Bhagavat Gita
10.22
అక్షరాణా మకారో అస్మి ద్వంద్వస్సామాసికస్య చ
{10.33}
అహమేవాక్షయః కాలోధా తా అహం విశ్వతోముఖః
అక్షరములలో నేను అకారమును. సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అనంతమైన కాలమును, అనంత ముఖములు గల ధాతను నేనై యున్నాను
సంస్కృతంలో మొదటి అక్షరం అకారం. శ్రీకృష్ణుడు తాను అకారాన్ని అని చెప్పడంలో అర్థం అతడు జీవులకు మూలం. జీసస్ తాను ఆల్ఫా, ఒమేగా అని చెప్పెను. మనము అతని నుండి ఉద్భవిస్తాం, మళ్ళీ అతనిలోనే ఐక్యమవుతాం. మనము ప్రపంచంలో మన తలిదండ్రుల వలన జన్మించి యుండవచ్చు. కానీ మనము నిజముగా భగవంతుని నుండి వచ్చేము.
ద్వంద్వము వ్యాకరణానికి చిహ్నం. సంస్కృత రచయితలు చిన్న, చిన్న పదాలను కలిపి సమాసాలు, అలంకారాలు చేస్తారు. ఇంకో రకమైన ద్వంద్వాలు ఆనందము-దుఃఖము, వేడి-చలి, నష్టం-లాభం మొదలగునవి. ఎప్పుడూ మారే ప్రకృతిలో ద్వంద్వాలు సహజంగా ఉంటాయి. మనము స్వేచ్ఛగా ఉండాలంటే ద్వంద్వమోహమును -- మనము ఎడంగా ఉన్నామనే భ్రమను -- జయించాలి.
శ్రీకృష్ణుడు తాను కాలాన్ని అని ముందు చెప్పియున్నాడు. ఇక్కడ తాను ఆద్యంత రహితమైన కాలాన్ని అని చెప్పుచున్నాడు. ఇది ఆద్యంత రహితమైన ప్రస్తుతము. దానిని గాఢమైన ధ్యానంలో, ప్రపంచం యొక్క ఎరుక లేనప్పుడు, అనుభవిస్తాము. మనము కాలము సాపేక్షితము (relative) అని గ్రహిస్తాము. కాలం యొక్క గమనం మనస్సుతోనే గ్రహిస్తాము. కాలానికి స్వతహాగా మారే గుణము లేదు.
మనకి ఏకాగ్రతతో నచ్చిన పని చేస్తున్నప్పుడు కాల గమనం తెలీదు. పతంజలి ఇది బయట ప్రపంచంలో లేనిది, మన ఏకాగ్రత వలన కలిగినదని చెప్పును. అదే నచ్చని పని చేస్తే కాలం దుర్భరంగా నడుస్తున్నాదని తలుస్తాము.
ఐన్స్టీన్ ఒకమారు సభలో ప్రసంగం వింటున్నారు. ఆయనకు ఆ ప్రసంగం నచ్చలేదు. అప్పుడు ఆయన తన ప్రక్కవాని చెవిలో "నేను సాపేక్షితను కనుగొన్నాను. కాని ఈయన అనంత కాలం కనుగొన్నాడు" అని చెప్పేరు.
ధ్యానంతో మనస్సును నిశ్చలం చేసికొంటే మనము ఆద్యంత రహితమైన కాలంలో గడపవచ్చు. అప్పుడు మనము నచ్చిన లేదా నచ్చని క్రియలపై సమతుల్యంగా ఉంటాము. ఇంకా గతం, భవిష్యత్తు మన మనస్సులోనే ఉన్నాయని తెలిసికొంటాం. దానివలన మన గతంలో చేసిన తప్పులు బాధించవు , లేదా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అనే తపన ఉండదు. మన౦ గతం, భవిష్యత్తు నిజమని ఎందుకు అనుకుంటామంటే గతంలో మనం చేసిన క్రియలు, ఇతరులు మనకు తెచ్చిన కష్టాలు, భవిష్యత్తులో చేయబోయే క్రియలు, ఇతరుల వలన కలగబోయే కష్టాల గూర్చి ఆలోచిస్తూ ఉంటాము కనుక. గతం, భవిష్యత్తు నిజము కావు. కానీ వాటి గూర్చి ఆలోచనలు నిజం.
కొన్ని సంవత్సారల క్రితం నేను ఒక ఇంటిలో అద్దెకున్నాను. ఆ ఇంటి యజమానికి దెయ్యాలు ఉన్నాయని నమ్మకం. వాని ఇంటి దగ్గర ఒక శ్మశానం ఉంది. అతడు అక్కడి దయ్యాలు తనను వెంటాడుతున్నాయని భావించేడు. నేనేమి చెప్పినా అతడు తన నమ్మకాన్ని మార్చుకోలేదు. చివరకు నేను అక్కడికి వెళ్ళి చూస్తానని చెప్పేను. నేను శ్మశానం నుంచి తిరిగి వచ్చినప్పడు అతను నేను దయ్యాలను చూసేనా అని ఆతృతగా అడిగేడు.
"నేను మూడు దయ్యాలను చూసేను" అని చెప్పేను.
"నువ్వేమి చేశావు?"
"నా ఇంటి యజమాని చాలా మంచివాడు. వానిని పట్టి పీడించకండి" అని చెప్పేను.
"దయ్యాలు ఏం చెప్పాయి?"
"అలా చేయలేం. ఎందుకంటే అతను మమ్మల్ని నమ్మిన౦త కాలం, మేమిక్కడే ఉండాలి"
అతడు కొంత సేపు తరువాత బిగ్గరగా నవ్వేడు. అతడు అప్పట్నుంచి దెయ్యాలను నమ్మడం మానేసాడు. మన గతంలో జరిగిన విషయాలు దెయ్యాలవలె మనని పట్టి పీడిస్తాయి. ఎప్పుడైతే మనం వాటి గురించి ఆలోచించడం మానేస్తామో అవి ఇక మనను వెంటాడవు.
ఈ విధంగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉంటే, మన చేతన మనస్సు ప్రస్తుత కాలం మీద ఏకాగ్రతతో ఉంటుంది. బుద్ధుడు దీనినే క్షణికవాదమనే సిద్ధాంతం ద్వారా వివరించేడు. ఒక క్షణానికి, మరొక క్షణానికి సంబంధం లేదు అని బోధ చేసేడు. ప్రతీ క్షణం ఏకైక మైనది.
శ్రీకృష్ణుడు విశ్వతోముఖః అని అంటాడు. అంటే అతని ముఖం అన్నిట్లోనూ ఉంది అని. నికోలాస్ ఆఫ్ క్యూసా "ప్రతి ముఖంలోనూ భగవంతుని ముఖం ఒక తెరవెనకాల ఉంది" అని అన్నారు. దేవుని ముఖము ధ్యానంలో సమాధి స్థితి పొందినప్పుడు మనలో ఆవిర్భవిస్తుంది.