Bhagavat Gita
7.2
జ్ఞానం తే అహం సవిజ్ఞాన మిదం వక్ష్యా మ్య శేషతః
{7.2}
యజ్ఞాత్వా నేహ భూయోఅన్యత్ జ్ఞాతవ్య మావశిష్యతే
దేనిని తెలిసికొనిన పిదప ఈ లోకమున తెలిసికొన దగినది మరియొకటి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును నీకు సమగ్రముగ చెప్పెదను ఀ
ఒకమారు బుద్ధుడు తన శిష్యులతో షింషాపా వనంలో కూర్చొని ఉన్నప్పుడు దేవుడున్నాడా లేడా, అమృతమైన శరీరం ఉంటుందా, విశ్వానికి మొదలు, అంతం ఉన్నాదా అని అనేక ప్రశ్నలు శిష్యులు అడిగేరు. దానికి జవాబుగా బుద్ధుడు కొన్ని ఆకులను చేతితో తీసికొని "ఎక్కడ ఎక్కువ ఆకులున్నాయి: నా చేతిలోనా, చెట్టుమీదా?" అని అడిగేడు.
అందరూ ఏకగ్రీవంగా చెట్టు మీదే అన్నారు.
"అలాగే నా చేతన మనస్సులో మీరు చూడగల దానికన్నా ఎక్కువ ఉంది, మీ అవగాహనకన్నా అమితంగా ఉంది, మీకు ఉపయోగపడేదానికన్నా ఎక్కువ ఉంది. నేను మీకు ఇచ్చేది మీ దుఃఖాలకు కారణమైన జీవితం యొక్క జ్ఞానం"
శ్రీకృష్ణుడు "నేను నీకు జ్ఞానం మరియు విజ్ఞానం ఇస్తాను. నీవు తెలిసికోవలసిందల్లా అదే" అని చెప్పెను. దాని అర్థం ఇక తెలిసికోవలసినది ఏదీ లేదని కాదు. ఈ రెండూ జీవితాన్ని ఒక కళగా మారుస్తాయి.
ఆది శంకరులు జ్ఞానమనగా ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానమనగా ఆధ్యాత్మిక అనుభవము అని చెప్పెను. ఆధ్యాత్మిక జ్ఞానము తక్కిన జ్ఞానము వలె కాక జీవితం గూర్చి ప్రత్యక్ష అనుభవానికి వచ్చు జ్ఞానము. శ్రీరామకృష్ణులు చెప్పినది భగవంతుడు అందరి శరీరాల్లో ఉన్నాడని. అదే మనం సమాధి స్థితిలో తెలిసికొ౦టాం. అతను ఇంకా ఇట్లు చెప్పెను: "పాలు గురించి మాత్రమే విన్నవాడు అజ్ఞాని. పాలును చూసినవానికి జ్ఞానం కలదు. ఎవడైతే పాలను త్రాగి బలం పుంజుకొన్నాడో వానికి విజ్ఞానం ఉంది"
నా దృష్టిలో జ్ఞానం అనగా ఆధ్యాత్మిక వివేకం. విజ్ఞాన మనగా దానిని రోజువారీ జీవనానికి ఉపయోగించడం. జ్ఞానం ప్రపంచంలో చిరకాలం ఉండే సత్యములు. విజ్ఞానము ఆ జ్ఞానాన్ని కర్మకై వినియోగించడం. ఎలాగంటే మన సమస్యలు పరిష్కరించుకోవటానికి, మన బంధాలను గట్టి పరచుకోవటానికి, ఇతరులను ఎడంగా ఉంచకుండా కలిసి మెలసి ఉండాలని చెప్పడానికి. ఎవరైతే జీవిత ఐక్యాన్ని అవగాహన చేసికొని అలా జీవించేరో, వారు జీవితం యొక్క హృదయ స్థానాన్ని తెలిసినవారు. ఎలాగంటే ఒక ఇంటి యజమాని బాగా తెలిసి ఉంటే, ఆ ఇల్లంతా తెలిసినట్టే. జీవితం యొక్క మూలము తెలిసికొ౦టే ఒక సమస్య, దాని పరిష్కారము సులభంగా తెలుస్తాయి.
దీనిలో విచిత్రమైనదేమీ లేదు. అది వివేకము, జ్ఞాన సంబంధితము. చాలా ఏళ్ల ధ్యానం వలన జీవులన్నీ ఒకటే అనే జ్ఞానం కలిగితే, మనము ఎడంగా ఉండలేము. మనం ఒకరిని స్వార్థానికై ఉపయోగించము. ఎవరినీ విచక్షణతో చూడం. మన బాగు ఇతరుల బాగు మీద ఆధారపడి ఉన్నదని తెలిసికొ౦టాము. మన ప్రస్తుత ప్రపంచ సమస్యలు -- వీధిల్లో హింసాకాండ, పర్యావరణ కాలుష్యం, ఒంటరితనం, కుటుంబాలు విచ్ఛిన్న మవడం, బంధాలు తెగిపోవడం-- గురించి తెలిసికొ౦టే చాలదు. మనకు కావలసింది విజ్ఞానం. తద్వారా ప్రజల హృదయాలలో, మనస్సులలో కలిగిన చీలికలు పూర్చి, వారిలో నమ్మకం, ఐకమత్యం కలిగించాలి.
