Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 2

Bhagavat Gita

10.2

బుద్ధిర్జ్ఞా మసమ్మోహః క్షమా సత్యం దమ శ్శమః {10.4}

సుఖం దుఃఖం భవో అభావో భయం చా భయ మేవ చ

అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో అయశః {10.5}

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః

బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండుట, సహనము, సత్యము, దమము, సుఖము, దుఃఖము, భయము, అభయము, అహింస, సమత్వము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు అనేక గుణములు ప్రాణులకు నావలననే కలుగుచున్నవి

మనము ప్రపంచాన్ని ద్వంద్వాలతో చూస్తాము: మంచి - చెడు, తప్పు - ఒప్పు, ఆహ్లాదం - విషాదం. భగవంతుడు చంచల మనస్సు కలవాడు కాడు. అలాగే ప్రేమించకుండా ఉండేవాడు కాదు. ఇవన్నీ మనము ఏర్పరచుకొన్న విభేదాలు.

ఎడ్గర్ అల్లాన్ పో వ్రాసిన ఒక కథలో, ఒకడు మరొకని ఉత్తరం బహిర్గితం చేస్తానని ఏడిపిస్తూ ఉంటాడు. ఉత్తరం వ్రాసిన వాడు చివరకు పోలీసులను పిలుస్తాడు. వాళ్ళు ఏడిపిస్తున్నవాడి ఇంటికి వచ్చి ఆ ఉత్తరాన్ని ఇల్లంతా వెతుకుతారు. కానీ ఎక్కడా కనబడదు. చివరకు వాడు కూర్చునే బల్లమీద అందరికీ కనబడుతూ ఆ ఉత్తరం ఉంటుంది.

అలాగే దేవుడు విశ్వమంతటా మనకు నిత్యం కనబడుతూ ఉన్నాడు. కానీ మన మనస్సు ద్వంద్వాలతో కూడి ఉండటంవలన దేవుడు కనిపించటం లేదు.

ధ్యానం పరిపక్వమౌతున్న కొద్దీ మనకు తెలిసేదేమిటంటే మనస్సులో ఇష్టాయిష్టాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. ఆ ప్రక్రియ అచేతన మనస్సులో జరగడంవలన మనకది సాధారణంగా కనబడదు. ఒకరిని పరికిస్తున్నప్పుడు మనస్సును విశ్లేషణం చెయ్యండి: "నాకు వాని నడక నచ్చలేదు. అది ఎంతో డాంబికంగా ఉంది. వాని గొంతుకు నచ్చలేదు. అది నాకు గగుర్పాటు కలిగిస్తుంది" అనే భావాలు కలుగుతాయి.

ఈ విధంగా మనస్సు పనిచేస్తుంటే ద్వంద్వాలకు అలవాటు పడ్డామని తెలుస్తుంది. దానివలన మన విశ్వాసం, సహనం, భద్రత మొదలగునవి చంచలంగా మారుతాయి. ఈ శ్లోకంలోని చెప్పిన లక్షణాలు మన జ్ఞానోదయానికి సహకరిస్తాయి. అసమ్మోహ అనగా ఎటువంటి భ్రాంతి లేకుండుట. అనగా ప్రపంచమంతా ఏకమైనదనే ఎరుక. దాని వలన ప్రపంచం ఇచ్చే డబ్బు, ఆనందం, పరువు, ప్రతిష్ఠ వలన సమ్మోహనము చెందము.

అహంకారము గలవారు సమ్మోహితులై మిత్రులతో వైరము కలిగించుకొనుట, ప్రమాదకరమైన క్రియలు చేయుట, మొదట ఆనందము కలిగించినా చివరకు నిరాశ కలిగించే మార్గాల మీద ప్రయాణ౦ చేస్తారు. ధ్యానం వలన మనకు కనువిప్పు కలిగి, ప్రపంచం మారలేదు, మనమే మారేమని తెలుసుకొంటారు.

క్షమ వలన మన అహంకారాన్ని జయించవచ్చు. క్షమ అనగా ఒకరిని క్షమించడం, ఓర్పు, సహనం, ఇతరులను అర్థం చేసికోవడం. మనని ఇతరులు పట్టించుకోవటంలేదు, మనకి వారు అన్యాయం చేస్తున్నారు అనే ఆలోచనలు బాధ పెడుతున్నప్పుడు ఓర్పు అవసరం. దాని వలన మన మనస్సు అనుమానాలతో, క్రోధంతో ఉండదు. మనం ఒకర్ని పలకరించి, వారి నుండి ఎటువంటి స్పందన రాకపోతే వారిమీద కోపం కలుగవచ్చు. తరువాత వాళ్ళు సమస్యలతో సతమతమవుతున్నారిని తెలిసికొని మన కోపం తగ్గి వారిని క్షమిస్తాము.

