Bhagavat Gita
10.1
శ్రీ భగవానువాచ:
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః
{10.1}
యత్తే అహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా
అర్జునా! నా వచనము నాలకించి సంతసించుచున్న నీకు హితమును గోరి నేను మరల చెప్పుచున్న ఉపదేశమును ఆలకింపుము
న మే విదు స్సురగణాః ప్రభవం న మహర్షయః
{10.2}
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః
నా యొక్క పుట్టుకను దేవత లెరుగరు. మహర్షు లెరుగరు. దేవతల, మహర్షుల ఆవిర్భావమునకు అది కారణమైన వాడను నేనే గదా!
యో మా మజ మనా దిం చ వేత్తి లోక మహేశ్వరం
{10.3}
అసంమూఢ స్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే
జన్మయు, ఆదియు లేనివాడను, సర్వలోక ప్రభువును అగు నన్ను తెలిసి కొనినవాడు మానవుల యందు అజ్ఞానము లేనివాడై సర్వకల్మషముల నుండి విడిపడుచున్నాడు
నేను బాల్యంలో స్కౌట్ గా ఉండేవాడిని. నేను, నా మిత్రులు ఖాకీ బట్టలు, ఆకుపచ్చని తలపాగా వేసుకొని అడవిలో ఒక ఆట ఆడేవాళ్ళం. అదేంటంటే ఒక జట్టు వెళ్ళి అక్కడక్కడా కొన్ని చిహ్నాలు పెడతారు. నా జట్టు వాళ్ళు వెళ్ళిన కొంతసేపటకి బయలదేరి ఆ చిహ్నాలను -- ఉదాహరణకి ఒక కొమ్మ మీద సుద్ధ ముక్కతో గుర్తు -- వెదకి, మా ముందు వెళ్ళిన జట్టు అడుగుజాడలను వెంబడించి వారిని పట్టుకోవాలి.
ఇదే దేవుడు కూడా చేసేది. మనము అతనిని వెతికి పట్టుకోవాలని తన చిహ్నాలను విశ్వమంతటా పెట్టేడు. ఎవరైతే సూక్ష్మ దృష్టితో, సాధనచేస్తారో వారు ఆ చిహ్నాలను వెదికి పట్టుకొని దేవుని చేరుతారు. మనలో చాలామంది ఆ చిహ్నాలను చూస్తారు. కానీ అవి దేవునివని గుర్తించలేరు. ధ్యానం చేస్తూ, ఓర్పుతో ఉండి, ఇతరులు విమర్శించినా వారిపై కోపము ప్రదర్శించకుండా, ఉండేవారిని చూసి "అతనిలో దేవుడున్నాడు" అని తలుస్తాము.
ఒకడు బుద్ధుని కలవాలని, ఎలాగైతే జంతువులను వాటి కాలి గుర్తులను పట్టుకొని వెదకుతామో, అలాగ ఊళ్ళు తిరుగుతున్నాడు. వెళ్ళిన ప్రతి ఊరులోనూ బుద్ధుని వలన ప్రభావితమైన వాళ్ళందిరినీ చూసి "ఇవి పెద్ద ఏనుగు చిహ్నాలు" అని కనుగొన్నాడు.
దేవుడు అన్ని చోట్లా ఉన్నా, ఆయన చిహ్నాలు అపరిమిత సృష్టిలో స్పష్టంగా కనబడుతాయి. ఎక్కడైతే పరిపూర్ణత ఉంటుందో -- మనుష్యులలో, చెట్లలో, నక్షత్రాలో--ఆయన అక్కడ ప్రకటితమౌతున్నాడు.
ఒక పెర్షియన్ యోగి ఇలాగ వ్రాసేడు:
తన అంతులేని, నిత్యమైన లక్షణాలు కనిపింపజేయడానికి, దేవుడు దేశ,కాలములనే పచ్చని భూములు సృష్టించేడు. విశ్వమొక తోట. ప్రతి ఆకులో, కొమ్మలో, పండులో అతని లెక్కపెట్టలేని గుణాలు ప్రకటితమౌతున్నాయి.