మనకా చాకచక్యం ఒక రోజులో రాదు. మనకు పరోపకారము చేయాలనే తలంపు గాఢంగా ఉండాలి. కొన్నాళ్ళు సాధన చేసి మీ సమస్యలకు పరిష్కారం కనుగొన్న తరువాత, మీరు విశ్రాంతిగా కూర్చోలేరు. మీరు బాధల్లో ఉన్నవారికి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో వివరించాలి. అది చాలా పొందికగా చెప్పాలి. "మీరిద్దరూ పోటీ పడకూడదు. మీకు తెలీదా భార్యాభర్తలు ఒకటేనని?" అని అంటే చాలదు. మనం దానిని ఆచరణలో పెట్టి, మనని చూచేవారిలో "ఆ ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళు ఒకరికి మరొకరు సహాయం చేసికొ౦టారు. నేనూ అలాగే ఉండాలి" అనే భావన కల్పించాలి. కొన్ని సమస్యలు ఏళ్ల తరబడి ఉండచ్చు. మనం వాటిని పరిష్కరించకుండా విశ్రాంతి తీసికోలేం. మన కోరిక, ఏకాగ్రత ఎంత పదునుగా ఉండాలంటే అవి సూటిగా సమస్య యొక్క గుండెకు తగలాలి. ఆ సమస్యల లక్షణాలను, వాటి కారణాలు తెలిసికొని వాటిని సృజనాత్మకముగా పరిష్కరించగలగాలి.
ఈ సామర్థ్యము జీవులంతా ఒక్కటే అన్న జ్ఞానం ద్వారా వస్తుంది. అప్పుడు మనం చుట్టూ ఉన్నవారు -- పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, వగైరా--వేర్వేరుగా కనిపించినా, మనకీ వాళ్ళకీ మధ్య ఎటువంటి తేడా లేదని క్షణమైనా మరచిపోకూడదు.
ఈ దశకు చేరిన తరువాత బంధుమిత్రులిని అపార్థం చేసికోవడం జరగదు. నేను అభిప్రాయాలలో తేడా ఉండదని అనను. నా అనుభవంలో అభిప్రాయ భేదాల వలన అనుబంధాలు చెడిపోవు. అవి నమ్మకం, ప్రేమ లేకపోవడం వలన చెడిపోతాయి.
ఇది మన బంధుమిత్రులకే పరిమితం కాదు. మానవాళి అంతటకీ వర్తిస్తుంది. మీకు విజ్ఞానం ఉంటే, ఎక్కడికి వెళ్ళినా శాంతి దూతగా వెళ్తారు. ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఉంటే, ఇరు పక్షాలను అర్థం చేసికొని, మెలగుతారు. మనం సమస్యలను చూసినా, ఇరుపక్షాల బాగుకై వారిలోని ఐకమత్యాన్ని చూస్తాము. ఒకరిని మరొకరు అర్థం చేసికొనేలా చేస్తాము. ఇది చాలా కష్టంతో కూడిన పనైనా, కొన్నాళ్ళకు అందరికి సబబైన పరిష్కారం పొందగలరు.
నేను భారత దేశంలో ఉన్నప్పుడు, ఒక కాలేజీ లో ఉపాధ్యాయుడుగా ఉన్నాను. అక్కడ హిందువులకు ముస్లింలకు పడేది కాదు. నా తరగతిలో వాళ్ళు ఎడంగా ఉండేవారు. నాకు అది చాలా బాధ కలిగించింది.
నా ముస్లిం మిత్రుడు అక్కడే నాలాగే ఉపాధ్యాయుడు. అతడు నేను ఒకే కాలేజీ లో చదివేము. కాని పరిస్థితుల వలన వేర్వేరు దారులలో వెళ్ళేం. నాకు అతని కాలేజీలో ఉద్యోగం వచ్చినపుడు అక్కడ ఎలాగ బ్రతకడం అనే విచారం కలిగింది. నేను రైలు దిగి ఒక జట్కాని కిరాయి చేద్దామని చూస్తూ ఉంటే, నా ముస్లిం మిత్రుడు కనిపించి నన్ను ఆప్యాయంగా పలకరించి తన ఇంటికి ఆహ్వానించేడు.
ఒక ముస్లిం ఇల్లు ఖాళీగా ఉండడంతో మేమిద్దరం అక్కడే నివసించడం మొదలుపెట్టేము. కొందరు మేము అపాయకర స్థితిలో ఉన్నామని, మా ఇద్దరికీ చేటని చెప్పేవారు. మేమది లెక్క చేయక, చెడు కలిగితే ఇద్దరం కలిసి అనుభవిద్దామని నిర్ణయించుకున్నాం.
మేమది ఏదో రాజకీయ పరంగా వ్యూహాత్మకంగా చేయలేదు. ప్రతిఒక్కరికి తెలుసు మేము మంచి మిత్రులమని. అలాగే మా మతాన్ని మేము పాటిస్తున్నాము. చుట్టుప్రక్కలవారు మమ్మల్ని అనుమానించి మామీద నిఘా వేసి ఉంచేరు. క్రమంగా మా మైత్రి మరింత గట్టి పడింది. మమ్మల్ని చూసి మా విద్యార్థులు కొందరు సిగ్గు పడ్డారు. ఒకరి తరువాత ఒకరు కలసి కూర్చొనేవారు. కొంత కాలానికి వాళ్ళు తమలో మాట్లాడుకునేవారు. క్రమంగా వాళ్ళు నవ్వుకుంటూ, కలసి పనిచేయడం మొదలుపెట్టేరు. ఇద్దరు సామాన్య మానవులు ఐకమత్యంతో ఉండి, చుట్టు ప్రక్కలి సమాజాన్ని ఎలా మార్చ గలరో అన్న అంశం ప్రత్యక్షంగా మా కళ్ళను తెరిపించింది. ఇదే విజ్ఞానమంటే. జీవించడానికి దీన్ని మించిన కళ వేరేది లేదు.
No comments:
Post a Comment