Thursday, March 10, 2022

Chapter 16 Section 12

16.12

ఆత్మసంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః {16.17}

యజన్తే నామయజ్ఞ్ఐస్తే దంభేనా విధిపూర్వకమ్

వారు ఆత్మస్తుతి గావించుకొనుచు, అవివేకులై, ధనాభిమానముల చేత మదము గలవారై విధి రహితముగ పేరు కొరకు యజ్ఞములు చేయుచుందురు

అహజ్ఞ్కారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః {16.18}

మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో అభ్యసూయకాః

వారు అహంకారమును, బలమును, గర్వమును, కామమును, క్రోధమును ఆశ్రయించినవారై తమయందును, ఇతరుల యందును ఉన్న నన్ను అసూయతో జూచువారలై ద్వేషించుచున్నారు

తానహం ద్విషతః క్రూరా న్సంసారేషు నారాధమాన్ {16.19}

క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్యవ యోనిషు

నన్ను ద్వేషించుచూ, క్రూరస్వభావులై, పాపులగు ఆ నరాధములను రాక్షస సంబంధమైన గర్భముల యందు ఉంచుచున్నాను

ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని {16.20}

మా మప్రాస్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్

కౌన్తేయా ! అసుర జన్మము నెత్తిన మందమతులు ప్రతి జన్మము నందును నన్ను పొందకనే అంతకంతకు అధోగతి పాలగుచుందురు

ఈ పై శ్లోకాలలో శ్రీకృష్ణుడు, మన ఇతిహాసాల్లో ఇంకెక్కడా లేనటువంటి విధంగా, అసుర లక్షణాలను, వాటి వలన కలిగే అనర్థాలను విడమరచి చెపుతున్నాడు. ఆయన ఉగ్రుడై అసురులకు క్రూర దండన విధిస్తున్నాడు.

మన వ్యక్తిత్వాన్ని జ్యోతిష్యముతో, జన్యువులుతో చెప్పగలమనేవారు వున్నారు. శ్రీకృష్ణుడు అట్టివారిని మూఢులంటాడు. కొంతమంది తమని తాము మార్చుకోలేక "నేను సింహ రాశిని, కాబట్టి నేనిలాగే ఉంటాను" అని అంటారు.

బుద్ధుడు కూడా జ్యోతిష్యాన్ని నమ్మలేదు. ఆయన మనస్సును బంధించేదాన్ని ఒప్పుకోడు. అలాగే మన జీవితమంతా జన్యువులలో వివరింప బడియున్నది అన్నదాన్ని కూడా ఆయన సమ్మతించడు. నాకు చాలామంది "నాకు ధ్యానం నేర్చుకొంటే లాభం లేదు. నేనెప్పుడూ ఇలాగే ఉంటాను" అని చెప్పేరు. కొంతమంది మానసిక వ్యధతో బాధపడుతూ "నాకు ధ్యానం వలన ఎట్టి ఉపశమనం రాదు. నా మెదడులోని రసాయనాలు కొన్ని లోపించాయి, మరికొన్ని అధికమయ్యాయని నా డాక్టర్ చెప్పేరు" అంటారు. ఇలా ఆలోచించేవారు బంధనాలను అధికం చేసికొని తమను తామే కించపరచుకొంటారు.

మనమెన్నటికి ఇటువంటి ఆలోచనలు రానివ్వకూడదు. మన జీవితాలు నిరాశ, దుఃఖం, శాపం వలన కలిగేయని ఎన్నడూ నమ్మ కూడదు. అలాగే ఇది దేవుడి నిర్ణయం, నా జన్యువుల ప్రభావం, నేనెప్పుడూ తప్పులు చేస్తూనేఉంటాను అని మనని మనము నిరుత్సాహపరచుకోకూడదు. మనకి మంచి దారిని ఎన్నుకొనే శక్తి ఉంది. మనలోని దైవత్వ౦ మనని మోక్షం వైపు -- అనగా జన్మరాహిత్యం--తీసికెళుతుంది.

పరిణామం అనేక జన్మల తరువాత మోక్ష పథంవైపు దారి తీస్తుంది. అది తెలిసికోకపోతే మనము బాధలుపడుతూ ఉండడమే. అనగా మనమీ జన్మలో ఆర్జి౦చిన సంస్కారాలు పునర్జన్మలోకి తీసికొని వెళ్లబడతాయి.

