Thursday, March 10, 2022

Chapter 17 Section 10

Bhagavad Gita

17.10

దాతవ్య మితి యద్దానం దీయతే అనుపకారిణే {17.20}

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్

ప్రత్యుపకారము చేయుటకు శక్తి లేనివానికి, యోగ్యుడగువానికి, దేశకాల పాత్రములకు తగిన రీతిన దానము చేయవలసినదే యనెడి దృఢ నిశ్చయముతో చేసెడి దానము సాత్త్వికమనబడుచున్నది

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః {17.21}

దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్

ప్రత్యుపకారము కొరకు గాని, లేక ఫలాపేక్షతో గాని, అతి కష్టముతో గాని చేయబడెడి దానము రాజస దానమని చెప్పబడుచున్నది

ఆదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే {17.22}

అసత్కృత మవజ్ఞాతం తత్తామాస ముదాహృతమ్

దేశకాల పాత్రోచితము కానిదియు, సత్కృతము కానిదియు, నిర్లక్ష్యము తోను ఈయబడిన దానము తామస దానమని చెప్పుదురు.

సెయింట్ ఫ్రాన్సిస్ "ఇవ్వడం ద్వారా పొందుతాము" అని చెప్పెను. ఈనాటి మన శ్రద్ధ ఇతరులనుండి దోచుకోవడం వలననే మనము పొందుతామని. దానం చేయడానికై పూనుకున్న వారలు అతి తక్కువ మంది. డాక్టర్ హాన్స్ సెల్యే అనే శాస్త్రజ్ఞుడు దానము ఉత్కృష్టమైన మానవ లక్షణమని చెప్పెను: మీరు ఇతరులకై సంపూర్ణముగా ఇవ్వండి; తద్వారా ఇతరులనుంచి సంపూర్ణముగా పొందండి. మానవ లక్షణము భౌతికమని తలచిన దానమును మించినది లేదు.

దానమనగా ఉచితముగా ఒక వస్తువు పండగనాడు లేదా పుట్టిన రోజున మాత్రమే ఇవ్వడమే కాదు. ఒకనికి ఊత, ప్రేమ, సమయం, సావధానత, నైపుణ్యం ఇవ్వడం కూడా దానమే.

సాత్త్వికమైన దానము పుచ్చుకున్నవానిని పెంపొందించుటకు చేయునది. దానిని కొంత వైరాగ్యముతోనే చూడవచ్చును. శ్రీకృష్ణుడు చెప్పునది దానము చేయునపుడు దేశ, కాలములతో పాటు పుచ్చుకున్నవానిని అర్థము చేసుకోవాలని. ఒకడు డబ్బుకై బ్రతుకుతుంటే, వానికి డబ్బును దానంగా ఇవ్వడం సముచితం కాదు. అలా చేయకపోతే వాని సంస్కారము డబ్బు యందే ఉండి, దానిపై కాంక్ష ఇంకా పెరుగును. అలాగే ఒకడు సుఖములకై బ్రతికితే, వానికి సుఖించు వస్తువును దానము చేయుట సాత్త్విక దానము కాదు. దాని వలను అతన్ని మరింత స్వార్థపరుడుగా చేస్తుంది.

పండగ లేదా పుట్టిన రోజు నాడు ఒక పిల్లవానికి ఒక వస్తువు ఇవ్వాలని ఉంటే సాత్వికుడు దాని పర్యావసానము గురించి ఆలోచిస్తాడు. ఆ పిల్లవానికి తినడం బాగా ఇష్టమైతే, ఐస్ క్రీమ్, మిఠాయి ఇవ్వడం వలన వాని అదేపనిగా తినడమనే సంస్కారాన్ని బల పరిచిన వారల మౌతాము.

