17.3
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత
{17.3}
శ్రద్ధామయో అయం పురుషో యో య చ్చ్రద్ధ స ఏవ సః
అర్జునా! సర్వప్రాణులకు వారివారి స్వభావమునకు తగిన శ్రద్ధ కలుగుచున్నది. పురుషుడు శ్రద్ధామయుడై యున్నాడు. ఎవరు ఎట్టి శ్రద్ధ కలవారో వారికి తద్రూపమైన స్వరూప స్వభావములు కలుగును.
చిన్న పిల్లవాడికి కూడా శ్రద్ధ ఉంది. శ్రద్ధ లేక ఎవరూ జీవించలేరు. శ్రద్ధ మంచిది లేదా చెడ్డది కావచ్చు. అది ఒకని నడత మీద ఆధారపడి ఉంది. ఈ శ్లోకము యొక్క పరమార్థం మన శ్రద్ధ అట్టడుగన ఉన్నా, దాన్ని ఉన్నతమైనదిగా మార్చుకొనవచ్చు. మన శ్రద్ధ స్వార్థమైతే దానిని నిస్వార్థముగా, హింసతో కూడినదైతే దానిని ప్రేమపూరితంగా మార్చుకొనవచ్చు. ఇదే మానవుని యందలి శక్తి. సైన్స్ లేదా తక్కిన మేధమీద ఆధారపడిన శాస్త్రాల కన్నా, శ్రద్ధను క్రింద నుంచి శిఖరాగ్రములకు తీసికు వెళ్లగలగుట మానవుని నిజమైన శక్తి.
ఈ విషయం నాకు ధ్యానం చేసినప్పటికిగానీ విదితమవలేదు. నాకు తెలిసి ఆధ్యాత్మికత ఒకని వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. అది నా మనస్సులో నాటబడింది కాని హృదయంలో నాట బడలేదు. నాకు తెలిసినది సాహిత్యం. అది నాకు ఉపాధిని ఇవ్వడమే కాక నా జీవితాన్ని మలిచింది. వీలయినప్పుడల్లా నేను చేసేవి చదవడం, నాటకాలు చూడడం, వక్తలు చెప్పేది వినడం.
కానీ నాకు ధ్యానానికి ముందే వాటి మీద గల నిష్ఠ తగ్గింది. నేను విశ్వవిద్యాలయంలో ప్రసంగాలకు వెళ్ళేవాడిని. ఎవరైనా గొప్ప రచయిత ప్రసంగిస్తుంటే నేను మొదటి పంక్తిలో కూర్చొని వినేవాడిని. ప్రేక్షకులు ప్రశ్నలడిగినప్పుడు వారి సమాధానాలు మాత్రం గొప్పగా ఉండేవి కావు. అవి సాధారణంగా, అపక్వమైన, లేదా తప్పు ద్రోవ పట్టించేవిగా నాకు అనిపించేవి. నా అమ్మమ్మని అవే ప్రశ్నలడిగితే ఆమె సమాధానాలు పరిపక్వమైనవి మరియు సహాయ పడేవి. నేను ఆ గొప్ప రచయితలను నా ఆరాధ్య దైవాలుగా భావించి వృత్తి సాగించేను. కానీ వారిని నెత్తిమీదనుంచి క్రిందికి దింపి వేయడం బహు కష్టమైంది. నా శ్రద్ధలో మార్పు వచ్చింది. కానీ అది చెప్పినంత సులభం కాదు.
ఇలా తెలిసికొన్నదేమిటంటే నా అమ్మమ్మ శ్రద్ధ తక్కిన వాళ్ళ కన్న భిన్నమైనది. జీవితం గురించి చెప్ప గలిగే వారిలో ఆమెదే అగ్ర తాంబూలం. ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పేది అదే. ఆమె జీవితమంటే భౌతిక విషయాల మీద శ్రద్ధ మాత్రమే కాదని; ఆమె నాకు నేర్పింది జీవిత మూలాన్ని ప్రశ్నించడం.
బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు సర్ పీటర్ మెడవర్, యువ శాస్త్రజ్ఞులను ఉద్దేశించి "ఒక విషయం అర్థం కాకపోతే మీరు చాలా ఇబ్బంది పడాలి" అన్నారు. చాలామంది అన్నీ తెలుసులే అని అనుకుంటారు. అలా కాకుండా ఒక శాస్త్రజ్ఞుడు లేదా వేదాంతి, అందరూ అనుకునే ప్రపంచం నిజం కాదని, దాని యొక్క మూల౦ తెలిసికోవాలని ప్రయత్నిస్తారు. అట్టి వారికి జీవితం లేదా మానవ నైజం అంతుబట్టదు. మనం భూమి మీద ఏమి సాధించాలి? ఒక గమ్యమున్నదా? ఉంటే దాన్ని చేరేదెలా? సాధారణ వ్యక్తులు వాటిని ప్రక్కన పెడతారు. కానీ అందరూ అలా కాదు.
ఉన్నతమైన శ్రద్ధ పొందడం కూడా ఇటువంటిదే. అది పరిసరాలతో సంతృప్తి చెందక పోవడంతో మొదలవుతుంది. మనని భౌతికంగా మాత్రమే తలచి, భౌతికమైన కోర్కెలు తీర్చుకోవడమే జీవిత లక్ష్యమని తలుస్తే మనం అసంతృప్తి పడాలి. గాంధీ చెప్పినట్లు ఒక తప్పుడు పరిస్థితిలో సంతృప్తి పడడం మంచిది కాదు. యుక్త వయస్కులు ఎంత సున్నితమైతే అంత అసంతృప్తి గా ఉంటారు. వాళ్ళు పెద్దలు చేప్పేదొకటి, చేసేది మరొకటి ని చూసి నిరాశ చెందుతారు. అందువలన వారు ఒక్కొక్కప్పుడు దురుసుగా ఉండి ప్రమాదకరమైన పనులు చేస్తారు.
ఎప్పుడైతే పగ సాధించాలని సంకల్పం కలుగుతుందో అది తప్పుడు మార్గంలోకి తీసికువెళ్తుంది. మనం ఎన్ని మనస్తత్వ శాస్త్ర పుస్తకాలను చదివినా, మనస్తత్వ శాస్త్రజ్ఞులచే వైద్య సహాయము పొందినా, పగ సాధించుకోవడం అనే మనోవ్యధ నుంచి బయటపడలేం. దానివలన విచారకరంగా మనం భౌతికంగా, ఆధ్యాత్మికంగా నష్టపోతాం. మనం ఇతరులను తప్పించుకొని, ఇతరులు మనని తప్పించుకొని బ్రతుకుతాం. మనకు ఇతరులతో కలిసి మెలసి పని చేయడం, ఆనందం పంచుకోవడం, వారికి కష్టం కలిగితే సహాయం చేయడం మొదలైనవి ఇష్టం లేకుండా ఉంటాం. ఈ విధంగా మనకి ఇతరులికి మధ్యనున్న బంధం క్షీణిస్తుంది.
మనం ప్రపంచ దేశాల శ్రద్ధ గురించి కూడా పరిశీలంచవచ్చు. ఉదాహరణకి కొన్ని దేశాలు "శాంతి కోరుకొంటే, యుద్ధానికి సిద్ధమవ్వు" అనే సిద్ధాంతాన్ని పాటిస్తాయి. ఈ సిద్ధాంతం రోమన్ నాటి కాలం నుంచి వస్తున్నాది. అది లోకజ్ఞానం, హృదయంలో ఉన్న జ్ఞానానికి మధ్య నున్న సంబంధం గురి౦చి చెపుతుంది. నాకు తెలిసి చరిత్రలో అస్త్రాలను పోగుచేసికొని, యుద్ధానికి వెళ్లకపోడం ఎప్పుడూ జరుగలేదు. మన దగ్గర తుపాకి ఉంటే, కొన్ని ఉద్రేక పరిస్థితిలో దానిని వాడడానికి ఆస్కారం ఉంది. తుపాకి లేకపోతే ఉద్రేకము కలిగినప్పుడు ఎలాగోఅలాగ సద్దుకొంటాం. ఇదే విధంగా సమిష్ఠిలో అస్త్రాలు ప్రయోగించే