మన తలిదండ్రులను ఎన్నుకోగలిగే శక్తి ఉంటే, ఎన్నటికీ స్వార్థరహితమైన వారిని ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం స్వార్థపూరితులమైతే మోక్షము ఎన్నటికీ రాదు. సుఖములను అభిలషించే పూర్వీకుడు, నీరో పాలించిన రోమ్ లో పుట్టవచ్చు. శ్రీకృష్ణుడు వానియందు దయ ఉండి, ఇప్పటికైనా నేర్చుకోకపోతాడా అని తలుస్తాడు. ట్రోట్ స్కీ "మిక్కిలి హింసను కోరేవాడు 20 వ శతాబ్దంలో పుడతాడు" అని చెప్పెను. ఏ దశాబ్దంలో, ఏ దేశంలో పుట్టాలో మనం నిర్ణయించుకోగలిగితే అది మన సంస్కారముల మీద ఆధారి పడి ఉంటుంది.

ఓక్ లాండ్ లో నా ఇంటిముందు అపార్ట్మెంట్ లతో కూడిన ఒక భవనాన్ని నిర్మించేరు. ఒక అపార్ట్మెంట్ లో వారికి ప్రక్క అపార్ట్మెంట్ లోని మాటలన్నీ వినబడతాయి. మెట్ల మీదకి ఎక్కితే భవనమంతా ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక మిత్రుడు ఆ భవన యాజమానిని దాని గురించై అడుగుతే "నేను నా వెంట దీనిని తీసికొని వెళ్ళను" అని సమాధానం ఇచ్చెను.

ఆ భవనం మరణానంతరం తనతో తీసికొనిపోనని ఆ యజమాని చెప్పకనే చెప్పాడు. మనతో తీసికొని పోయేది శాశ్వతమైనదై ఉండాలి. ఈ సృష్టిలో అటువంటి దేమీ లేదు. కానీ మన ఆలోచనలు మనతో ఎప్పటికీ ఉంటాయి. అవి మరుజన్మలో మనకి సంస్కారములుగా కలుగుతాయి. అందువలన మన ఆలోచనలను ప్రక్షాళణం చేసికోవాలి.

దీన్నే భౌద్దులు కర్మదారు అనే పద౦ ద్వారా వివరిస్తారు. అది ఏంటంటే ఒక రహదారికి ఆనుకొని చెట్లు ఉందాయనుకొందాం. మన ఆలోచనలన్నీ గబ్బిలాలనుకొందాం. మన మరణానంతరం మన ఆలోచనులు గబ్బిలాల రూపు దాల్చి ఆ రహదారిలోని చివరి వృక్షం మీద వాలుతాయి. మన౦ ఆ రహదారి వెంట వెళుతూ ఉంటాము. మనం ఆఖరి చెట్టు దగ్గర ఉంకో శరీరం పొందేటప్పుడు అవన్నీ మన మీద వచ్చి వాలుతాయి. దీనిని కర్మ భార మనవచ్చు. మనకి క్రొత్త శరీరం, క్రొత్త వాతావరణం ఉన్నా ఆలోచనలు మాత్రం పాతవివలె ఉంటాయి. అదే మనము నిస్వార్థముతో, దయగల మనస్సుతో -- అనగా ఒకడు మనను ద్వేషించినా వానిని తిరిగి ద్వేషింప కుండుట--ఉన్నట్లయితే మన కర్మ భారాన్ని తగ్గించుకోవచ్చు. అందువలననే మన ఆలోచనలను నియంత్రించి మంచి మార్గములో పెట్టుకోవాలి. ఇది ఆధ్యాత్మికత వలన కలిగేది.

ఎన్నో ఏళ్ళు సాధన చేస్తే తప్ప మన అచేతన మనస్సును విశ్లేషించలేం. దాని వలన తెలిసేదేమంటే అచేతన మనస్సులోని ఆలోచనలు మనని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వాటిని శుభ్ర పరచుకొంటే మన సంస్కారాలు శుద్ధి పరచబడతాయి. మన అసలు స్వరూపం తెల్లని కాంతి వంటిది. అలాగే మనలో నల్లని స్వార్థపూరిత ఆలోచనలు ఉన్నాయి. మనము జంతువుల నుండి పరిణామం చెందటంవలన, ఆ స్వార్థపూరిత ఆలోచనలు ఈ జన్మలో ఉన్నాయి. మనలో దైవ, అసుర ఆలోచనలు రెండూ ఉన్నాయి. అవి ఎప్పుడూ మనలో యుద్ధం చేస్తూ ఉంటాయి. సాధన యొక్క ధ్యేయం అచేతన మనస్సుని చేరికొని ఆ యుద్ధం చేస్తూ బయటకు రావడం. అంతకన్నా వేరే మార్గం లేదు.