నా అమ్మమ్మ పిల్లల కెవ్వరికి వారిని పాడుచేసే వస్తువులు ఎప్పుడూ ఇవ్వలేదు. నాకు చిన్నప్పుడు ఎక్కువ ఆట వస్తువులు ఉండేవి కావు; నాకు పుస్తకాలు చదవడంలో ఆసక్తి ఉన్నప్పటికీ బాల్యంలో ఎన్నో పుస్తకాలు లేవు; పాఠశాల గ్రంధాలయంలోని పుస్తకాలు చదివేవాడిని; కాలేజీకి ముందు నాకు సైకిల్ లేదు. చాలాకాలం నా అమ్మమ్మ పిసినిగొట్టు అనుకునేవాడిని. ఆ తరువాత తెలిసికొన్నదేమిటంటే ఆమెకు నాకు అవసరమైన వస్తువులనే కొనిచ్చేదని. బుద్ధుడు చెప్పినట్లు ఆమె ఇచ్చిన బహుమతి అన్నిటికన్న ఉన్నతమైన ధర్మము. మనము కొందరు దాతలు ఒక కళాకేంద్రంకో లేదా గ్రంధాలయానికో దానం ఇవ్వడం చూస్తాము. బుద్ధుడు చెప్పినది, ఎటువంటి వస్తువు శాశ్వతముగా ఉండదు కాబట్టి, ఇతరులకు శాశ్వతమైన ధర్మముతో బ్రతుకు జీవన శైలిని ఇవ్వడం అన్నిటికన్నా గొప్పది.

పిల్లలకి వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి మన౦ బహుమతులు ఇస్తాము. వాళ్ళకు ఒక రైలు బండి, కంప్యూటరు మొదలగువాటిని బహుమతులుగా ఇవ్వ వచ్చు. కాని వాటి వలన వారికి కలిగేది ఆనందము, లేదా తెలివితేటలు. మనము ఇవ్వవలసినవి వాళ్ళ ఊహను, సృజనాత్మక శక్తిని, పెంపొందించేవి. అనగా భూతదయ, ఇతరుల ఆనందం లేదా దుఃఖమును పంచుకొనుట మొదలగునవి. ఇవన్నీ పిల్లలు భద్రతతో, ప్రేమతో ఉండడానికి దోహదం చేస్తాయి. గాంధీ చెప్పినట్లు ఒక పిల్లవాని చదువు వాని చేతులు, బుద్ధిని వికసింపజేయాలి. నేను చెప్పేది వాని "చేతులు, బుద్ధి, హృదయాలని" ప్రభావితం చేసే విద్యను పాఠశాలల్లో బోధించాలని.

ఒక పొగడ్త, గౌరవము, వ్యాపారానికి సంభందించిన ప్రత్యుపకారము, మౌదలైనవి ఆశించిన దానము సాత్త్వికము కాదు. ఒకడు బహుమతిని ప్రత్యుపకారమునకై ఇచ్చిన దానిని తిరస్కరించడం ఉత్తమం. నేను, నా భార్య క్రిస్టీన్ మా ధ్యాన సంస్థకి ధన సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారల ఉద్దేశం చూచి వారి ధనాన్ని తీసికోవాడమో లేదో నిర్ణయిస్తాము.

రాజసికుని బహుమతులు వ్యాపార దృష్టిలో ఇచ్చినవి. వాళ్ళు సంస్థల తరుపున ఇచ్చే బహుమతుల వలన తమకు లాభం ఆశిస్తారు. కొందరు బహుమతులు పన్నులు తగ్గించుకోవడానికి చేస్తారు. మనకు ఉచితంగా జీవితం ఏదీ ఇవ్వదు. కొందరు ప్రత్యుపకారంగా తమ విగ్రహమును రోడ్ల ప్రక్కన ఆవిష్కరించమని అడుగుతారు. కొందరు శిలా ఫలకములపై తమ పేరును చెక్కమంటారు. మరి కొందరు దిన పత్రికలో తమ పేరును చూసుకొనడానికి దానం చేస్తారు. కాని యమలోకంలో ఉండే చిత్రగుప్తుడు అట్టి దానాలను పరిగణలోకి తీసికొనడు. మనకి మంచి కర్మ కలగాలంటే ప్రత్యుపకారమును ఆశించని దానం చేయాలి. దానివలన నిష్కామ కర్మ -- అనగా స్వార్థం లేని కర్మ -- లభిస్తుంది.

చివరిగా శ్రీకృష్ణుడు తామసిక కర్మను గూర్చి చెప్పెను. తప్పు ప్రదేశంలో, తప్పు కాలంలో, తప్పు వ్యక్తిని చేయు దానము తామసిక దాన మనబడును. కొందరు తమ పిల్లలకు అపాత్ర దానం చేసి వారిని పాడు చేస్తారు. తన దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నదనుకునే తండ్రి, తన పిల్లలకు డబ్బు పంచి పెడతాడు. వారికి కార్ లు మొదలైన వాహనాలను అక్కర లేక పోయినా కొనిస్తాడు. నా అమ్మమ్మ దాని గురించి ఇలా అంటుంది: "నీవు వాళ్ళను గారాబం చేస్తున్నావు. వాళ్ళని బాధ్యత గల వారిగా చేయటంలేదు. వాళ్ళకు పని చేస్తే గాని డబ్బు విలువ తెలియదు. వాళ్ళకు నువ్వు నేర్పుతున్నది ఒకరి సొమ్మును ఆశించడం".