ఆస్కారం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అణ్వాశ్త్రాలు పెరుగుతున్నకొద్దీ వాటిని ఎప్పుడో ఒకప్పుడు వాడడం జరుగుతుంది. అటువంటి శ్రద్ధ వలన కలిగే పర్యావసానాన్ని చూడండి. జర్మనీలో ఒకప్పుడు 30 ఏళ్లపాటు యుద్ధం జరిగింది. దానివలన పలు జర్మన్ లు జీవితాంతం దుఃఖం తో గడిపేరు. అప్పట్లో అదే అతి పెద్దదైన యుద్దం. ఆ తరువాత సాంకేతిక జ్ఞానంతో ఇంకా ఎక్కువ మారణాయుధాలను చేసి 1914 లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో వాడేరు. ఆ యద్ధం 4 ఏళ్ల పాటు జరిగింది. దానివలన కలిగిన విధ్వంసం 30 ఏళ్లపాటు జరిగిన యుద్ధం కన్న ఇంకా ఎక్కువ. ఈనాడు ఒక అస్త్రంతో లెనిన్ గ్రాడ్ లేదా లండన్ నగరాన్ని ధ్వంసం చేయచ్చు. దాని వలన కలిగే సాంఘిక, ఆర్థిక పరిస్థితులు ఊహించలేనివి. అణ్వాశ్త్ర ప్రయోగము నిజంగా జరిగితే దానివలన కలిగే శోకం, వ్యాధులు, ఊచకోత, భీతి తో పోలిస్తే 30 ఏళ్ల యుద్ధం స్వర్గం అనిపిస్తుంది. దీన్ని శాంతికై అని చెప్పడం ఆశ్చర్యకరం. గాంధీ పరిభాషలో "శ్మశానం యొక్క శాంతి"
గీత చెప్పేది శాంతి కావాలంటే శాంతికై పాటు పడు. మనం మారణాయుధాల్ని పోగుచేసుకోవడం తప్పు. దానివలన మనమీదకి ఎవరో ఒకరు యుద్ధానికి తప్పక వస్తారు. ఇంకా పేదదేశాలు ప్రజలను ఉద్ధరించవలసిన వనరులను మారణాయుధాలపై వెచ్చించి తీవ్ర నష్టం పొందుతారు. అలాగే ఆయుధాలను యుద్ధంలోని రెండు పక్షాలకు లాభంకై అమ్మకూడదు. నేను కోరేదేమిటంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లోని దేశాలు మారణాయుధాలను కొనకూడదు. అవి ఉచితంగా వస్తే తీసకోకూడదు. ఎందుకంటే వాటివలన ముప్పే కలుగుతుంది. ఇది మారణాయుధాల వలన కలిగే శ్రద్ధ యొక్క ఫలితం.
జీవితం భౌతికమని తలపించే నేటి శ్రద్దను చూద్దాం. ప్రతీదీ పైకి కనిపించే రూపం తో కొలతవేస్తున్నాం. రాజసికుడు పరిమాణం, వేగం మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తాడు. ఒక శవాన్ని పాతిపెట్టాలంటే ఒకడు ఒక పెద్ద పిరమిడ్ కడతాడు. రెండవవాడు ప్రపంచంలో అతి పెద్దదైన పిరమిడ్ ని కడతాడు. మూడవవాడు పిరమిడ్ ని కొండమీద అతి పెద్ద ఎత్తులో ఉన్నదిగా కడతాడు. అలాగే అతి కొద్ది సమయంలో కడతాడు. ఈ విధంగా ఈజిప్షియన్ లు తమ పిరమిడ్ ఆటను కొన్నాళ్ళు కొనసాగించేరు. కాని రాజసికుడు దానివలన ఏమీ నేర్చుకోలేదు. వాడికి తెలిసినదల్లా క్రొత్త క్రొత్త వింతైన వస్తువులను ప్రదర్శించడమే. అలాగే పనసపండు పరిమాణం గల నారింజలు, 30 హీరోషిమా లను నాశనం చేయగల మారణాయుధాలని, హీరోషిమాపై నిజంగా వాడిన మారణాయుధం కన్న పదవ వంతు పదార్థంతో తయారుచేస్తాడు.
