14.12
యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్
{14.14}
తదోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే
సత్త్వగుణము వృద్ధియైనపుడు జీవుడు దేహమును విడిచినచో ఉత్తమ జ్ఞానులు పొందెడి పుణ్యలోకములను పొందును.
రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే
{14.15}
తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే
రజోగుణము వృద్ధియైనప్పుడు మరణించువాడు కర్మ సంగత్వము గలవారియందును , తమోగుణము వృద్ధి చెందినపుడు మరణించువాడు మూఢజీవులయందును జన్మించుచున్నాడు ఀ
దేవుడు మనందిరిలో ఉన్నా, మన జీవితాలలో ఎందుకు ఇన్ని తేడాలున్నాయి? ఎందుకు చాలామంది దుఃఖంతోనూ, కొంతమంది సుఖంగాను ఉన్నారు? ఎందుకు కొంతమంది విజయం సాధించి, వాళ్ళు కోరుకొన్నది పొంది, నిరాశతో మరణిస్తున్నారు? ఎందుకు కొంతమంది సఫలమై, మరికొంతమంది ఏమీ కోరక, ప్రశ్నింపక ఉన్నారు ?
జ్ఞానమున్న ప్రతి మానవుడు ఈ ప్రశ్నలను అడుగుతాడు. గీత మన జీవితానికి మనమే కారణం అని చెప్పుచున్నది. అట్లే మన వైఖిరిని మార్చుకోవచ్చునని చెప్తుంది. నేను ఇంతకన్నా ఉపయోగకరమైన, దయతోకూడిన, ఆశ కలిగించు సమాధానం ఎక్కడ చూడలేదు.
ఈ రెండు శ్లోకాల వెనుక పునర్జన్మ గూర్చి ఉంది. కాని ప్రస్తుత జన్మకే వర్తిస్తుందని నమ్మితే శ్రీకృష్ణుని బోధ బాగా అర్థమవుతుంది. ప్రతి రోజూ మన ఆలోచన, మాట, క్రియ లతో మన జీవితాన్ని మలచుకొంటున్నాం. మనం స్వార్థంతో మనగురించే ఎప్పడూ ఆలోచిస్తూ ఉంటే, మనకు అభద్రతతో గూడిన, కఠినమైన, పట్టుగల, వేర్పాటు గల జీవితం అనుభవిస్తాము. అట్లు గాక నిస్వార్థతతో ఉంటే మనం భద్రంగా ఉంటాము, దాన్ని పరులకు వర్తింపజేస్తాము. మనం దేవుడు, విధివ్రాత, పర్యావరణము, లేదా సంఘము వీటికి కారణమని చెప్పలేము. పెద్దవారైన వారు ఇలా చెప్పాలి: "నేను నా చేజేతులారా చేసుకొన్నాను. నా మూర్ఖపు ఎన్నికల వలన ఈ గడ్డు పరిస్థితి నావలననే వచ్చింది. నేను మళ్ళీ మంచి ఎన్నికలను చేసి ఈ సమస్యను అధిగమిస్తాను."
క్రిస్మస్ కరోల్ అనే పుస్తకంలో ఇలా వ్రాసి ఉంది: స్క్రూజ్ ప్రతిరాత్రి స్వార్థపూరితుడై నిద్రపోతాడు. ఒక రాత్రి అతని సంస్థలో భాగస్వాముడు, మార్లీ ఆత్మ అతనిని చూడడానికి సంకెళ్లతో వస్తుంది. "ఈ సంకెళ్లను ప్రతి అప్పుతోనూ, ఒప్పందంతోనూ, స్వార్థపూరిత ఆలోచనతోనూ నేను చేసినదే. నువ్వూ ఇటువంటి సంకెళ్ళనే చేసుకున్నావు" అంటుంది. స్క్రూజ్ భయకంపితుడైనాడు. మరుసటి రోజు అతను నిశ్వార్థుడిగా మారి, జీవితాన్ని సుఖంగా గడుపుతాడు.
