Bhagavat Gita
11.12
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా స్సర్వే సహైవావనిపాలసంఘైః
{11.26}
భీష్మో ద్రోణ స్సూతపుత్రస్తథా అసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని
కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్య౦తే చూర్ణిత్తైరుత్తమాంగైః
{11.27}
ఈ ధృతరాష్ట్ర సుతులందరును, రాజుల సమూహమును, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడును, మన పక్షాన యున్న యుద్ధ ప్రముఖులును కోఱలతో వికారముగా, భయంకరముగా గోచరించు నీ నోళ్ళయందు త్వరితముగ ప్రవేశించుచున్నారు. కొందరి తలలు ముక్కలై, చూర్ణితమై నీ దంతముల మధ్య చిక్కుకొని కనిపించుచున్నారు.
యథా నదీనాం బహవో అంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి
తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి
{11.28}
నదీ ప్రవాహములు సముద్రమున కభిముఖముగ ప్రవహించెడి రీతిన ఈ రాజ శ్రేష్ఠులందరు ప్రజ్వలించుచున్న నీ ముఖమున కభిముఖులై ప్రవేశించుచున్నారు
యథా ప్రదీప్తం జ్వాలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః
తథైవ నాశాయ విశంతి లోకా స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః
{11.29}
మిడుతలు ఏ విధముగ అతిరయమున మండుచున్న అగ్ని యందు ప్రవేశించి నశించుచున్నవో అలాగుననే జనులును అతిరయమున నీ నోళ్ళయందు నాశమును గోరి ప్రవేశించుచున్నారు.
లేలిహ్యసే గ్రసమాన సమంతా ల్లోకాన్ సమగ్రాన్ వ దనైర్జ్వలద్భిః
తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో
{11.30}
ఓ విష్ణుమూర్తీ! మండుచున్న నోళ్ళతో అన్నివైపులను సమస్తమైన లోకములను మ్రి౦గుచు ఆస్వాదించుచున్నావు. నీ యొక్క ప్రచండమైన కాంతులు సమస్తమైన జగత్తును కాంతులచే నింపి తపింపజేయుచున్నవి ఀ
ఎవరైతే తమ బంధు మిత్రులను, సమాజాన్ని, చివరకు ప్రపంచాన్ని విస్మరించి స్వార్థ పూరిత జీవితం గడుపుతారో వారికి మరణం సజావుగా ఉండదు.
ఈనాడు హింసాకాండకు ముఖ్య కారణాలు మనుష్యులు వాడే తుపాకులు, యుద్ధాలకు ఉపయోగించే అస్త్రాలు మొదలగునవి. మానవులలో ఐకమత్యము లేకుండుట హింసకు దారితీస్తుంది. ప్రపంచ దేశాలు యుద్ధానికై సామగ్రిని అమ్ముతాయి మరియు కొంటాయి. వాటికై ప్రతి నిమిషం కొన్ని వందల కోట్లు వెచ్చిస్తాయి. అందువలన ప్రజలకు ఆహారము, వైద్యము సమయానికి అందవు.
ఎప్పుడైతే మనము ఆయుధాలను లాభానికై తయారుచేస్తామో గీత మనం మృత్యు దేవతతో ఆటలాడుతున్నాము అంటుంది. అది ఒక అమ్మేవాడు, కొనేవాడికే పరిమితం కాదు. వాటిని తయారుచేసేవారు, మధ్యవర్తులు, చివరకు వాటిని ఖండించని వారలకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడు.
ఈ విధంగా జరుగుతున్న హింసాకాండను పట్టించుకోకుండా ఉంటే వచ్చే తరాలు దుఃఖాన్ని అనుభవిస్తాయి. గీత దీన్నే చిమటలతో పోలుస్తుంది. చిమటలు కొన్ని గంటల పాటే బ్రతుకుతాయి. అవి మంట ఎక్కడ కనబడితే దాని వైపు వెళతాయి. అర్జునుడు పాండవ, కౌరవ సేనలు, మామలు, తాతలు, గురువులు, అసువులు బాసుటకై చిమటలవలె తీరి ఉన్నారని తలచేడు.
మన నాగరికత స్వార్థం, వేర్పాటులతో నిండి ఉంటే, మనము చిమటల లాగే అంతరిస్తాము. మనం ఆనందం, పేరు ప్రతిష్ఠలకై ప్రాకులాడితే మనకి సామాన్య మానవుల ఆర్తనాదాలు వినబడవు, వారి దుస్థితి కనబడదు. అటు పిమ్మట మన జీవితం ఒక కొండ వాగు లాగ నదిలోనో, సముద్రంలోనో అంతమవుతుందని తెలిసికోలేము. అందుకే గొప్ప గురువులు ఆధ్యాత్మిక జీవితం అవలంబించడానికి ఒక్క రోజు కూడా ఉపేక్షించవద్దని చెపుతారు. ప్రతి ఘడియ మనము మృత్యువుకు దగ్గర అవుతున్నాము అని జ్ఞప్తికి పెట్టుకుంటే, మనము మరణాన్ని దాటే ప్రణాళికను ఇప్పుడే, ఇక్కడే చేస్తాము