వైద్యం ఒక విధమైన దానం. మారక ద్రవ్యాలను వ్రాసి ఇవ్వడం, అవసరంలేని శస్త్ర చికిత్సలు చేయడం, వంటివి తామసిక దానములనవచ్చు.

రాజసిక వైద్యుడు తన ప్రతిష్ఠకై, ధనమునకై, దానం చేస్తాడు. కొందరు వైద్యులు రోగులను నిరీక్షింప చేస్తారు. నేను ఒకసారి నిర్ణయించిన సమయంకి వైద్యుని చూడడానికి వెళ్ళేను. ఒక గంట పాటు వైద్యుని రాకకై ఎదురు చూడవలసివచ్చింది. ఆ సమయం ధ్యానంలో గడిపేను. వైద్యుడు చివరకు వచ్చి నాకు పరీక్షలు చేసేడు. నేను వానికి ఆలస్యం గురించి చెప్పేను. అతడు అలా చేస్తేనే రోగులకు వైద్యుని విలువ తెలిస్తుందని అన్నాడు.

నేను వీలయినంత మటుకు నిర్ణయించిన సమయానికి ముందే వస్తానని చెప్పేను. అతనికి అర్థమయి, అందులోని ప్రేమను చూసేడు. నిర్ణయి౦ప బడిన సమయానికి రాకుండా ఇతరులను నిరీక్షణ చేయించడం నిర్దయ.

ఎటువంటి ఉద్యోగంలోనైనా ఇతరులు చేసిన పనిని తనదిగా చాటించుకొనుట కొంత రాజసికము , కొంత తామసికము. రజస్ అభద్రతను, తమస్ సున్నితము లేకుండుటను కలుగజేస్తాయి. ఎంతో మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులలో మగ్గుతున్నారు. ఒక పిల్లవాడు జలుబు మందుకై ఆసుపత్రికి వెళితే అనేకమైన కాగితాలను నింపి, ఒక గది నుంచి ఇంకో గదికి మారి, గంటల తరబడి నిరీక్షణ చేయాలి. ఇది ఆసురికమైన వైద్యం. దీని వలన సమిష్ఠిగా ఒక దేశ ఆరోగ్యం మీద కూడా పర్యావసానాలు ఉంటాయి.

ఎంతో మంది రాజసిక వైద్యులు తమ వృత్తిని డబ్బుకొరకై, ప్రతిష్ఠ కొరకై ఎన్నుకొన్నారు. అట్టివారు మంచి వైద్యులు కాకపోరు. కాని తామసిక వైద్యులు పనికిరాని మందులు వ్రాసి, అవసరంలేని పరీక్షలు చేసి, అక్కరకు రాని శస్త్ర చికిత్స చేయిస్తారు. వాళ్ళు ఒక రోగిని పూర్తిగా నయం చేయక, మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్తారు. కాని రాజసిక వైద్యుడు అలా చేయడు. రోగిని నయం చేయాడానికై సర్వవిధాలా ప్రయత్నిస్తాడు. దానికి సమంగా డబ్బు కూడా తీసికొంటాడు.

సాత్త్వికమైన వైద్యుడు రోగము యొక్క మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు ఒక రోగి రక్తపు పోటుతో వస్తే, సాత్త్విక వైద్యుడు మందులతో పాటుగా -- బరువును తగ్గించుకో, పోషకాహారాన్ని తిను, ఎక్కువ వ్యాయామం చేయి, ధ్యానం చేయి, ఒత్తిడిని తగ్గించుకో, చెడు ఆలోచనలను చేయకు అని సలహా ఇస్తాడు.

