాఢంగా నమ్ముతాము. కానీ కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మకపోవచ్చు. గురువు భౌతిక సిద్ధాంతాలు నమ్మ వద్దని చెప్పడు. వాటిలాగే ఆధ్యాత్మిక సిద్ధాంతాలను నమ్మాలని చెప్తాడు. "భౌతిక ప్రపంచమే నిజం. నేను నా కళ్ళతో చూసినది, చెవులతో విన్నది మాత్రమే నమ్ముతాను" అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను అనుసరించి తమ జీవితాన్ని పునరుద్ధరించికొన్న వారల దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి గాంధీజీ ఇలా చెప్పేరు: "ఏ వ్యక్తి అయినా నేను ప్రయత్నంతో, నమ్మకంతో, ఆశతో సాధించినది, సాధించగలరు" ఆయన తానొక సామాన్యుడనని చెప్పుకొనేవారు. అదే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు తెలిసినవారి స్వస్వరూపం. ఆ సిద్ధాంతాలు క్రమ౦ తప్పకుండా పనిచేస్తాయి. వాటిని పాటించి మన వ్యక్తిత్వాన్ని, చేతన మనస్సుని మార్చుకోవచ్చు.

మనం ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఒప్పుకున్నా, లక్ష్యాన్ని చేరడానికై తోడ్పడే ధ్యానం, సాధనల మీద సంశయం ఉండవచ్చు. మన ధ్యానం పురోభివృద్ధి అవుతున్న కొద్దీ ఆ సంశయాలు తీరిపోతాయి. ధ్యానంలో మన చేతన మనస్సు లోతులకెళితే, మన కోర్కెలన్నీ ఏకమౌతాయి. అదే సంశయాన్ని తీర్చే నిరూపణ. మన సంశయాలను దూరం చేసికొని, గీతను అనుసరించడం ఎంతో ముఖ్యం.

శ్రీరామకృష్ణ అనేవారు: గీత, గీత, గీత అని స్మరిస్తే తాగి, తాగి, తాగి అనే శబ్ద ప్రకటమౌతుంది. అనగా త్యాగం చేయుట. గీత మన కుటుంబాన్ని, ప్రపంచాన్ని త్యజించమని చెప్పడం లేదు. కానీ మన అహంకారాన్ని, వేర్పాటును త్యజించ మంటుంది. ఎందుకంటే అవే మనకి, మనలో ప్రతిష్ఠితమైన దేవుని మధ్య ఉన్న అడ్డంకులు.

గాంధీజీని ఒకరు ఆయన జీవిత రహస్యం మూడు ముక్కల్లో చెప్పమని అడిగేరు. ఆయన ఈశావాస్య ఉపనిషత్తు నుండి: తేన త్యక్తేన భుంజితాః అన్నారు. అంటే త్యాగం చేసి ఆనందించు. ఆయన ఉద్దేశ్యం మన స్వార్థ పూరిత బంధాలను వదులుకోకపోతే జీవితంలో ఆనందం పొందలేమని. ఎప్పుడైతే మన చిన్న అహంకారాన్ని విడచి, పరోపకారము చేయబూనుతామో, మనం అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తాము. మనల్ని సున్నా చేసికొంటే మన ప్రవీణతను అపరిమితం చేసికొని, ఇతరులను మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాము.

ఇది మన కుటుంబంతో మొదలుపెట్టవచ్చు. మన తలిదండ్రులయందు, సహధర్మచారిణియందు, పిల్లల యందు, మిత్రుల యందు ప్రేమతో వ్యవహరించి, వారి ఆనందాన్ని మన ఆనందంకన్నా మిన్న అని చేతన మనస్సులో కోరి, మన ఆనందం ఆఖరిగా పెట్టుకోవచ్చు. మొదట్లో అది కష్టమనిపించవచ్చు. కానీ త్వరలో కుటుంబంలోని, సమాజంలోని ప్రతివొక్కరి ప్రేమ, గౌరవము చూరుగొంటాము. క్రమంగా మన సాధనతో , నిస్వార్థ జీవిత౦తో మనతో కలిసిన ప్రతివారినీ ప్రభావితం చెయ్యచ్చు. 293

No comments:

Post a Comment

Viveka Sloka 36 Tel Eng

Telugu English All తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వప్రశ్రయసేవనైః । (పాఠభేదః - ప్రహ్వః) ప్రసన్నం తమనుప్రాప్య పృచ్ఛేజ్జ్ఞాతవ్య...