మనకు తీవ్రమైన సమస్యలు కలిగించిన వారితో సామరస్యంగా ఉండడం క్షమకి తార్కాణం. అలాగ ఏదో బలి పశువులా కాక, ఆనందంతో ఉండాలి. అలాగని మనము వారికి విధేయులమై ఉ౦డాలని భావించనక్కరలేదు. వారితో సహనం పాటించి బాంధవ్యం పెంచుకోవాలి.

మనము ప్రేమించే వారలతో విభేదం కలిగినప్పుడు వారికి మన విభేదాన్ని కరుణతో చెప్పాలి. ఇది ముఖ్యంగా పిల్లలకు వర్తిస్తుంది. శ్రీరామకృష్ణ మనకు విభేదం కలిగినప్పుడు పాము వలె బుస కొట్టాలి గానీ కరవ కూడదు అన్నారు.

సమ్మోహనాన్ని నియంత్రించుకోవాలంటే మనగురి౦చే ఎప్పుడూ ఆలోచించకూడదు. మనల్ని ఆనందింపజేసేవి, మనకు దుఃఖము కలిగించేవి, మనకు కావలిసినవి, మనకి అక్కరలేనివి అనే ద్వంద్వాల గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటే, ఇతరులతో, చివరికి మనతో కూడా, వేర్పాటు చెందుతాము. కాబట్టి శ్రీకృష్ణుడు మనకు జీవితం ఇచ్చిన దానితో సంతృప్తి పడమని చెప్పేడు. భిక్షగాడివలె జీవితాన్ని "నాకు ఆనందాన్ని ఇవ్వు; బాధ కలిగించవద్దు" అని అడుక్కునే కన్నా, మనం దానం చేయగలిగినది ఏమిటి అని అడగాలి. ఇతరులకు మన సమయ౦, వస్తువులు, సమర్థత, వస్త్రములు, ఆహారము, ఏమైనా సంతోషంతో ఇవ్వాలి. మనమిచ్చేది విలువైనది కాకపోవచ్చు. కానీ మనము సంపూర్ణ హృదయంతో, ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా ఇవ్వాలి. మనకు ఎక్కువగా డబ్బు ఉన్నంత మాత్రాన సంపన్నులము కాదు; మనమెంత ఇతరులకు ఇస్తే --డబ్బు మాత్రమే కాక--మనమంత ధనవంతులమైనట్టు.

దీనికొక కథ చెప్తారు. ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పు చేయక, అన్ని నియమాలను పాటించి, ఇతరులకు మంచి బోధ చేసి, వారితో ఎప్పుడూ సామరస్యంగా ఉండి, కొన్నాళ్ళకు ప్రాణం విడిచేడు. చిత్రగుప్తుడు వాని గురించి తన చిట్టాలో వెదకుతే ఎటువంటి తప్పులు, ఒప్పులు కనిపించలేదు. చిత్రగుప్తుడు ఆశ్చర్యపడి వానిని బ్రహ్మ దగ్గరకు తీసికెళ్ళేడు. "నువ్వే వీనిని సృష్టించేవు. వీనిని స్వర్గానికి పంపించాలో, వద్దో చెప్పు" అని చిత్రగుప్తుడు బ్రహ్మను అడిగేడు. బ్రహ్మ కూడా వానికి ఎటువంటి తప్పు, ఒప్పు లేదని తీర్మానించేడు. "వీనిని శ్రీకృష్ణుని వద్దకు తీసికివెళ్ళు" అని బ్రహ్మ దేవుడు సలహా ఇచ్చేడు. శ్రీ కృష్ణుడు వాని చిట్టా అంతా చూసి ఆ వ్యక్తి ఒకమారు బిచ్చగాడికి 5 పైసలు దానం చేసేడని కనుగొన్నాడు. "చిత్రగుప్తా, వీనికి 5 పైసలు ఇచ్చి మళ్ళీ ప్రయత్నం చెయ్యమని చెప్పి, వెనక్కి పంపించు" అని శ్రీకృష్ణుడు తీర్మానించేడు. 206

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...