కొంతమందికి ఒక చోటకి వెళ్ళడానికి 20 నిమిషాలు పడితే ఇంకా వేగం గా 15 నిమషాల్లోనే చేరాలనే కాంక్ష ఉంటుంది. వాళ్ళకి అడ్డదారి తెలియకపోతే, వాళ్ళు మంచి చెప్పులను తయారుచేసి అతి వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ నడక కష్టమైనది. రాజసికుడు తక్కువ కష్టంతో ఎక్కువ సాధించాలని కోరుకొంటాడు. కాబట్టి రాజసికుడు సైకిల్ ని కనుగొంటాడు. నేను సైకిల్ కనుగోవడం ఒక గొప్ప విషయమని తలుస్తాను. దాని తరువాత కార్ ను తయారు చేస్తాడు. దాన్ని పెద్దదిగా, అతి వేగవంతంగా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. మనం "ఎందుకు పెద్దది? ఎందుకు వేగవంతమైనది?" అని అడిగితే దిక్కులు చూస్తాడు. నేను ఎద్దుల బండిలో ప్రయాణం చేసేవాడిని. ఇప్పుడు నిమిషానికి ఒక మైలు వెళ్ళే కార్ లో ప్రయాణిస్తున్నాను. ఇది నాకు నమ్మశక్యం కానిది. కాని కార్ లను ఇంకా వేగవంతంగా చేయడానికి పూనుకొన్నారు. అమెరికా నుంచ యూరోప్ వెళ్ళే విమానాలు 5 గంటల్లో అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతాయి. ఇదంతా ఎందుకు చేయడం? దానికి సమాధానం: చేయగలము కాబట్టి. శబ్ద వేగంతో ప్రయాణించే అణ్వాశ్త్రములు తయారు చేసేరు. ఇది పురోభవృద్దిని వింతగా కొలిచే పద్దతి.
అంతము లేని పురోగతి ఆఖరికి మనకున్న పరిమితమైన వనరుల మీద ఆధార పడి ఉంది. కాని ఆ వనరులు తగ్గితే ఒకదానిని మార్చి ఉంకోదానికి వెళుతున్నాము. ఉదాహరణకి పెట్రోలియం ఆయిల్ అయిపోతే బొగ్గును వాడుతాం. మనము భూమి మన సొంతంలాగా వాడుకుంటున్నాము. నిజానికి అది మనది కాదు. మనం భూమిని అద్దెకు తీసుకున్న వారలము కాని దాని యజమానులము కాదు.
నేను కొన్నాళ్ళు వేరే ఊరికి వెళ్ళ వలసి వచ్చినపుడు, బాబ్ ని నా ఇల్లు వాడుకోమని చెప్తాను. నేను లేనప్పుడు బాబ్ నా ఇంటిని సద్దకూడదు. నేను తిరిగి వచ్చిన తరువాత నా ఇల్లు నేను వెళ్ళినపుడు ఎలా ఉందో అలాగే ఉండాలి. బాబ్ మంచి అతిథి కాబట్టి నేను కోరుకొన్న విధంగానే ఉంటాడు. అలాగే మనం ఈ భూమి మీద బాబ్ లాంటి అతిథులము.
భూమి లోని పెట్రోలియం ఆయిల్ తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. దానిని మనం ఒక 100 సంవత్సరాలలో అవ్వగొట్టేసా౦. ఒక తండ్రి అనేక ప్రయాసలు పడి ఒక కోటి సంపాదించి తన తదనంతరం కొడుక్కి ఇచ్చేడనుకొందాం. కొడుకు, అతి తెలివితో, స్టాక్ మార్కెట్ లో డబ్బును పెట్టుబడి పెట్టి ఒక వారంలో మొత్తం కోల్పోయేడు. వాడు పోగొట్టుకొన్నది వాడి కష్టార్జితం కాకపోయినా, తన తండ్రి కష్టార్జితాన్ని తగలపెట్టేడు. ఇదే విధంగా కొన్ని దేశాలు పెట్రోలియం ఆయిల్ ని తగలపెట్టేయి.
"భవిష్యత్తులో ఇంకా ఉంది. కాబట్టి నాకు ఎంత కావాలో ఇప్పుడే తీసికొ౦టాను" అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇది మన శ్రద్ధ: "భవిష్యత్తులో ఏమైతే నాకేమి? నా పిల్లలకు, మనుమలకు లేకపోతే నాకేమి? వాళ్ళు అప్పటికి ఏదో ఆలోచిస్తారు. వాళ్ళు సైకిల్ నడపవచ్చు. అది మంచి వ్యాయామం కూడా. నేను 30, 40 ఏళ్లలో కలిగే సమస్యలకు నా జీవన శైలిని ఎందుకు మార్చుకోవాలి?" మనం అటువంటి కర్మ ఫలాన్ని పొందుతున్నాం. మనుషుల్లో ప్రేమ లోపించింది. మన తదనంతరం వచ్చే వారి గురించి ఆలోచించి వుంటే మనము వనరులను వృధా చేయము. మనకే గాని వేరొక శ్రద్ధ ఉంటే, పెట్రోలియం కనుగొన్నప్పుడు : "ఇది వచ్చే తరాలకి కూడా చెందినది" అని అనుకొని దానిని కావలసినంత మటుకే వాడుతాం. మనం ఇతర దేశాలలో పుట్టే పిల్లల గురించి ఆలోచించం. వాళ్ళు ఇంకా పుట్టనందున మనం వాళ్ళ సంపదని కొల్లగొడుతున్నామని ఎంతమంది భావిస్తారు?
