Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 3

Bhagavat Gita

10.3

మహర్షయ స్సప్తపూర్వే చత్వారో మనవ స్తథా {10.6}

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః

లోకము నందలి ఈ జనులు ఎవరియొక్క సంతతియై యున్నారో అట్టి పూర్వీకులైన ఏడుగురు మహర్షులును, సనకాది దేవర్షులును, స్వయంభువాది మనువులును నా భావము గలవారై నా మానస పుత్రులై జన్మించిరి.

శ్రీకృష్ణుడు చెప్పిన సప్త ఋషులు: భృగు, మరీచి, అత్రి, పులః, పులస్త్య, క్రతు, అంగిరస. వీరు 7 రకాల చేతనములకు, భౌతిక ఎరుక నుంచి సర్వ జీవ సమైక్యత వరకు, చిహ్నములు. ఇంకా వీరు పరిణామ శక్తికి సంజ్ఞలు. అలాగే 4 మనువులు: స్వరోషిష, స్వయంభు, రైవత, ఉత్తమ. వీరు సృష్టి ఆరంభమున ఉండి దానిని కావింతురు. భగవంతుడు సృష్టి సిద్ధాంతాలన్నిటికీ మూల కారణము. కానీ అతడు ఋషులు మొదలైనవారికి తన బాధ్యతను అప్పచెప్పును.

గీత భౌతిక ప్రపంచము, ఆలోచనలు, భావములు గల అంతఃప్రపంచమునకు మధ్య తేడా ఉందని చెప్పదు. బయట ప్రపంచంలో ఉన్న ప్రకృతే, మన అంతఃప్రపంచంలోనూ ఉంది. మనకు ఇతరులకు బాధ కలిగిస్తే, మనలోనూ బాధ కలిగించే బీజాలు నాటబడతాయని తెలుసు. మన ప్రపంచం డ్రైవరు లేని బస్సు లాంటిది. అందరూ తమ సీట్లు వెతుక్కుంటూ, బస్సు గురించి ఆలోచించట్లేదు.

మనము అహింసను నివారించుటకు ప్రయత్నించవలెను. దానికి ముందు మనలోని క్రోధమును నియంత్రించవలెను. బయట జరుగుతున్న మారణ హోమానికి కారణం సామాజిక పరిస్థితులవలన కాక, మనలోని క్రోధము వలన. క్రోధం అతి పెద్ద మహమ్మారి. మనమెప్పుడైనా హింస చేసినా లేదా పరుషంగా మాట్లాడినా, మన వ్యాధిని ఇతరులకు వ్యాపింపజేస్తున్నాము.

ఉదాహరణకు రాముడు, సీత భార్యా భర్తలు అనుకొందాం. రాముడు ఉదయం లేచి సీత చేసిన కాఫీ బాగాలేదని విసుక్కు౦టాడు. సీతకి తిరిగి సమాధానము ఇవ్వాలని ఉంటుంది కాని ఊరకుంటుంది. రాముడు ఆఫీసుకు వెళ్ళి రోజంతా సీతకి ఏమి చెప్పాలని ఆలోచిస్తాడు. సీతకూడా అలాగే ఆలోచిస్తూ, షాప్ కి వెళ్ళి షాప్ యజమానిపై తన కోపం ప్రదర్శిస్తుంది. ఆ యజమాని తన క్రింద పనిచేసే వారిమీద ఆ కోపం చూపిస్తాడు.

ఇవన్నీ చిన్న విషయాలు. కాని రోజు రోజుకీ అవి పేరుకు పోతాయి. దాన్నే యోగులు సంస్కారమంటారు. అంటే మన చుట్టూ ఉన్న వానియందు మన౦ చూపించే స్పందన. ఇలాంటి కుసంస్కారము లోతుగా పాతుకొని ఉంటే, మనము చీటికీ మాటికీ క్రోధము ప్రదర్శిస్తాము. ఇది చూడాలంటే దిన పత్రికను చదవండి. అందుకే మనము క్రోధానికి బదులుగా ఓర్పు, సద్భావన చూపి, ఎల్లప్పటికీ అది చేజారకుండా చూసుకోవాలి.

ఇది మన మాటలలోనే కాదు. ముఖము యందు కూడా. ముఖము మనస్సుయొక్క అద్దం అన్నారు. నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు ఒక విద్యార్థిని ఉద్దేశించి "నీ ముఖం ఏడుపుగా ఉంది" అన్నాను. "అది నా సహజమైన ముఖం" అని వాడు బదులిచ్చేడు. "కానీ దానిని చూసే వాళ్ళం మేము" అన్నాను. ఇతరుల కొరకై మన ముఖ కవళిక మార్చుకోవాలి. ఇలాటి చిన్న చిన్న విషయాలు, చిలికి చిలికి గాలి వాన అయినట్టు, ప్రపంచాన్ని మారుస్తాయి. 208

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...