Bhagavat Gita
9.25
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
{9.34}
మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః
నా యందే మనస్సు నుంచుము. నా భక్తుడవు కమ్ము. నన్నే అర్చి౦పుము. నాకే నమస్కరింపుము. ఇట్లు నన్నే పరమగతిగ నమ్మిన నీవు తుదకు నన్నే పొందగలవు
శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జీవన రహస్యాన్ని ఒక్క మాటలో చెప్పాడు: మన్మనా అనగా నీ మనస్సు నాతో నింపుకో. మనస్సును దేవునితో నింపుకొని నిశ్చలంగా ఉంచండి. కలల్లో ఆయన్ని చూడండి, ఆయన బోధ వినండి. ధ్యానంలో ముందుకు సాగిన తరువాత భగవంతుడు మనం అతనియందు అనన్య భక్తితో ఉన్నామా లేమా అని మనను పరీక్షిస్తాడు. అతను ఒక నిరాశ కలిగించే సంఘటన చేసి, ఇప్పుడు ధ్యానం చెయ్యి అంటాడు. మన మనస్సు వికలమై "నీవు నాకింత నిరాశ కల్పించేవు. నేను ధ్యానం ఎలాగ చేసేది? నెను నిశ్చేష్టుడనైనాను" అంటే మనము ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గలేము. కానీ మనం ఏకాగ్రతతో, చిత్త శుద్ధితో చాలా కాలం ధ్యానం చేస్తే, మనకెటువంటి సమస్యలు ఎదురైనా, మన మనస్సు దేవునియందు లగ్నమై ఉంటుంది. మనకెంత ప్రతికూలత కలిగినా, మన మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది. అప్పుడు దేవుడు "నీవు ఉత్తీర్ణుడవు" అని చెప్తాడు. అప్పుడు మన సమస్యలు సమసిపోతాయి.
దేవుడొక్కడే మన అనన్య భక్తికి, ప్రేమకు అర్హుడని మనమెప్పుడు మరచిపోకూడదు. మన ధ్యానాన్ని ఇతర విషయాలవలన ఆపేయకూడదు. మన జీవితం ధ్యానంతో ముడిపెడితే ఆరోగ్యం, భద్రత, మేధ, సృజనాత్మక శక్తి తప్పక వృద్ధినొందుతాయి. మనమలా ప్రయత్నించి మన మనస్సును ప్రేమ, భక్తితో నింపుకొంటే, మనము తప్పకుండా అతనిలో లీనమవుతాము.