Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 12

Bhagavat Gita

10.12

రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసా౦ {10.23}

వసూనాం పావక శ్చాస్మి మేరు శ్శిఖరిణా మహమ్

నేను రుద్రుల యందు శంకరుడను. యక్షరాక్షసులలో కుబేరుడను. వస్తువుల యందు అగ్నిహోత్రుడను. పర్వతములలో మేరు పర్వతమునై యున్నాను

శ్రీకృష్ణుడుకి శంకర, రుద్ర అను నామములు గలవు. ఇక్కడ అతడు చెప్పక చెప్పినది: దేవుని దయ మనకు దుఃఖ రూపేణా వస్తుందని.

మనము ఎంతోకొంత శ్రమ లేనిదే ఏమీ నేర్చుకోలేం. కావున, మనం ఎప్పటికీ ఒకేలాగ ఉంటామా లేదా శ్రమ చేసి ఎదుగుతామా అని మనని ప్రశ్నించుకోవాలి. దుఃఖాన్ని మిత్రుడుగా ఆహ్వానించనప్పుడే అది శత్రువులా వస్తుంది. మనము దుఃఖము వలన ఆరోగ్యాన్ని, భద్రతని పెంచుకోవచ్చు. లేదా మన జీవన విధానాన్ని మార్చుకోలేక నిరాశ చెందవచ్చు.

నేను కొన్ని రోజుల క్రితం తక్కినవాళ్ళు ఏమి తింటున్నారని తెలిసికోవడానికి నా మిత్రునితో ఒక పెద్ద హోటల్ కి వెళ్ళేను. అక్కడ అక్షరాస్యులై, అత్యంత సంస్కారవంతమైనవారు అనారోగ్యము చేసే పదార్థాలను తింటున్నారు. నేను మన దేహ వ్యవస్థ ఎంత గొప్పదో కదా అనుకొన్నాను. వారి దేహము ఇంకా స్వస్థతో ఉండి, మరిన్ని భౌతిక సమస్యలు లేకుండా ఉందంటే, దానికి కారణము దేవుని దయ. మీరు సంపూర్ణమైన నాడీ వ్యవస్థని చూడాలనుకొంటే, చిన్న పిల్లవానిని చూడండి. కానీ వాడే పెద్దవాడయి లేనిపోని సమస్యలు తెచ్చుకొ౦టాడు. మానసిక ఒత్తిడి, రక్త పోటు, తీవ్రమైన తలనొప్పి, కడుపులో పుళ్ళు మొదలైనవి రాత్రికిరాత్రీ రావు. అవి మనము దీర్ఘ కాలంగా ఆలోచించక చేసే తప్పు ఎన్నికల వలన కలుగుతాయి.

కొందరు మొదటిసారి బాధ అనుభవించగానే, తమ ఆలోచనలను, నడవడికను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానితో ఒక సమస్య ఉంది. వారిక చెడ్డ అలవాట్లు ఉంటే, వారు మారడం చాలా కష్టం. నాకు ధూమపానమునకు, మద్యమునకు, మాదక ద్రవ్యాలకి అలవాటు పడినవారు చాలా మంది తెలుసు. వారికి ధ్యానం విశేషంగా చెడ్డ అలవాట్లు వీడడానికి పనికివస్తుంది. అలా మారి తమ చెడు అలవాట్లను సమూలంగా నిర్మూలించిన మిత్రులు నాకున్నారు. ధ్యానం చెడు అలవాట్లను నిర్మూలించడానికి కావలసిన పట్టుదలనిస్తుంది.