సౌదీ అరేబియా రాజు ఫైసల్ కి ఒక విశాలమైన కోట ఉంది. తన బల్లమీద పువ్వులు పెట్టుకోడు. దాని బదులు పెట్రోలియం ఆయిల్ ఒక పాత్రలో పెట్టుకొంటాడు. ఎందుకంటే వాని సంపద అంతా దేవుని కృప అని తలచి. పెట్రోలియం ఆయిల్ కొన్ని సంస్థలకు మాత్రమే చెందదు. వారు సంపన్నులయినప్పటకి, వారికి రాజకీయ నాయకుల దన్ను ఉన్నా, అతి శక్తి మంత మైన సైన్యం ఉన్నా పెట్రోలియం ఆయిల్ మన, రాబోయే తరాల వారి ఉమ్మడి సొత్తు. పెట్రోలియం ఆయిల్ ధర పెరిగితే వ్యవసాయినికి వాడబడే ఎరువులు, వాహనాలు ప్రియమవుతాయి. అందువలన మయన్మార్ వంటి చిన్న దేశాల్లో ప్రజలు పస్తులు౦డవలసివస్తుంది. అలాగే మంచు ప్రదేశాల్లో నివసించేవారు ఉష్ణానికి వాడే పెట్రోలియం ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగితే నానా యాతన పడతారు. సాధారణంగా ధరలు పెరగడానికి కారణం స్టాక్ మార్కెట్ లోని దళారుల లోభత్వం వలన. అటువంటి పరిస్థితుల్లో మన రాబోయే తరానికి ఏ సమాధానం ఇస్తాము? "మేము జల్సాగా బ్రతికేము. వనరులను వృధా చేసేము. మీరు మిగిలింది అనుభవించండి: చలితో మంచు ప్రదేశాల్లో బ్రతకండి; ఆయిల్ ప్రియం కాబట్టి వాహనాల్ని అవసరమైనంత మటుకే వాడండి; కాలుష్యంతో నిండిన గాలిని పీల్చ౦డి; అలాగే అణుశక్తి వ్యర్థాలతో జాగ్రత్తగా ఉండండి."
ఈ అనర్థాలికి కారణం మనము జీవితం భౌతికమనుకోవడమే. అనగా మన సంతృప్తి బాహ్యమైన, భౌతిక వస్తువుల మీద ఆధారపడుతుందనే భావన. జీవితాన్ని సుఖమయము చేసికోవాలంటే: "వస్తువులను సేకరించు, ఎన్నో కర్మలు చెయ్యి, ఒక ప్రదేశాన్ను౦చి ఉంకో ప్రదేశానికి మారు, అనుభవించు" అని అంటారు. ఇదంతా ఎందుకు? మన౦ జీవితాన్ని సులభతరం చేసికొ౦టే మనకు ఇతరులను ప్రేమించడానికి, వారితో కలసి మెలసి జీవించడానికి, వారికి సేవ చేసుకోవడానికి తగినంత సమయం, శక్తి ఉంటాయి. దానివలన మన ఆరోగ్యం చక్కబడుతుంది. అనాశక్తి, వేర్పాటు, విసుగు మాయమవుతాయి.
మనము నిరంతరము వనరుల మీద ఆధారపడి మన జీవితాన్ని ఇంకా ఎక్కువగా సుఖమయం చేసికోవాలని ప్రయత్నిస్తాం. ఇటువంటి శ్రధ్ధ వలన జీవితాలు, మరణాలు, యుద్ధాలు, రాజకీయాలు ప్రభావితమవుతున్నాయి. లెమ్మింగ్ అనే పక్షి సముద్రంలో ములగాలని ఎగురుతుంది. దాని దారిని నిరోధిస్తే అది ఉ౦కో దారికై వెదుకుతుంది. శ్రద్ధ కూడా అటువంటి పట్టుదల, మూర్ఖత్వం గలది. "పెట్రోలియం ఆయిల్ లేక పోతే బొగ్గు ఉంది. అదీ లేకపోతే అణు శక్తి ఉంది" అనుకొంటుంది.
