Bhagavat Gita
10.11
వేదానా౦ సామవేదో అస్మి దేవానామస్మి వాసవః
{10.22}
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా
వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, భూతముల యందు చేతనాశక్తి నేనై యున్నాను. ఀ
నాల్గు వేదములు: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. వాటికి మూలము విద్ అనగా తెలిసికొనుట. వేదాలు మనము ముఖ్యంగా తెలిసికొనవలసిన విషయాలు చెప్తాయి.
నేను చెప్పే ఊహాతీతమైన జ్ఞాన సముపార్జన (transcendental mode of knowing) కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అది వారి అనుభవానికి అందనిది. అందువలన వారికది కొరకబడదు. అందుకై నా పెంపుడు పిల్లి కథ చెప్తాను. దాని పేరు ఊష్. అది నాతో భారత దేశం నుంచి అమెరికాకి ప్రయాణం చేసింది. దానికి ప్రత్యేకమైన ఆహారము, ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. దానికి మాటలు వస్తే సర్వోత్తమమైన జ్ఞాన సముపార్జన విధం ఏమని అడిగితే, అది ప్రవృత్తి (instinct) అంటుంది. దాని మరుసటి జన్మలో మానవునిగా పుడితే ఆలోచించడం అంటుంది. కాని అది పిల్లిగా ఉన్నంత కాలము ప్రవృత్తి ఒకటే దానికి ఆధారం. మానవులు ప్రవృత్తి నుంచి ఆలోచనచేసే పద్దతి, పరిణామం వలన, పొందేరు. తద్వారా యోగులు ఉన్నతమైన జ్ఞానంతో ప్రపంచంలోని సర్వ జీవరాశులను చూస్తారు.
పై శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సు గురించి చెప్పేడు. మనస్సు మన ఆరవ ఇంద్రియము. దాని ద్వారా పంచేంద్రియములగూర్చి అవగాహన వస్తుంది. అది ఇంద్రియములకు ఎటువంటి సంకేతము ఇవ్వకపోయినా, తనలో తాను రమిస్తుంది. ఈ నేపథ్యంలో మనస్సు కోరికలతో నిండివుంటుంది. మన ముందు పిజ్జా లేకపోయినా, మనస్సు పిజ్జా రుచిని, వాసనను అనుభవించగలదు. మనం అంతకుముందు తిన్న పిజ్జా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. అది మనలోని పిజ్జా సంస్కారము లేదా పిజ్జా యావగా ఉంటుంది. ఇలాగ ఇంద్రియాలలో మనస్సు ఉత్కృష్టమైనది. మనము పంచేంద్రియాలను జయించాలంటే మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి.
మన మనస్సనే తోటలో అనేకమైన కలుపు మొక్కలు ఉన్నాయి. అవి క్రోధం, భయం, పగ, మత్సరము మొదలగునవి. కలుపు మొక్కలవలన దయ, దాక్షిణ్యము అనే మొక్కలు పెరగవు. అది తోట భూమి సారవంతంగా లేక కాదు. మనము కలుపు మొక్కలను తీసివేయక మంచి గుణాలు పెంపొందవు. కొందరు తమ క్రోధం, ఆవేశం గూర్చి గొప్పగా చెప్పుకొంటారు. మనము మన సమస్యల గూర్చి వ్రాసినా, ఆలోచించినా అవి నిద్రలో అచేతన మనస్సులోకి చేరుకొంటాయి. అప్పుడు వాటిని వేళ్ళతో పెకలించడం సాధ్యం కాదు. కాబట్టి మనము రోజూ ధ్యానం చేసి, మంత్రము జపించి, మనలోని చెడు భావాలను తీసివేసి, మంచి భావాలను అలవరుచుకోవాలి.
మనస్సు ఇంద్రియమనబడడానికి కారణం, అది స్వతహాగా చేతనము లేని పరికరం లాంటిది. దేహం బాహ్యంలో ఎలాగ ఉందో, మనస్సు అంతర్ముఖంగా ఉంది. అది చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది కాని, దానికి స్వతహాగా చైతన్యము లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు, తాను మనస్సేకాక, ప్రతి జీవిలోనీ చైతన్యమని చెప్పును. మట్టితో వివిధ రకాలైన కుండలు చేసి చూస్తే వాటిలో ఉండే గాలి అంతా ఒక్కటే. అలాగే మన ఆకారాలు వేరైనా, మనలోని చైతన్యము ఒక్కటే. మన౦దరిలోనూ శుద్ధమైన, తేడా లేని, చైతన్యము ఉంది. అదే ఆత్మ.