Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 5 Section 13

Bhagavat Gita

5.13

శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ {5.23}

కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః

ఎవడు దేహమును చాలించుటకు పూర్వమే కామక్రోధముల వలన కలిగిన సంక్షోభమును అరికట్ట గలుగు చున్నాడో వాడే యోగి; వాడే సుఖవంతుడు

యోన్త స్సుఖో అంతరారామ స్తథా౦తర్జ్యోతి రేవ యః {5.24}

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధి గచ్ఛతి

ఎవడు ఆత్మయందే ఆనందించుచు, ఆత్మయందే రమించుచు, ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మభూతుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నాడు

లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయః క్షీణకల్మషాః {5.25}

చ్చిన్నద్వైధా యతాత్మాన స్సర్వభూతహితే రతాః

కల్మష రహితులు సంశయ రహితులు, జితేంద్రియులు, సర్వభూతహితులు నగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుచున్నారు

ఈ శ్లోకంలో నిర్వాణ మనే విశేషణం వాడబడింది. దాని అర్థం సృష్టి ఒక గమ్యం వైపు పయనిస్తో౦ది. యోగులు సర్వజీవ సమానత్వాన్ని పూర్తిగా నమ్ముతారు. అదే మానవుల మటుకు సృష్టి యొక్క లక్ష్యం.

మన దుఃఖానికి కారణం పరిణామం ద్వారా ఆ గమ్యాన్ని చేరడానికి వేర్పాటు అడ్డుగా ఉన్నది. మనము కుటుంబ క్షేమం గురించి ఆలోచించకుండా ఉంటే అది మనకి, మరియు కుటుంబానికి నష్టం. భార్య, భర్త ఒకరితో ఒకరు పోటీ పడుతూ, వేర్పాటుగా ఉంటే, అది, వారికి, వారి పిల్లలకి, చివరికి సమాజానికి హానికరం. ఎవరైతే ఇతరుల అవసరాలు తమ అవసరాలకన్నా ముఖ్యమని తలుస్తారో, వారు భద్రతతో కూడి ఉండి ప్రతి ఒక్కరిచే ప్రేమించబడి, గౌరవించబడి ఉంటారు. ఒకడు ఇతరుల ఆనందంలో ఓలలాడితే, వానికి సంతృప్తిగా ఉంటుంది. కాని వేర్పాటుతో, స్వార్థంతో ఉంటే వానికి అభద్రత కలుగుతుంది. ఎందుకంటే మనలోని గాఢమైన కోరిక జీవైక్య సమానత భావమును కలిగించుకోవడం.

జీవైక్య సమానత యోగుల వరికే పరిమితం కాదు. శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించి ప్రపంచంలోని అన్ని జీవుల సంక్షేమం, ప్రపంచ శాంతికి ఎంతో అవసరమని గ్రహించేరు. ఒక్క మానవుల, జంతువుల మధ్య జీవైక్య సమానత ఉంటే సరిపోలేదు పర్యావరణం--అనగా చెట్లు, పంట భూమి, పీల్చే గాలి -- యందు కూడా దాన్ని పాటించాలి. మన అవసరాలు, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపుతే మనకి మనుగడ సాగదు. కాబట్టి నిర్వాణము మన దేశానికే పరిమితం కాదు.

మన మతంలో పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతము వలె నుండి, మన బాధ్యతలు మనమే నిర్వహించి, మనల్ను మనమే ఉద్ధరించుకోవాలని చెప్పబడినది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని తప్పుగా విధి వ్రాతతో పోలుస్తారు. కర్మ సిద్ధాంతం ఒక పరిస్థితి తలిదండ్రుల, బంధుమిత్రుల వలన కాక, మన పూర్వ కర్మల వలననే కలిగిందని చెప్తుంది. విధి బంధమైతే, కర్మ సిద్ధాంతం స్వతంత్రం. ఎందుకంటే మన కర్మ మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కనుక. మనము గట్టి ప్రయత్నం చేసి, దృష్టిని కేంద్రీకరిస్తే నిర్వాణమనే ఉత్కృష్టమైన స్థితిని పొందుతాము.

