Bhagavat Gita
12.14
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి
{12.17}
శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య స్స మే ప్రియః
ఎవడు సంతసించడో, ద్వేషింపడో, దుఃఖి౦పడో, అభిలషి౦చడో, శుభాశుభకర్మములను విడిచినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు
మనం జీవితంలో నచ్చినదాని వెనుక పరిగెత్తి, నచ్చనిదానివైపు చూడకుండా ఉంటే మనము సంకెళ్ళు వేసుకొని ఇతరులతో స్వేచ్ఛగా ఉండనట్లే. "నాకు ధృడమైన అభిప్రాయాలు ఉన్నాయి", లేదా "నాకు ఏది కావాలో తెలుసు. నేను స్వేచ్ఛగా ఉన్నాను" అనుకునేవారు నిజంగా సంకెళ్ళు వేసికొన్నవారు.
మామూలుగా అడ్డదిడ్డంగా వెళ్ళే కొన్ని సూక్ష్మక్రిములు ఉద్దేశపూరకంగా కొన్ని పదార్థాలవైపు వెళతాయి. అది వాటికి నచ్చితే ఉంటాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. అలాగే మనలో చాలా మంది ఉంటారు. కాని మనకు ఆలోచనా శక్తి ఉండి, బుద్ధిపూర్వకంగా మన నడవడికను మార్చుకోవచ్చు.
ఇక్కడ అహంకారం యొక్క పాత్ర ప్రధానమైనది. అది "నాకిది ఇష్టం", "నాకిది అయిష్టం" అని నిర్ధారణ చేస్తుంది. అందుకే బుద్ధిని ఉపయోగించి ఏది శ్రేష్ఠమో నిర్ణయించాలి. మనం ఒక క్రొత్త వ్యక్తిని కలిసినపుడు వారి ముక్కు, మాట, నవ్వు, పళ్ళు అన్నిటి వలన ప్రభావితమై వారిని ఇష్టపడడమో లేదో నిర్ణయిస్తాం.
మన ఇష్టాయిష్టాలకు కారణం మన సంస్కారాలు. అంటే మన మనస్సులో నాటుకుపోయిన గత జన్మల వాసనలు. ఉదాహరణకు ఒకడు ఒక పని చేయడం జాప్యం చేస్తాడనుకొందాం. వాని కారణాలు: నాకు వెంటనే పూర్తి చేయవలసిన వేరొక పని ఉంది; నా ఇతర బాధ్యతలు నన్ను ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాయి. నిజానికి వానికి ఆ పని చేయడం ఇష్టం లేదు. అది వాని నైజం. కాబట్టి ఒక పని చెయ్య వలసి ఉంటే, ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి వెంటనే చెయ్యాలి. అలా చేస్తే మన సంస్కారాన్ని ఎదిరించి సంకెళ్ల నుండి విడిపడతాం.
కొందరు ఎప్పుడూ చంచల మనస్కులై ఉంటారు. ఉదాహరణకి వారు ఒక కొట్టుకెళితే ఏది కొనాలో త్వరగా నిర్ణయించుకోలేరు. బియ్యం కొనాలంటే అది బాస్మతా లేదా మొలగొలకులా అని సతమతమవుతారు. ఒక వస్తువుని ఇష్టపడి దాని మీద స్థిరంగా ఉండలేరు. దాని వలన వారు దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేరు.
కొందరికి అది మనస్సు యొక్క నైజం. ఎవరైతే ఒక చిన్న విషయం మీద చంచలంగా ఉంటారో, వారు అన్ని విషయాలలోనూ అలాగే ఉంటారు. చివరకు వారు అనుబంధాలలోనూ చంచలంగా ఉంటారు. వారు ఎప్పటిలాగే "నాకిది ఇష్టమా?", "నేను అతనిని ఇష్ట పడుతున్నానా లేదా? అతని ముక్కు బాగుంటుంది. నన్ను కూడా ఇష్టపడతాడు. నడక కొంచెం తేడాగా ఉంటుంది" అని తర్జనబర్జన పడుతూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే, మనం ప్రేమించిన వ్యక్తి ఒక ఇష్టం లేని పని చేస్తే మన ప్రేమ తగ్గుతుంది. అలాగే ఆ వ్యక్తికి కూడా. అందువలన వారి మధ్యనున్న బంధం క్షీణిస్తుంది.
ఈ విధంగా సంస్కారాల ప్రభావంతో ఇష్టాయిష్టాలను ప్రేమతో ముడిపెడతాము. అందుకే నేను చిన్న చిన్న విషయాలలో ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా వెళ్ళడం ఉత్తమమని చెప్తాను. అలా చేస్తే మనం సంస్కారాన్ని ఎదిరిస్తున్నాము. మనకిష్టం లేని పదార్థాన్ని తినడం అటువంటిది.
మన అనుబంధాలు భౌతికంగా లేదా మానసికంగా మనను ఆకర్షించేవిగా ఉండడం సహజం. కాని భౌతిక ఆకర్షణ కొన్నాళ్ళకు తగ్గుతుంది. మనము దానిని పెంపొందించుకోలేము. ఒకరితో అనుబంధం గట్టి పడాలంటే "నాకు ఏది ఇష్టం?" అని అడగకుండా "నేను ఏమి ఇవ్వగలను?" అని ప్రశ్నించుకోవాలి.
