Bhagavat Gita
10.5
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం
{10.10}
దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తేః
సదా యోగయుక్తులై, నన్ను ప్రీతితో భజించువారికి నన్ను పొందగల బుద్ధి యోగమును అనుగ్రహించుచున్నాను
తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజ౦ తమః
{10.11}
నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వతా
నేను వారిని ఉద్ధరించుటకై వారి ఆత్మల యందు కొలువైయున్నాను. స్వప్రకాశమైన జ్ఞానదీపముతో వారి అజ్ఞాన చీకట్లను పోగొట్టుచున్నాను.
ధ్యానము మొదలుపెట్టిన చాలా కాలం మనం ఎత్తుపల్లాలు లేని రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది. దీనివలన అసహనం కలిగి, మనము ముందుకు పోలేకుండా ఉన్నామని తలుస్తాము. కానీ మనం నిస్పృహ చెందకుండా, చిత్త శుద్ధితో, ఏకాగ్రతతో ముందుకు సాగీతే సుదూర రోడ్డు ప్రయాణంలో నగరంలోని దుమ్మును, కాలుష్యమును వీడి చెట్లు, చేమలు గల ప్రదేశం చేరినట్లు, మన ధ్యానము పరిపక్వమవుతుంది. దానికి అనేక సంజ్ఞలు ఉన్నవి. ఆఫీసులో మనతో ఎప్పుడూ కలహం పెట్టుకొనే సహ ఉద్యోగికి, మనపై ప్రేమ కలగవచ్చు. ఒక పుస్తకాల కొట్టుకెళ్ళి అందరూ అడిగే సాంఘిక నవలులు కాక భగవద్గీత మీద క్రొత్త పుస్తకాలు వచ్చేయా అని అడుగుతాం. ఖరీదైన హోటల్ లలో చొప్పదంటు మాంసాహారం తినడంకన్నా, సామాన్యంగా ఉండే శాఖాహార హోటల్ లలో సారవంతమైన భోజనం తినడం మంచిదని గ్రహిస్తాం.
ధ్యానం మొదట్లో మన కుటుంబం చూసీచూడనట్లు ఉంటుంది. మన మిత్రులు మునుపటి లాగ లేమని గ్రహించి ఆట పట్టిస్తారు. మనకు కొంత నిర్లిప్తత లేకపోతే, ఇతరుల మనమీద చేసే విమర్శలు బాధను కలిగిస్తాయి. అలాటప్పుడు ధైర్యంతో ముందుకు సాగాలి.
ధ్యానం మొదటి మెట్టులో మనమే అన్ని నిర్ణయాలు తీసికోవాలి. పట్టుదలతో కోరికలను నియంత్రించుకోవాలి. రెండవ మెట్టులో, మన చేతన మనస్సు కాక, మనది కాని నిగూఢమైన శక్తి మన పురోభివృద్ధికి కారణమని తెలుసుకొంటాం. అది ఎలాగంటే ఒక పర్వతం ఎక్కి కొన్ని వేల అడుగులు ఎత్తులోంచి మనమెక్కిన దారిని చూసి, దేవుని దయలేకపోతే ఒక్క తప్పటడుగు వేసి అంత క్రిందకి పడుండవచ్చని తెలుసుకోవడం. మన౦ ఇంకా ఎక్కాల్సిన కొండ భయంకరంగా ఉన్నా, మన భక్తివలన దేవుడు ఇంత దూరం భద్రతతో తీసుకువచ్చేడు, కాబట్టి తక్కిన ప్రయాణాన్ని క్షేమంగా జరిగిస్తాడు అని భావిస్తాము.
చివరికి, సాధనలో ఆఖరి మెట్టు మనమెంత ప్రయత్నించినా ఎక్కలేము. ఎంత చిత్త శుద్ధితో సాధన చేసినా ఆ ఆఖరి మెట్టులో దేవునితో ఐక్యం చెందడానికి మనమెంత ప్రయత్నించినా సాధ్యం కాదని యోగులు చెప్తారు. మన సాధనికి సంతృప్తిపడి భగవంతుడే ముందుకు వచ్చి మనను తనలోకి తీసికోవాలి. జీసస్ చెప్పినట్లు భగవంతుడు రాత్రి పూట దొంగలాగ వస్తాడు. చివరికి, మనము ఊహించని రీతిలో, ఐక్యం అయ్యే సమయం వస్తుంది. యోగులు అది ఎలాగ ఉంటుందంటే ఒక గుడిలో సంవత్సరాల తరబడి దీపారాధన లేక, ఒక రోజు దీపం వెలిగిస్తే అలాగ అని చెప్తారు.