జీవైక్య సమానత గూర్చి తెలియనంత కాలము వేర్పాటుతో, బాధలతో కూడిన పునర్జన్మ ఎత్తుతూనే ఉండాలి. భౌద్ధులు (Tibetan Book Of Dead) మరణం తరువాత కర్మ శేషం ఉన్నవారు బార్డో అనే త్రిశంకు స్వర్గం వంటి ప్రదేశంలో ఉంటారని తలుస్తారు. అక్కడ పునర్జన్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయిస్తారు. ఉదాహరణకి ఒకడు జీవితమంతా జులాయిగా బ్రతికి ఉంటే, వాడు పుట్టి, జులాయిగా తిరిగే పిల్లలను కంటాడు. తద్వారా తన పాపానికి పర్యావసానము అనుభవిస్తాడు. ఈ విధంగా మన సంస్కారాలు మన జన్మని నిర్ణయిస్తాయి. ఒక రైల్వే స్టేషన్ లో వచ్చి పోయే బండ్లను గూర్చి స్పీకర్ లో ప్రకటిస్తారు. మన బండి గురించి ప్రకటిస్తే మనం దానినెక్కి ప్రయాణం చేస్తాము. అలాగే బార్డో కూడా. మన పూర్వ సంస్కారాలు మన జన్మని నిర్ణయిస్తాయని భౌద్ధులు నమ్ముతారు.

నేను చిన్నవారికి తమ తలిదండ్రుల బలహీనతలను అర్థం చేసికొని బ్రతకమని సలహా ఇస్తాను. ఎందుకంటే ఆ బలహీనతలు వారికి జన్యువుల ద్వారా సంక్రమిస్తాయి కనుక. మనలోని బలహీనత ఉంకొకరిలో చూస్తే మనకు చికాకు కల్పించవచ్చు. కాబట్టి మన తలిదండ్రుల, వృద్ధుల, ఇతరుల బలహీనతల వలన చికాకు పడకూడదు. ఎందుకంటే అవి మనలోనూ ఉన్నాయి కనుక. అలాగ ప్రవర్తించగలిగితే మనలోని చెడు సంస్కారాలెన్ని ఉన్నా, వాటిని అధిగమించ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లగలం.

ధ్యానం ద్వారా ప్రకృతి వలన కలిగే పరిణామం గురించి నిరీక్షింపక, ఇప్పుడే, ఇక్కడే పొందవచ్చు. పర్యావరణం కొన్ని వేల సంవత్సరాలు తరువాత మనకు నేర్పే పాఠం గురించి వేంచేయక ఇప్పుడే "నా భవిష్యత్ ను ఈ జన్మలోనే నిర్ణయిస్తాను. రాత్రింబవళ్ళు నాలోని స్వార్థం విడనాడడానికి శ్రమించి, జీవైక్య సమానత దిశపై జీవితం కొనసాగిస్తాను" అని చెప్పగలగాలి. ఈ విధంగా జీవితాన్ని పాటించేవాళ్ళు బహు అరుదు. పతంజలి ఉత్సాహంగా, కష్ట పడి శ్రమించే వ్యక్తి అట్టి ఉత్కృష్టమైన భావన కలిగి ఉంటాడు అని చెప్పెను. ధ్యానంలో పరిపక్వత పొందాలంటే జ్యోతిష్యం వంటి మూఢ నమ్మకాలు లేకుండా, నడుం బిగించి, పరిశ్రమ చెయ్యాలి. ఏ దేశాకాలమానాలలోనైనా గాఢమైన ధ్యానం ద్వారా జీవైక్య సమానతా జ్ఞానాన్ని పొంది, మానవాళి పరిణామంలో పొందగలిగే ఉత్కృష్టమైన గమ్యాన్ని చేరగల౦. ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి సంస్కారములు ఉన్నా, జ్యోతిష్యం ఏమి చెప్పినా, ఉత్కృష్టమైన లక్ష్యం దిశగా జీవించవచ్చు. ఎందుకంటే మన ఆత్మ, అనగా మన వ్యక్తిత్వము, అఖండమై, అపరిమితమై, మార్పు చెందనిదై యున్నది. 329

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...