సెయింట్ ఫ్రాన్కిస్ డె సేల్స్ ని ఒకరడిగేరు: "నేను చాలా రోజులనుంచి సాధన చేస్తున్నాను. నేను చేసిన పాప కర్మలే ఎక్కువగా ఉన్నాయి. నేను సాధన మొదలు పెట్టినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ చెడ్డవాడినా?" దానికి ఫ్రాన్కిస్ ఇలా సమాధానమిచ్చేరు: "నువ్వెప్పుడూ అలాగే ఉన్నావు. ఇప్పుడు నువ్వు నీ అచేతన మనస్సు లోతుల్ని చూడగలగుతున్నావు". మన అచేతన మనస్సులోని ఆలోచనలు ఒక్కొక్కప్పుడు భయంకరమైనవి, అమానుషమైనవి. అది ఒక క్రూర మృగములతో కూడిన అరణ్యం వంటిది. దాని సహజ గుణం క్రోధం, భయం, కామం మొదలగునవి.

నా స్వీయానుభవము చెప్తాను. నేను నాకు తెలిసి నిర్దయగా ఎప్పుడూ ఉండలేదు. నా అమ్మమ్మ తనకంటే నాకు ఎక్కువ సహనముందని చెప్పేది. కాబట్టి నేను నన్ను ఒక మంచి వ్యక్తిగా భావించేను. ఒకరోజు ధ్యానంలో నా అచేతన మనస్సనే అరణ్యం లోకి ప్రవేశించాను. దానివలన నేనెంతో బాధపడ్డాను. ఇదే చాలామంది చూసేదని తెలియడానికి కొంత కాలం పట్టింది. ఇదే మానవ పరిస్థితి. అందువలనే జ్ఞాని ఒకరిని నిందించడు, వాని బలహీనతలను విమర్శించడు, అందరినీ దయతో చూస్తాడు. నా దృష్టిలో ఇతరులను కించపరచేవాడు నరాధముడు. తప్పుచేసి మళ్ళీ సరిదిద్దు కొనేవాడు ఇంకా నయం.

సాధన అచేతన మనస్సు చూపే భయానకమైన దృశ్యాలను ఎదుర్కొనే సామర్థ్యం ఇస్తుంది. క్రోధం, భయం, కామం అనేవి అనేక జన్మలనుంచి మనలో పాతుకొని పోయి ఉన్నవి. వాటిని ఎదిరించడం అంత సులభం కాదు. సాధనతో క్రమంగా అవి మీ అదుపులోకి వస్తాయి.

క్రిస్టియన్ లు అచేతన మనస్సులో దాగియున్న చీకటి శక్తులను డెవిల్ అనేవారు. శ్రీ రామకృష్ణ "నీవు నేను పాపిని, నేను పాపిని అని పలుమార్లు అనుకొంటే నిజంగా పాపాత్ముడవుతావు" అన్నారు. చెడుతో యుద్ధం చేయడం వలన జవసత్వాలు ఉడిగిపోతాయి. క్రిస్టియన్ లు డెవిల్ తో కాక దైవత్వానితో చేతులు కలుపు అంటారు. ఒక మారు మార్టిన్ లూథర్ కింగ్ సిరా బుడ్డిని డెవిల్ మీదకి విసిరి వానిని దూరంగా ఉంచేరు. ఈ నాటి విజ్ఞానంతో మన భాషను మార్చి అహంకారం, ఆత్మ గురించి మాట్లాడడం వలన అందరికీ అర్థమవుతుందని నేను సాతాన్ లేదా సోల్ అనే పదాలను వాడటంలేదు.

శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా ధైర్యం చెప్పేడు: "భయపడకు. నీకు ఆత్మ జ్ఞానం పొందే లక్షణాలు ఉన్నాయి." మానవులమైనందుకు మనందరిలో ఈ లక్షణాలు ఎంతో కొంత ఉన్నాయి. గతంలో చేసిన తప్పులవలన కుదేలు పడక, దైవ లక్షణాలను పెంపొందించుకొని మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థితికి తీసికొని వెళ్ళాలి. కొంత మంది గురువులు చేతన మనస్సును శుద్ధి చేసుకోవాలంటే ఒక ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉండాలని బోధిస్తారు. నేనది అంగీకరించను. నేను అందరిలాగే మంచికి ఆకర్షింపబడతాను, చెడుకు దూరంగా ఉంటాను. ఇది సహజమైన మానవ లక్షణం. భూగోళంలో ఎక్కడ ఉన్నా ధ్యానంతో మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చవచ్చు. అదే మానవ లక్షణం యొక్క ఉత్కృష్టమైన దశ. కొంచెం సరళంగా నా భార్య క్రిస్టీన్ కూ చెపుతూ ఉంటాను: "ధ్యానం వంటిది మరొకటి లేదు." 296

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...