మనమూ ఎందుకలా మారలేము? మనం ప్రతి ఉదయం దయ, అసంగత్వం, ఓపిక, సాత్విక స్వభావంతో ఉందామని నిర్ణయించ కొంటాం. దినం గడుస్తున్నకొద్దీ మనం ఆ గుణాలను కోల్పోయి భార్యా, పిల్లలమీద కోపం ప్రదర్శిస్తా౦. రాత్రి అయ్యేసరకి ఆ క్రిందటి రోజు -- నిర్ణయాలు తీసికొనక ముందు -- లాగే ఉంటాం. ఏమిటవుతున్నాది?
సంస్కారములు నిఘూడమైన శక్తులు. ఉపనిషత్తులు మనం నిద్ర పోతున్నప్పుడు అవి మాయమైపోవు అంటాయి. దేశ, కాల పరిమితులు లేక సంస్కారములు వాటికి తోచినట్లు చేసి మనకు భ్రాంతి, భయాలు కలిపిస్తాయి. కలలులేని సుషుప్తిలో అవి నిష్క్రమిస్తాయి. ఆ స్థితిలో రాజు రాజు కాడు, పేదవాడు పేదవాడు కాడు, ముసలితనము, యుక్తవయస్సు లేదు, ఆడ మగ భేదము లేదు, రోగము, దుఃఖము లేవు. మనమాస్థితి నుండి నిద్ర లేవగలితే గడచిన కాలంతో సంబంధంలేని నిర్ణయాలు తీసికోగలం. కాని సుషుప్తిలో మనము స్పృహలేక ఉన్నాము. కొంత సమయం తరువాత సంస్కారాలు మేల్కొ౦టాయి. అవి మనల్ని వేకువలో ఉన్న కోర్కెలు, భయాలు, ఊహలు, క్రిందటి దినమెలా ఉన్నామో వాటితో గూడిన స్థితికి తెస్తాయి-- ఒకే మనిషేగాని, చిన్న మార్పుతో.
ఉపనిషత్తులు సంస్కారాలు జీవుడు మరణించిన తరువాత కూడా ఉంటాయి అని చెప్పినాయి. మనం ఎలాగైతే సుషుప్తి అవస్థ నుంచి బయటకువచ్చి క్రిందటి రోజు విషయాలను మనస్సుకు ఎక్కించుకుంటామో, అలాగే మరొక జన్మలో క్రిందటి జన్మ సంస్కారాలను పొందుతాము.
అందుకే హిందువులు, బౌద్ధులు మరణానికి ముందున్న చేతనాన్ని ముఖ్యమని భావిస్తారు. ఈ విధంగా మన ప్రస్తుత జన్మ పూర్వ జన్మల పాప పుణ్యాల ఫలము వలననే కలిగింది. ఇక్కడ కాకతాళీయం అంటూ ఏమీ లేదని హిందూ, బౌద్ధ గురువులు చెప్తారు. జీసస్ చెప్పినట్టు: "ఒక్క పిచ్చుక కూడా నా తండ్రి ఆజ్ఞ లేనిదే పడదు".
నేను అమెరికాకి వచ్చినపుడు లే ఓవర్ ప్లాన్ అనే వ్యాపార అంశాన్ని గురించి తెలుసుకొన్నాను. ఒక పెద్ద షాపులో ఎంతో విలువైన, ఉపయోగం లేని వస్తువును చూస్తున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి "దీన్ని కొంటారా? ప్రస్తుతం ఇది 60 డాలర్లు మాత్రమే". నేను నవ్వి "నా దగ్గర 6 డాలర్లు మాత్రమే ఉన్నాయి" అన్నాను. "[ఫరవాలేదు. అది మొదటి వాయిదా లాగా ఉపయోగపడుతుంది. మేము దీన్ని లోపల పెడతాం. మీరు ప్రతినెలా 6 డాలర్లు కట్టండి." "నేనిది ఇప్పుడే తీసికెళ్లగలనా?" అని అడిగేను."అలా వీలు కాది. ఇది లే అవే . అంటే మీగురించి ఇక్కడ అట్టే పెట్టి ఉంచుతాం. మీరు డబ్బంతా కట్టిన తరువాత తీసికెళ్ళచ్చు" అన్నది. నేను ఆవిడతో నా 6 డాలర్లు నా దగ్గరే ఉంచుకుంటానన్నాను.
