Bhagavat Gita
11.14
శ్రీ భగవానువాచ
{11.32}
కాలో అస్మి లోకక్షయకృత్ ప్రవృద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే యే అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః
నేను లోక సంహారమునకై విజృంభించిన కాలుడను. ప్రాణులను సంహరించుటకు ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. నీవు యుద్ధమును మానినను శత్రుసైన్యము నందలి వీరులు జీవించి యుండరు. ఀ
ఈ శ్లోకామే రాబర్ట్ అప్పెన్హైమెర్ కు అణ్వాయుధ పరీక్ష చూస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక్కడ కాల పదానికి కాలము, మరణము అను రెండర్థాలు ఉన్నాయి. కాలము అంటే మరణము; వేర్పాటు. అది మన నీడ కన్నా దగ్గరగా ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతుంది. ఏళ్లు గడుస్తున్నప్పుడు మన బంధుమిత్రులు మరణాల్ని చూసి, మన మరణం కూడా ఒకనాడు ఆసన్నమవుతుందని తెలుస్తుంది. మన సంతోషపు ఘడియలు పంచుకున్నవారలు ఇక లేకపోవచ్చు. గొప్ప గొప్ప వారు ఈ భూమి మీద నడిచి అసువులు బాసేరు. రాజ వంశాలకు, చక్రవర్తులకు నూకలు చెల్లి చరిత్ర పుటల్లో మిగిలిపోయేరు. దేవుని దయవలననే మనమి౦కా బ్రతికి ఉన్నాము. ఎవరికైతే ఈ ఎరుక ఉంటుందో వారు ఆధ్యాత్మిక సాధనకై ఉత్సాహము కలవారై, కాలమరణాలనే రక్కసిని అధిగమించాలనే కోరిక గలవారై ఉంటారు.
నేను ఈ శ్లోకాన్ని నిత్యం తలుచకుంటూ ఉంటాను. దానివలన నా లక్ష్యం స్పష్టంగా కనబడి, పూర్తి ఏకాగ్రత కలిగి, కోరికలను జయించే సామర్థ్యం వస్తుంది. నా సాధనలో నాకు అతి పెద్ద కోరిక కలిగినప్పుడు నా అమ్మమ్మ ఇచ్చిన బోధ గుర్తుకు వస్తుంది. నేను మృత్యు దేవత ప్రక్కనే ఉందని తలచి, నా కోరికను నిరోధిస్తాను. అలాగే క్రోధం, మత్సరం, మదం, నిరాశ కలిగినప్పుడు కూడా మరణాన్ని తలుచుకోవాలి. మనకి కలహించుకోడానికి, కోప్పడడానికి, విడిపోవడానికి సమయంలేదు. మొదలెట్టగానే అంతమొందే స్వార్థ పూరిత క్రియలు చేయడానికి సమయం లేదు. మనం యువకులుగా ఉన్నప్పుడు జీవితం ఇచ్చే వస్తువులను అనుభవించడానికి సమయం ఉంటుంది. కాని అవి క్షణికమైనవి. నీటి మీద వ్రాతల లాగా ఉండేవి.
ఒక భౌద్ధ గురువు "రేపటికి ఏ పనిని వాయిదా వెయ్యకు. నీవు రేపు బ్రతికి ఉంటావని నీకెలా తెలుసు?" అని అన్నాడు. బుద్ధుడు "జీవితము ఒక కల, మాయ, బుడగ, నీడ, వర్షపు చినుకు, లేదా మెరుపు వంటిది" అని చెప్పెను. మన౦ గుర్తు౦చుకోవలసినది జీవితం క్షణికము. కాబట్టి మనం సంసారమనే సముద్రాన్ని దాటడానికి ఉపేక్ష చెయ్యకూడదు.