భౌతికమైన ఆకర్షణ ఒక రోజు ఉంటుంది మరొక రోజు పోతుంది. కానీ ప్రేమ ఒక బంధం. అందంగా ఉన్నవారితో జీవితం గడపడం మొదట్లో సంతోషంగానే ఉంటుంది. కాలక్రమేణా వారి కోల మొహం రోతగా ఉంటుంది. అలాగే చేపల లాంటి కళ్ళు విసుగు కలిగిస్తాయి. ఇది తినడం లాంటిదే. ఒకనికి చాక్లెట్ అంటే ఇష్టం. కానీ ఒకేమారు వికారం చెందకుండా ఎన్ని తినగలడు ?
మన ఇంద్రియాలు అందించే సుఖం చిరకాలం ఉండదు. మొదట్లో కలిగిన ఆకర్షణ తగ్గిపోతే, విసుగు కలుగుతుంది. ఒకరిని మొదట్లో కలిసినప్పుడు మందహాసం మధురంగా అనిపించింది; ఇప్పుడు ఆమె చేసేది పళ్ళు ఇకిలించడం లాగా కనిపిస్తుంది. ఒక కెరటం లాగ మనోభావము ఒకప్పుడు ఉత్తేజంగా ఉండేది. ఇప్పుడు అది క్రిందకు పడింది. గట్టి అనుబంధం కలగాలంటే ఏది మార్పు చెందుతుందో దాని మీద ఆధారపడకూడదు. అప్పుడు "నాకిది ఇష్టమా?" అన్న ప్రశ్న ఉదయించదు.
కొందరు కామ౦తో అనేక వ్యక్తులతో బంధాలు పెట్టుకొంటారు. వారికి తెలియకుండానే ఒక్కొక్కప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కామాన్ని మార్చుకోవచ్చు. అంటే నిరోధించకుండా, స్వేచ్చతో కూడిన ఎన్నిక చేసికోవడం. కామం ప్రేమగా మారాలంటే నేను, నాది అనే బదులు నీవు, నీది అనడం మొదలుపెట్టాలి. క్రమంగా కామం ప్రేమగా మారి, దృష్టి మన సుఖాలపైనే కాక, ఇతరుల సంతోష౦పై ఉంటుంది.
మన భాషలో ప్రేమ ఆడా మగా మధ్యనేకాక, తల్లి బిడ్డ, అన్న చెల్లెలు మధ్యకూడా ఉండవచ్చు. అలాగే మనకు ఒక కుక్కమీద ప్రేమ ఉండవచ్చు. సినిమా పాటలు, పత్రికలు చూస్తే వారు చెప్పే "నీను నిన్ను ప్రేమిస్తున్నాను" అనేది "నన్ను నేను ప్రేమిస్తున్నాను" గా నాకు వినిపిస్తుంది.
ప్రతిరోజూ మన౦ మునుపటికన్నా ఎక్కువగా ప్రేమించ గలగాలి. లేకపోతే ప్రేమలో వృద్ధి లేక పరిస్థితి విచారకరంగా ఉంటుంది. ప్రతి రోజూ "నేను హృదయ పూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే సరిపోతుందా? ఒక యోగికి అది నచ్చదు.
అలాగే ప్రేమ యాత్రలకై మనమనేక ప్రకటనలు చూస్తాము. ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశాలకు పడవలలో తీసికువెళ్తామని ప్రకటిస్తూ ఉంటారు. యాత్రలకు, ప్రేమకు సంబంధం లేదు. ప్రేమకు భూలోక స్వర్గం అక్కరలేదు. అది వంటగది లోనో, తోట లోనో, ఎక్కడైతే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసికొని ఎదుటివారి క్షేమం కోరుతారో అక్కడ ఉంటుంది.
నిజానికి కొన్ని విషయాలలో మనం మనల్ని ఇతరులకన్నా ఎక్కువగా ప్రేమి౦చుకొంటాం. దీనిలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. కానీ దానిని మార్చుకోవచ్చు. ప్రతి అనుబంధము "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" తో మొదలవుతుంది. అక్కడక్కడ, అప్పుడప్పుడు "నేను నన్ను ప్రేమిస్తున్నాను" అనే అపశృతి ఉంటుంది. ఒక బంధం గట్టి పడాలంటే పరస్పర బలహీనతలవలన కాక వాటిని అధిగమించేలా ఉండాలి.
ఒక భార్య తన భర్త విసుగు చెందితే అతని మనస్సు కుదుటపడే వరకూ ఓపికతో ఉంటుంది. అదే ప్రేమ అంటే. ఒక తండ్రి ఆఫీసు నుండి ఎక్కడకీ వెళ్ళకుండా ఇంటికి వచ్చి, పిల్లలతో ఆడుకొని, భార్యకు వంటగదిలో చేయూత నిచ్చి, సకుటుంబంగా టివి చూస్తే అతనే గొప్ప ప్రేమికుడు.
ఇలా కొంతకాలం కలసి సంసారం సాగిస్తే ఒకరికి మరొకరు మీద ద్వేషంతో కూడిన ఆలోచన రమ్మన్నా రాదు. ఒకర్నొకరు విమర్శించుకోవచ్చు, చూపులు కలుపక పోవచ్చు, కానీ వారి విశ్వాసం ఎన్నటికీ తరగదు.
ఈవిధంగా ఉండే జంట ఇద్దరు వ్యక్తులుగా కాక ఒకే వ్యక్తిగా ఉంటుంది. పరిస్థితులు విషమించినా వారి మధ్యనున్న బంధం చెక్కు చెదరదు. "ఏదైతే మార్పు చెందదో అదే ప్రేమ" అని ఎవరో అన్నారు. ఇదే ప్రేమకు పరాకాష్ట. అదే మనల్ని సంతృప్తి పరిచేది. 404
No comments:
Post a Comment