కర్మ ప్రపంచంలో లే అవే . ప్రతి జన్మలో నిస్వార్థ కర్మలు -- కొంతమందికి సహాయం చేసి, కొన్ని మంచి కార్యాలు చేసి-- వలన కొంత మంచి కర్మను పోగు చేసికొన్నాం. అది ఎక్కడో మన పేరు మీద దాచిపెట్టబడింది. టిబెట్ భౌద్ధులు చెప్తారు: మరణించిన తరువాత మనకి విశ్రాంతి లభించి క్రిందటి జన్మలో చేసిన తప్పులను చూస్తాం. ఎందుకంటే ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండేందుకు. ఆ తరువాత మన ఖాతాలోని మంచి లేదా చెడు కర్మ ఫలాన్ని ఉపయోగించుకొని ఏ దేశంలో, జాతిలో, తలిదండ్రులకు పుట్టాలో నిర్ణయించబడుతుంది.
నేనిది ఒక మిత్రుడికి చెప్తే ఆమె ఇలా అడిగింది "నాకే గాని నిర్ణయించే శక్తి ఉంటే ఏ రాజ కుటుంబంలో ఎందుకు కోరుకోలేదు?"
"అదే ఇక్కడి కిటుకు. నువ్వు నిర్ణయించలేవు. నీ వాక్కు, ఆలోచన, కర్మ బట్టి ఆ నిర్ణయం నీ ప్రేమేయం లేకుండా జరిగింది". మనం మరణించినపుడు ఒక కంప్యూటరు లాంటి వ్యవస్థలో మన పాప పుణ్యాల చిట్టా ఉంటుంది. దానికి అపరిమితమైన జ్ఞాపక శక్తి ఉంది. అది మన పాప పుణ్యాల చిట్టా చూసి, ఎక్కడైతే ఖాళీ ఉందో చూసి, మీ కర్మానుసారం పుట్టించే తలిదండ్రులు, అన్నదమ్ములు, పొరుగింటివారు, పట్టణం, దేశం మొదలైనవాటిని నిర్ణయిస్తుంది. మన సంస్కారాలను, మనం పుట్టబోయే వారి సంస్కారములతో పోల్చబడుతుంది. మనం పుట్టే సమయం ఆ సంస్కారాల ఫలానికై నిర్ణయింపబడుతుంది. మన సంస్కారాల బట్టి మన నడవడిక, మిత్రుల , సహ ధర్మచారిణి, పిల్లల ఎంపిక కలుగుతుంది. మీరు అల్లరిగా పెరుగుతే, మీకు అల్లరిచేసే పిల్లలు పుట్టవచ్చు. లేకపోతే ఎలా నేర్చుకొంటారు? మీరు మంచి భార్య అయితే, మరు జన్మలో మీకు మంచి భర్త లభించి, మంచి భార్యగా మెలగడానికి అవకాశం దొరుకుతుంది.
ఇది బాగా అర్థం చేసుకొంటే, పునర్జన్మ నిఘూడమైనది కాక మన జీవిత౦, కాలానికి ఒక బలమైన, సముచితమైన వివరణ అవుతుంది. అది జీవితాన్ని ఒక అర్థవంతమైనదానిగా చూపిస్తుంది. ఆశను కల్పిస్తుంది. మనం మనకున్న ప్రతీదానిని, స్పృహతో కాకుండా, కోరికల వలన పొందినవి. ప్రపంచం ఒక పాఠశాల. మనం ఎలా చదువుకుంటామో మన చేతిలో ఉంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎదురయ్యే సమస్యల గూర్చి మనం నేర్చుకొంటాం. మనం ఒక సమస్యను విజయవంతంగా ఎదుర్కో గలిగితే, భౌద్ధుల౦టారు, అది మళ్ళీ పునరావృత్తం అవ్వదు . ఆ పాఠాన్ని మళ్ళీ నేర్చుకోవలసిన అవసరం లేదు.