మనము ఈ గుణాలను అంతర్జాతీయ౦గా చూడవచ్చు. కొన్ని దేశాలు మైత్రిని సాకుగా చేసికొని ఇతర దేశాలకు ఆయుధాలను పంపిస్తాయి. తామసికుడు ఒకరిని బాధ పెట్టడానికై వెనుకాడడు. ఉచిత ఆయుధాల సరఫరా వలన ఒక ప్రాంతంలో ఆయుధాల సేకరణకై పోటీ ఏర్పడి అశాంతి నెలకొంటుంది. వాళ్ళు చెప్పేది ఆయుధాల వలన నిజమైన యుద్ధం రాకుండా చేయవచ్చని. ఎందుకంటే ఒక బలమైన దేశ౦పై దాని ప్రక్కనున్న దేశం దండయాత్ర చేయదు కాబట్టి.

అలాగే రాజసిక దేశాలు మనకు అవసరంలేని వస్తువులను -- బియ్యం, గోధుమ, ఇనుము-- ఇచ్చి వారి మీద ప్రతిదానికి ఆధారపడేలా చేస్తాయి. ఇటువంటి దానం, వస్తువులు వలన, అపకారం జరగకపోయినా, స్వార్థపూరితమైనది.

తామసిక దేశాలు వస్తువులను ఇతర దేశాలకు ఇచ్చి వాటిపై ఒత్తిడి తీసికురావడానికి ప్రయత్నిస్తాయి. 1965 లో భారత దేశంలో కరవు వచ్చినపుడు ఎరువులకై అమెరికా సహాయం కోరింది. దానికి బదులుగా అమెరికా గోధుమలను పంపింది. ఎందుకంటే ఎరువులు ఇస్తే భారత దేశం తమకు కావలసినంత పంట పండించుకొని ఆహార విషయంలో ఇతర దేశాలపై ఆధారపడి ఉండదు. ఇంకా చెప్పాలంటే, అమెరికా కాఫీ పండించే దేశాలకు ఆహార దినుసులని ఇచ్చి బదులుగా కాఫీని తమ దేశానికి ఎగుమతి చేయమని కోరింది. దాని వలన, కాఫీని పండించే దేశాలలోని ప్రజలకు, వారి పంట వారికి చెందక, పూర్తిగా ఎగుమతికే వాడుతారు.

సాత్విక దానము ఒకరిని వారి కాళ్ళపై వారు నిలబడడానికి సహాయ పడుతుంది. కొన్ని నైపుణ్యాలు, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానము , పొరుగు దేశాలకి ఇస్తే ఆ దేశం బాగుపడి వృద్ధినొందుతుంది. దాని వలన పుచ్చుకొన్న దేశం ఎక్కువ ఖర్చు లేకుండా, పెట్రోలియం ఆయిల్ మీద ఆధారా పడకుండా తమకు ఇచ్చిన పరిజ్ఞానంతో వృధ్ధి చెందుతుంది. బీద దేశాలలో పని చేసేవారు ఎక్కువ; వారిని నిరుద్యోగం నుండి లేవనెత్తడానికి కావలసిన పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము తక్కువ. అట్టి దేశాలలో 100 మంది చేసే పని 10 మంది యంత్ర సహాయంతో చేస్తే వారి నిరుద్యోగ సమస్య ఎలా తగ్గుతుంది? దానికి తోడు ఆ దేశానికి అప్పుల భారం ఎక్కువవుతుంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానము ఉచితంగా రాదు. 100 మందికి చేతితో చేసేవైనా తమ దేశానికి అవసరమైన వస్తువులను తయారుచేసుకోవడానికి జీవనోపాధిని కలిపిస్తే ఎంత బాగుంటుంది?

నేను అమెరికా చేసే దానాన్ని గురించి మాత్రమే వివరించటంలేదు. ప్రపంచంలోని పారిశ్రామికంగా ఉన్నత స్థితి లో ఉన్న దేశాలు ఎక్కువగా రాజసిక దానాలే చేస్తాయి. ముఖ్యంగా అవి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను మిక్కిలి లాభంతో ఎగుమతి చేస్తాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలలో అగ్గివేస్తే గుగ్గిలంగా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి అట్టి రాజసిక దానాల వలన ఫలితం లేదు. ప్రతి దేశానికి తప్పొప్పులు ఉంటాయి. వాటి తప్పులనే వేలెత్తి చూపితే వాటి మీద పూర్తిగా చెడు ఆపాదించడమే. అందుకే అవి చేసే ఒప్పులను కూడా అధ్యయనం చేయాలి. గీత చెప్పేది ఆ రెండిటినీ తెలుసుకోమని. 360

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...