Bhagavat Gita
11.18
నమః పురస్తాదథ పృష్ఠత స్తే నమో అస్తుతే సర్వత ఏవ సర్వ
{11.40}
అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో అసి సర్వః
ఓ సర్వవ్యాపీ ! నీకు ముందు నమస్కరించుచున్నాను. వెనుక వందన మాచరించుచున్నాను. అన్ని వైపుల ప్రణమిల్లు చున్నాను. శక్తి పరాక్రమములు గల నీవు సమస్తమును వ్యాపించి యున్నావు. అందుచేతనే సర్వుడనబడుచున్నావు.
మనం తల ఏ దిక్కులో పెట్టి పడుకోవాలి అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దక్షిణా మూర్తిని, అనగా దక్షిణ దిక్కుగా చూస్తున్న దేవుని, నమ్మేవారు ఉత్తర దిక్కులో కాళ్ళు పెట్టరు.
తమిళనాడులో ఆండాళ్ళు అనే యోగిని ఒకరి ఇంటిలో రాత్రి బస చేసేరు. ఆ ఇంటి యజమాని ఉదయాన్నే లేపి ఆండాళ్ళు తన తలని తప్పు దిశలో పెట్టుకుందని చెప్పింది. ఆండాళ్ళు దేవుడు అన్ని దిక్కులా ఉన్నాడని చెప్పి, చివరకు శీర్షాసనమేసి పడుకుందామంటే దేవుడు క్రిందా, మీదా కూడా ఉన్నాడు అని చెప్పేరు.
సమాధిలో, మనస్సు నిశ్చలమై, అహంకారం అణిగి ఉంటాము. అప్పుడు దేవుని అంతటా చూస్తాము. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడని తలుస్తాము. రామాయణంలో హనుమంతుడు సాటిలేని రామ భక్తుడు. లంకా నగరాన్ని దహించినందుకుగాను, ఆయన రావణుని సేనచే బంధింపబడి, రావణుని ముందు నేలపై కూర్చోపెట్టబడ్డాడు. అప్పుడు హనుమంతుడు తన వాలాన్ని పెంచి దాన్ని ఆశనంగా చేసికొని రావణుని కన్నా ఎత్తులో కూర్చున్నాడు. రావణుడు ఆయనను పరీక్షింప దలచి, ఒక రత్నాల హారాన్ని హనునమంతునికి ఇచ్చేడు. హనుమంతుడు దాన్ని కొరికి అవతలకు విసిరివేసేడు. రావణుడు అది ఎంతో విలువైనదని తెలుసా అని అడిగితే అందులో నా దేవుడు లేడని బదులు ఇచ్చేడు. రావణుడు ఎవరు నీ దేవుడు అని ప్రశ్నించగా హనుమంతుడు తన వక్షాన్ని చీల్చి రాముని చూపేడు.
ఇది ఒక కథ. కాని దాని వలన తెలిసేదేమిటంటే మన చేతన మనస్సు లోపలకి వెళితే దేవుడే మనకు శాశ్వత ఆనందాన్ని, భద్రతను ఇవ్వగలడు.