భారత దేశంలో పునర్జన్మ ఉందని ఎక్కువమంది నమ్ముతారు. కాని పశ్చిమ దేశాలలో అదొక వింత పదం. నాకు పునర్జన్మ గురించి ప్రసంగం ఇవ్వండి అని ఆహ్వానాలు వస్తాయి. నేను "ఈ జన్మలో ఏం చేస్తున్నానో అదే నాకు ముఖ్యం" అని చెప్పదలుచుకుంటాను. క్లిష్ట కాలంలో ఓర్పు, సహనం తో ఉండడానికి ఈ పునర్జన్మ సిద్ధాంతం ఉపయోగానికి వస్తే మంచిదే. దాన్ని మించి పునర్జన్మ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. పనికిరాని ఆలోచనలు వస్తాయి.
ఈ నేపథ్యంలో ఈ విశేషమైన శ్లోకాలు మన అవగాహానికి వస్తాయి. నేను రెండవ శ్లోకాన్ని ముందు వివరిస్తాను. ఎందుకంటే నా ధ్యేయం ఆశను పుట్టించడం.
శ్రీకృష్ణుడు తామసికుడు మరణిస్తే వాడు అటువంటి కుటుంబంలోనే పుడతాడు అని చెప్పేడు. నాకిది సమంజసమని అనిపిస్తుంది. వాడు తన తమోగుణాన్ని గుర్తించి తనను మార్పు చేసికోవాలి. ఎలాగంటే ఒక విద్యార్థి ఒక తరగితి నుండి పై తరగతికి వేళ్లాలంటే తనంతట తానే కృషి చేయాలి. కాబట్టి ఆ తామసికుడు మాంద్యంతో కూడిన కుటుంబంలో పుడతాడు. తండ్రికి ఉద్యోగం లేదు. తల్లి అతిగా తినేది. కుటుంబంలో అందరూ మొద్దులే. వాళ్ళకి పట్టుదల లేదు. కర్మ చెయ్యడానికి ముందుకు రారు. ప్రతీది జాప్యం చేస్తారు. వాడు అట్టి కుటుంబానికి సహజంగా సరియైన జోడు.
భారత దేశంలో పూర్వం బ్రేక్ ఇన్స్పెక్టర్ బండ్లను ఆపి, వాటి బ్రేక్ ను పరీక్ష చేసేవాడు. బండి ఎలా ఉన్నా, బ్రేక్ పనిచేస్తే వదిలేసేవాడు.
అలాగే తామసికుని బ్రేక్ చక్కగా పనిచేస్తుంది. ఎవరికైతే పట్టుదల లేదో, కర్మలు చేయరో, జాప్యం చేస్తారో వారి బ్రేక్ లు శాశ్వతంగా పెట్టబడి ఉన్నాయి. వాహనంలో ఏ లోపం లేదు. తగినంత ఇంధనం టాంక్ లో ఉంది. తామసికుడు ఈ జన్మ గురించి ఇలా చెప్పలేడు: "నాకొక డొక్కు బండి ఇవ్వబడినది. వెనక్కు తీసికో౦డి. మంచి బండిని ఇవ్వండి." జరిగినదానికి కారణం బండి బ్రేక్ లో ఉంది. నేను దానివలన ఎటువంటి అరుగుదల ఉంటుందో చెప్పలేను. ఇదే తమస్ లో అవుతుంది. ఇది బాగుచేయలేని పరిస్థితి కాదు. తామసికుడు కాలు బ్రేక్ మీదనుంచి తీసి, ఇంధనం సరఫరా చేస్తే, ముందుకు దూసుకెళ్లగలడు.
వాహనానికి విద్యుత్ సరఫరా చేసే బ్యాటరీ ఒక్కొక్కప్పుడు పాతదై పనిచేయదు. అలాగే తామశికుడికి శక్తి ఉండదు. వాహనం బాగా ఉండవచ్చు, ఇంధనం తగినంతగా ఉండవచ్చు, కానీ వాహనాన్ని నడిపించే శక్తి బ్యాటరీ లో లేదు. నా భార్య క్రిస్టినా ను అడిగేను, ఏమి చేయాలని. ఆమె సమాధానం: "సహాయం చేయమని ఇతరులను అడగండి. క్రొత్త బ్యాటరీ పెట్టండి." ఇదే ఒక ఆధ్యాత్మిక గురువు చేయగలిగినది. కొన్ని పరిస్థితుల్లో పట్టుదల సడలుతుంది. కండరాన్ని కదిలింప గల శక్తి కూడా ఉండదు. గురువు వానికి బోధ చేసి వానిని చక్కదిద్దుతాడు.
