Bhagavat Gita
11.20
పితా అసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్
{11.43}
న త్వత్సమో అస్త్యభ్యధికః కుతో అన్యో లోకత్రయే అప్య ప్రతిమప్రభావ
అసదృశ ప్రభావా! నీవు చరాచర ప్రపంచమునకు తండ్రివి. గురువువు. పూజ్యుడవు. ముల్లోకముల యందు అసమానుడవు. నిన్ను మించిన వాడెక్కడుండును?
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహ మీశ మీడ్యం
{11.44}
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసిదేవ సోఢుమ్
అందుచేత ఈశ్వరుడవు, స్తుతింప దగినవాడవు నగు నీకు సాష్టాంగ ప్రణామము చేయుచు నన్ను కరుణింప వేడుకొను చున్నాను. తండ్రి కుమారుని తప్పును, స్నేహితుడు స్నేహితుని అపరాధమును, ప్రియుడు ప్రియురాలియొక్క లోపమను సహించునట్లు నీవు నా అపరాధములను క్షమింపుము ఀ
అర్జునడు శ్రీకృష్ణుని క్షమాభిక్షకై పరి పరి విధములుగ అడుగుచున్నాడు.
మన పిల్లలు తప్పు చేసినప్పుడు వారితో ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. వాళ్ళు క్షమాభిక్ష తలిదండ్రులు ఇస్తారనే నమ్మకం కలిగి ఉండి, ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండాలనే నిశ్చయం చేసికోవాలి.
నా చిన్నప్పుడు మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళే వాడిని. రోజూ సాయంత్రం చీకటి పడిన తరువాత ఇంటికి వచ్చే వాళ్ళం. దారిలో పొలాలు ఉండి, అనేక రకాలైన పాములు తిరుగుతూ ఉంటాయని అందరూ అనుకునేవారు. నా అమ్మమ్మకి అలాంటి సాహసమైన పనులు చేయడం ఇష్టంలేదు. కానీ ఆమె ఒక్కమారు కూడా తన మనోభావం నాతో చెప్పలేదు.
ఒకరోజు చాలా ఆలస్యంగా ఇంటిదారి పట్టేను. నా అమ్మమ్మ చెప్పులు లేకుండా బయట నుంచుని నాకోసం ఎదురు చూస్తోంది. ఆమె ఎంతసేపు అక్కడ నుంచుందో తెలియదు. కానీ నేను అర్థం చేసికొన్నదేమిటంటే, ఆమె ప్రతిరోజూ అలాగే ఎదురు చూస్తూ ఉంటుందని. నా అమ్మమ్మను కష్టపెట్టడం ఇష్టం లేక నేను మరెప్పుడూ ఆలస్యంగా ఇంటికి రాలేదు.