శ్రధ్ధ మన౦ నమ్మే విషయాలమీద ఆధారపడిఉంటుంది. దానిలో మార్పు ఉంటే ప్రపంచం తలక్రిందులవుతుంది. మనం కిరాణా కొట్టుకెళ్ళి ఒక వస్తువుని కొని, దానికి కొన్ని నాణేలను ఇస్తే, అది మనకున్న శ్రధ్ధ వలన. ఆ కొట్టు యజమాని ఆ నాణేలను నమ్మి, వాని సమయాన్ని, వస్తువుల్ని, శక్తిని దారపోస్తాడు. వాని శ్రధ్ధ ధనార్జనము. అలాగే వాడు బ్యాంకుకు వెళ్ళి తన డబ్బుని అప్పచెపితే, అది తనకు భవిష్యత్తులో పనికి వస్తుందనే శ్రద్ద వలన. వాడికున్న శ్రద్ధే తక్కిన వారికి ఉన్నదని నమ్ముతాడు. ఇది శ్రద్ధ కున్న లక్షణం. అది అత్యంత గోప్యమై అందరిలో వ్యాప్తి చెందియు౦ది.
బ్యాంకుల మీద ప్రజలకు నమ్మకం పోతే అవి దివాలా తీస్తాయి. ప్రజలకి ఒక దేశ చలామణి మీద నమ్మకం పోతే దేశానికి ఆర్థిక సంక్షోభ౦ కలుగుతుంది. దాని వలన ఒక దేశం దివాలా తీస్తుంది. అలాగే శ్రద్ద కూడా. ప్రజలంతా దేవుడు మన హృదయాల్లో ఉన్నాడని నమ్మితే, వాళ్ళు దానికి అణుగుణంగా బ్రతుకుతారు. అటువంటి నమ్మకం ఎవరికీ లేకపోతే మన నాగరికత నశిస్తుంది.
శ్రద్ధని మార్చుకోవచ్చు: అది హీన స్థితికైనా, ఉన్నత స్థితికైనా. కొన్ని సంవత్సరాల క్రిందనుంచీ మానవుడు ఒక మైలుని ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో పరిగెత్తలేడని అందరూ నమ్మేవారు. అది ఒక గోడలా అడ్డు ఉండేది. క్రమంగా మానవుడు వేగాన్ని పెంచేడు. అది 100 కి ఒకటవ వంతు సెకండ్ కావచ్చు. కాని అది పురోగతి.
ఒక క్రీడాకారుడు వేగంగా పరిగెత్తడానికి ఏ గోడా అడ్డులేదని సంకల్పించేడు. దాని వలన 4 నిమిషాల అడ్డంకు ఇక లేదు. ఇది దేవుని నిర్ణయము కాదని అనేక మంది 4 నిమిషాల కన్నా తక్కువ సమయంలో ఒక మైలు పరిగెత్తేరు. ఈ రోజుల్లో అటువంటి నిబంధన ఉందని నమ్మరు. ఒక నిబంధన ఉంటుంది. కానీ అది శారీరకంగా ఉందని ఏ శాస్త్రజ్ఞులు చెప్ప లేక పోతున్నారు.
ఇది చాలా ఉత్సాహభరితమైన అంశం. ఒక ప్రక్క శ్రద్ధ వలన అనార్థాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఉంకో ప్రక్క పాము కుబుసం వదులుతున్నట్లే మన౦ పురాతనమైన మూఢ నమ్మకాల విష వలయంలో౦చి బయటపడవచ్చు. భవిష్యత్తులో మనం ప్రస్తుత కాలాన్ని, మనమిప్పుడు రాతి యుగాన్ని ఎలా చూస్తున్నామో, భావి తరం అలాగ చూస్తారు. మానవుడు ఎంత ఎత్తుకు ఎదగగలడో ఎవరికీ తెలియదు. సహజంగా మనకున్న ఊహ, జ్ఞానం, ప్రేమల వలన కలిగే పురోభివృద్ధికి పరిమితి లేదు. కొంత మంది మహాత్ములు -- సెయింట్ ఫ్రాన్కిస్, సెయింట్ తెరెసా, గాంధీ--వలన మనకు తెలిసేదేమంటే మనకున్న శక్తి , సామర్థ్యాలికి ఎల్లలు లేవని. 325
No comments:
Post a Comment