ఒక గురువు బోధచేసిన పిమ్మట, శిష్యుడు తను చెప్పినట్టు చేస్తాడని నమ్ముతాడు. అది ఎలాగంటే మన వాహన బ్యాటరీ మార్చినవాడిలాగ.
ఒకని కుటుంబం మాంద్యంతో నిండి ఉండి, జీవితం యొక్క విలువను గుర్తించకుండా ఉంటే, అతడు తన బ్రేక్ లను తీసి వేయాలి. తక్కిన కుటుంబ సభ్యులు వానిని అనుసరించ వచ్చు.
ఒక రాజసికుడు మరణిస్తే వాని పునర్జన్మ బ్రేక్ లు లేని వాహనంలా ఉంటుంది. తామసికుడు తన కాలును ఎప్పుడూ బ్రేక్ మీద పెడితే, రాజసికుడు బ్రేక్ తప్పిస్తే ఎక్కడైనా తన కాలుని పెడతాడు.
నా మిత్రుడు తన వాహనాన్ని తనే చేసికొన్నాడు. అది నాలుగు చిన్న చక్రాలు కలిగి, వాటిమీద పెద్ద సీటు పెట్టబడింది. "దీనిని ఎలా నడుపుతావు?" అని అడిగేను. అతని సమాధానం: "నేను ప్రక్కలకు వెళ్ళాలంటే ఈ త్రాడుని లాగుతాను."
"అయితే బ్రేక్ లు ఎక్కడున్నాయి?"
"దీనికి బ్రేక్ లు లేవు"
"బండిని ఆపాలంటే ఏమి చేస్తావు"
"పాదాలతో భూమిని తాకుతాను"
రాజసికుడు ఇటువంటి వాహనం వంటివాడు. అతడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో కర్మ చేస్తూ ఉండాలి. ఎక్కువగా తనకి, వేరే వారికి ఉపయోగం లేని పనులు చేస్తాడు. అతను ఏ పనితోనైనా తాదాత్మ్యం అవుతాడు. అతడు ఏ పని చేసిన దాన్ని పిచ్చిలా చూస్తాడు. ఒక వ్యాపకం లాగ చేసే పని పెరిగి పెద్దదై రోజుల సరబడే పనిగా మారుతుంది. నేను ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఇటువంటి వారలను చూసేను. ఇది విద్యాలయాలకే పరిమితం కాదు. ఒకడు చక్కని వ్యాకరణంతో ఒక వ్యాసం వ్రాసి అందరి మన్ననలను పొందుతాడు. కొంత కాలం తరువాత "కామా యోక్క విశేషం" అనే పుస్తకం వ్రాయాలనుకొంటాడు. వాడికి మిగతా ప్రపంచంలో ఏమువుతున్నదో అనవసరం. వానికి వేరే చోట కరవు కాటకముంటే, లేక ఒక కుటుంబంలో సభ్యులకు క్యాన్సర్ వస్తే బాధపడతాడు. కాని అవి అతని సామర్ధ్యాన్ని మించిన కార్యాలు. వాని దృష్టంతా ప్రపంచమంతా కామా పెట్టాలా లేక సెమీ కోలన్ పెట్టాలా అనేదే.
రాజసికుడు మరణిస్తే వాడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు సదా కర్మలు చేస్తూ ఉ౦డే కుటుంబములో పుడతాడు. కుటుంబ సభ్యులందరికీ ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. అది ధన సముపార్జనం కావచ్చు, మరేదో కావచ్చు. ఎవ్వరికీ వారి తోటను సరిగా పెంచడానికి, కూర్చుని మాట్లాడడానికి సమయం లేదు. ఇటువంటి పనుల వలన మనకు స్వస్థత కలుగుతుంది. జీవితాన్ని సరిగా అర్థం చేసికోవాలనే తృష్ణ ఉంటుంది. కానీ రాజసిక కుటుంబానికి ఆలోచించడానికి సమయం లేదు. వాళ్ళకు పుట్టిన రాజసికుడు "ఇది చాలా మంచి జన్మ. ఇటువంటి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం" అని అనుకొంటాడు. అది రాజసిక గుణాన్ని మరింత ప్రభావితం చేసేది. దాని వలన చివరికి కలిగేది దుఃఖం. దాన్ని సాత్వికంగా మార్చుకో గలిగితే వాడు, వాడి కుటుంబం ఎంతో ఆనందంగా ఉండచ్చు.
