Bhagavat Gita
10.26
వృష్ణీనాం వాసుదేవో అస్మి పాండవానాం ధనంజయః
{10.37}
మునీనామప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః
నేను యాదవులలో వాసుదేవుడను. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. కవులలో శుక్రాచార్యుడను
శ్రీకృష్ణుడు అవతార పురుషుడు మరియు బ్రహ్మన్ కి సమానమైన వాడు. ఒకే బ్రహ్మన్ వివిధ రూపాలలో కనిపిస్తున్నాడు. అవతారంగా శ్రీకృష్ణుడు మానవ రూపంలో భూమ్మీద పుట్టేడు. అలాగే మరణించేడు. కాని బ్రహ్మన్ అలాకాక పుట్టుకలేక, మరణములేక ఉండును. జీసస్ క్రైస్ట్ కూడా మేరీ మాతకి పుట్టి, పెరిగి, చివరకు శిలువ వేయబడ్డాడు. ఆయన అవతారాన్ని చాలించేడే గాని, ఉనికి మాత్రం పోగొట్టుకోలేదు. అలాగే బుద్ధుడు రాజ వంశంలో పుట్టి, భార్యా పిల్లలను పొంది, చివరకు నిర్వాణం పొందేడు. వీరి విషయాల్లో తెలిసికొనవలసినది ఏమిటంటే ఒకే శక్తి -- అనగా బ్రహ్మన్ -- వివిధ రూపాల్లో భాసిస్తోంది. భూమి మీద మన ఉనికి పోయినా, ఆ సృజనాత్మక శక్తిలో మన ఉనికి ఎప్పుడూ ఉంటుంది.
నేను, నా భార్య ఒకమారు బృందావన్ కి వెళ్ళాలా లేదా తాజ్ మహల్ కి వెళ్ళాలా అనే సందిగ్దంలో పడ్డాము. చివరకు మేము బృందావన్ కి రైలు బండిలో వెళ్ళేము. ఆ ప్రదేశంలో ఆవులు వాటిని నడిపే గోపాలులు ఎక్కువ కనబడ్డారు. ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు తన లీలలను చూపి అక్కడి వారిని మంత్రముగ్దులను చేసేడు. అలనాటి గోవర్ధన పర్వతం ఇప్పటికీ ఉంది.
గోవర్దన పర్వతం గురించి ఒక కథ చెప్తారు. ఇంద్రుడు శ్రీకృష్ణుని అవతార పురుషుడు అవునో కాదో పరీక్షించ దలచి, వరుణుడ్ని కుండపోతగా వర్షాన్ని కురిపించమని అజ్ఞాపించేడు. అప్పుడు బృందావనమంతా నీటిలో మునిగిపోతున్నది. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని మనం గొడుగును ఎత్తినట్టు తన చిటికెన వేలుతోనెత్తి ప్రజలను రక్షించేడు.
అలాగే ఒకమారు బ్రహ్మ దేవుడు గోవులను, గోపాలులను ఒక గుహలో బంధించేడు. శ్రీకృష్ణుడు బహురూపుడై తలిదండ్రులను ఆనంద పరిచేడు. బ్రహ్మదేవుడు ఆ విషయం తెలిసికొని, సిగ్గుపడి, గుహలోని వారలిని విడిపించేడు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మాయా శక్తితో ప్రజలను మోహింప జేసేడు. శ్రీకృష్ణుడు తాను పాండవులలో అర్జునుడినని చెప్పెను. అర్జునునికి అది చాలా సంతోషం కలిగించి ఉండవచ్చు. అతను శ్రీకృష్ణుని సంపూర్ణముగా నమ్మి, వేరొకరి ధ్యాస లేక ఉన్నవాడు.
అటు పిమ్మట శ్రీకృష్ణుడు ఋషులలో తాను వ్యాసుడునని చెప్పెను. వ్యాసుడు గొప్ప ఋషియే కాక కవిత్వము కాచి వడబోసిన వాడు. ఆయనే మహాభారతాన్ని రచించేడు. చివరగా శ్రీకృష్ణుడు కవులకు కవి అయిన శుక్రాచార్యుడనని చెప్పెను. అంటే మనలోని లలిత కళా ప్రజ్ఞను -- కవిత్వము, చిత్రలేఖనము, నాట్యము, సంగీతము మొదలగునవి--దేవుని సేవకై ఉపయోగించిన మనము బాగా రాణించి జీవులతో ఐకమత్యము పొందుతాము. కాళిదాసు ఒకమారు ఇలా వ్రాసెను "నేను మరుగుజ్జువలె నుండి ఎత్తుగా నున్న పండ్లను కోసుకొనడానికై ప్రయత్నిస్తున్నాను. నాకు కవిత్వము రాదు. కవిత్వము వచ్చే ఉంటే నా రచనలను దేవునికి అ౦కితం చేసేవాడిని". ఆతని నిస్వార్థ ప్రేమను గని కాళీ మాత ప్రత్యక్షమై, నాలుకపై బీజాక్షరాలను వ్రాసినది. అప్పటినుంచి అతడు తన పేరును కాళిదాసుగా మార్చుకొని సంస్కృతంలో అనేక గ్రంధాలు వ్రాసి కవికోవిదుడైనాడు.