Bhagavat Gita
10.9
శ్రీ భగవానువాచ:
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః
{10.19}
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే
కురుశ్రేష్ఠా! దివ్యములగు నా విభూతులను ప్రాధాన్యత ననుసరించి నీకు చెప్పెదను. నా విభూతులకు అంతము లేదు
అహమాత్మా గూడాకేశ సర్వభూతాశయస్థితః
{10.20}
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ
గూడాకేశా! సర్వభూతముల హృదయముల యందున్న ఆత్మను నేనే. సర్వభూతముల యొక్క ఉత్పత్తి స్థితి లయాదులకు కారకుడను నేనే ఀ
మనం గతంలో ఎన్ని తప్పులు చేసినా, మన ఆత్మ శుద్ధమై, ప్రేమపూరితమై, జ్ఞానవంతమై యుండును. యోగులు ఆత్మని సూర్యునితో పోల్చెదరు. ఎన్ని మబ్బులు కమ్మినా, మనం కళ్ళు మూసుకొన్నా సూర్యుని ప్రకాశమునకు అంతరాయము ఉండదు. అలాగే మనమెన్ని తప్పులు చేసినా అంతర్యామిలో ఆత్మ సూర్యునివలె వెలుగుచుండును. మనము క్రోధము, అసహనం, విరోధం లేకుండా చేసుకొంటే మనలోని ఆత్మ నిరాటంకంగా ప్రకాశిస్తుంది.
ఒక బాలుడుగా ఉన్న రాజకుమారుని కొందరు దొంగలు ఎత్తుకుపోయి వానిని తమలాగా మార్చుకొ౦టారు. ఆ రాజకుమారుడు తాను ఎవరో గుర్తులేక మిగతావారిలాగ ఒక దొంగగా మారి దొంగతనాలు చేస్తాడు. కాలక్రమేణా అతను పెద్దవాడై ఆ దొంగల ముఠాకి నాయకుడవుతాడు. ఒక వృద్ధుడు ఆ దారిన పోతూ దొంగగా మారిన రాజకుమారుడిని పోల్చుకొని అతను ఆ దేశపు రాజకుమారుడని చెప్తాడు. కాని అతను నమ్మడు. ఆ వృద్ధుడు రాజ వంశీయులకు దగ్గర వాడు. అతను ఆ దొంగగా మారిన రాజకుమారునికి చిన్నప్పటి విషయాలు జ్ఞప్తికి తెస్తాడు. చివరికి తాను స్వతహాగా దొంగను కానని, నిజంగా రాజకుమారుడనని తెలిసికొంటాడు. ఆ వృద్ధుని సహాయంతో అతను ఆ దేశపు రాజైన తన తండ్రిని చేరుకుంటాడు.