ఒక ఆడది లేదా మగవాడు పరోపకారానికై నిస్వార్థంగా బ్రతుకితే వారిని సాత్వికులని చెప్పుదురు. వారు మరణానంతరం, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, పునర్జన్మ నిస్వార్థంతో గూడిన కుటుంబంలో ఉంటుంది. తండ్రి తన భార్య, పిల్లల క్షేమానికై ఆశిస్తాడు. తల్లి ప్రేమ పూరితంగా ఉంటుంది. సమస్యలు వచ్చినపుడు ఆమె స్వశక్తితో కుటుంబాన్ని వానిని అధిగమించడానికి పూనుకొంటుంది. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్లవాడు ధృడంగా, నిబ్బరతతో, నిస్వార్థంగా పెరుగుతాడు. దీనితో మానసిక శాస్త్రాన్ని సమన్వయం చేసికోవచ్చు. అట్టివారు సులభంగా ధ్యానం నేర్చుకోగలరు. ఒక్కొక్కప్పుడు చిన్న వయస్సు లోనే. వాడు మనస్పూర్తిగా కర్మలు చేస్తే వానిని వృద్ధి పరిచే, ప్రేమించే గురువు దొరుకుతాడు. గురువుచే సమస్త గుణాలకు అతీతుడై విశేషమైన గమ్యాన్ని పొందుతాడు.
లిస్యూకు చెందిన తెరెసా ఇటువంటి కోవకు చెందిన వారే. ఆమె చిన్నప్పడినుంచి ఒకే గమ్యం ఎన్నుకొంది. అది సెయింట్ అవ్వడం. ఆమె ఎంతో చాకచక్యంతో, పట్టుదలతో తన ఆశయాన్ని నెరవేర్చుకొంది. హిందూ పరిభాషలో చెప్పాలంటే ఆమె గత జన్మలో ఎక్కడ విడిచిందో, దానిని తిరిగి పొంది ముందుకు సాగింది. ఆమె 24 ఏళ్ల వయస్సులో పరమపదించి పోప్ పయస్ చేత "నేటి కాలంలో అతి గొప్ప సెయింట్" అని కొనియాడబడింది.
ఉంకో తెరెసా, ఆవిలాకు చెందిన తెరెసా, తనకు గమ్యం తెలిసికోడానికి 20 సంవత్సరాలు పట్టింది అని చెప్పేరు. ఆమె ఒక ప్రసిద్ధ ఉపాధ్యాయిని అయి౦ది. ఆమెకు మనలాగా జీవితంతో పోరాడడం గూర్చి బాగా తెలుసు. సమస్యలను స్వీయానుభవంతో ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. ఆమె స్త్రీత్వమునకు పెద్ద చిహ్నం. ఆమె ఎంత అందమయినదో అంత ఆధ్యాత్మికతో నిండియున్నది. ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశించే ఆడ పిల్లలను చేర దీసి వారికి ఆదర్శవంతంగా నిలిచింది. హిందూ, బౌద్ధ పరిభాషలో ఈ పిల్లలు జీవితమంతా ఆధ్యాత్మిక జీవనమును అంకితము చేయుటకు కారణ జన్ములు. వారికి తెరెసా అంటే గట్టి నమ్మకం. గీత వారి గురించి ఇలా చెప్పి ఉండవచ్చు: వాళ్ళు 16 వ శతాబ్ద స్పైన్ దేశంలో పుట్టడానికి కారణం తెరెసా ని కలవడానికి; ఆమె బోధలను పొందడానికి.
No comments:
Post a Comment