ఇదేవిధంగా మన సహజ వనరులను కాపాడుకోవచ్చు. మన౦ పీల్చే గాలి, త్రాగే నీరు, నదులు, సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయి. అందువలన మనమనుభవించే బాధ మన భౌతిక దేహ బాధ వంటిదే. మనం నిర్దయతో పర్యావరణాన్ని వాడుకొని మిక్కిలి హాని కలిగించుకొంటున్నాము. సముద్రమంటే రెండు ఖండాల మధ్యనున్న జాగాయే కాదు. 80 శాతం జీవులు సముద్రాల్లో నివసిస్తున్నాయి. వాటిలో గ్రాండ్ కాన్యన్ కన్నా లోతైన ప్రదేశాలు, ఎవరెస్ట్ శిఖరానికన్నా ఎత్తైన పర్వతాలు నీటితో కప్పబడి ఉన్నాయి. మొత్తానికి జీవరాశుల బ్రతికిఉండడానికి సముద్రాలు సహకరిస్తాయి. కానీ సముద్రములలోకి చమురు, పరిశ్రమల వ్యర్థాలు, మురికి కాల్వల నీటిని, వదిలి వాటిలో నివసించే జీవులకు మిక్కిలి హాని కలిగిస్తున్నాం. ఇది ఒక సూచిక: మన జీవన విధానాన్ని విశ్లేషణము చేసి, మన అవసరాలను నియంత్రించి, భౌతిక వనరులను ఎంత తక్కువగా వీలయితే అంత తక్కువగా ఉపయోగించాలి.

ప్రసార మాధ్యాలు ఏమి చెప్పినా, జీవితంలో బాధలు ఉండవన్నట్టు మనము వ్యవహరించకూడదు. ఆఫ్రికాలోనైనా లేదా అమెరికాలోనైనా, గొప్పవాడైనా పేదవాడైనా, అందరూ బాధలు అనుభవిస్తున్నారు. అది జీవితంలో సహజం. మనము ఆధ్యాత్మిక జీవనంలో పరిపక్వత పొందితే, ప్రపంచంలో ఎంతోమంది దుఃఖంలో జీవిస్తున్నారని తెలిసి, మన స్వార్థానికై సుఖాలను లేదా లాభాలను ఆశించం. మనలో చాలామంది చిత్రవిచిత్రమైన మానసిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ధనవంతులులా ఉంటే ప్రతీదీ ఒప్పని తలుస్తాం. మన కళ్ళు తెరిచి చూస్తే, దుఃఖం మన చుట్టూ ఉన్న వేలాది మందిలో ఉందని గుర్తిస్తాం. అది యుద్ధాల వలన లేదా పేదరికం వలననే కాకపోవచ్చు. మనము ఎంత చుట్టూ ఉన్న దుఃఖాన్ని చూడక ఉంటామో, అంత ఎక్కువ బాధలు పడాలి. ఎందుకంటే దుఃఖం మనను సుఖాలను వీడి పరోపకారము చెయ్యడానికి ప్రోద్భలం ఇస్తుంది.

శ్రీకృష్ణుడు తాను పావక -- అనగా శుద్ధి చేసే అగ్ని -- అని చెప్పేడు. నేనొకసారి బంగారం గనులున్న ప్రదేశానికి వెళ్ళేను. అక్కడ బంగారాన్ని భూమినుండి వెలికితీసి, అగ్నితో వేడిచేసి మలినాన్ని తీసివేసి, సుత్తితో దాగిలి మీద కొట్టి తమకు కావలసిన ఆకారంగా మారుస్తారు. ఇలాగే ఆధ్యాత్మిక సాధన కూడా. కొందరు అహంకారాన్ని వీడక ఉంటారు. మరికొందరు దేవుని తమను దాగిలి మీద పెట్టి, సుత్తితో కొట్టి, అహంకారాన్ని సమూలంగా నాశనం చేయమని వేడుకొంటారు. అలా చెప్పగలిగితే, ఒక వ్యక్తి దుఃఖానికి అతీతుడైనట్టు. దేవుడు సుత్తిని ఎత్తవచ్చు, కాని అది అతని మీద పడదు. దానికి బదులుగా సుత్తిని విసిరేసి, అతన్ని దేవుడు హత్తుకొ౦టాడు. 228

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...