Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 15

Bhagavat Gita

12.15

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో {12.18}

శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్స౦గ వివర్జితః

తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ {12.19}

అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః

శత్రుమిత్రుల యందును, మానావ మానముల యందును, శీతోష్ణ సుఖ దుఃఖముల యందును, నిందాస్తుతుల యందును సమబుద్ధి గలవాడై, సంగరహితుడై, మనన శీలుడై, లభించిన దానితో తృప్తి చెందువాడై, ఇల్లు లేనివాడై స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవడో వాడు నాకు ఇష్టుడు

గాంధీ మహాత్ముడు "నేను ఇంట్లో మిత్రులొక్కరితోనే కాదు, శత్రువులతోనూ కలసి ఉంటాను" అని చెప్పేరు. మనకు ఒకరితో స్పర్థ కలిగినప్పుడు, వానిని శత్రువుగా చూడక, సమస్యను పరిష్కరి౦చే మార్గాన్ని కలిసి వెదకాలి . గాంధీ పరిష్కరించలేని సమస్య ఏదీ లేదని అనేవారు. ఎందుకంటే ఆయన నిరాడంబరముగా నుండి తన ప్రత్యర్థి గౌరవాన్ని చూరుగొంటారు. బేదాభిప్రాయాలు కలిగినప్పుడు, ఉన్న సమస్య మన ప్రత్యర్థి.

ఒక సమస్య కలిగినప్పుడు ఎవరిని నిందించాలి అని చూడకోడదు. "వివాదంలో పెళ్ళిలాగే ఇద్దరు౦టారు" అనే నానుడి ఉంది. ఎటువంటి పరిస్థితులోనైనా ఒక్కరే తగవుకు పూర్తి కారణం కాదు. ఇద్దరూ కారణం కాబట్టి ఇద్దరూ సమస్యకు పరిష్కారాన్ని వెదకాలి. అలాగని రాజీ పడనక్కరలేదు. శాంతియుతంగా తగవు లేకుండా చూసుకోవాలి.

దానికై మన ప్రత్యర్థులు యందు గౌరవంతో ఉండాలి. వారు చెప్పేది గౌరవంతో వినాలి. క్రోధంతో ఉన్న వ్యక్తి తన చుట్టూ ఏమవుతున్నాదో గ్రహించలేడు. ఉన్మాదంతో కూడుకున్న వ్యక్తి తనకేమవుతున్నాదో కూడా తెలిసికోలేడు. అతడు ఒక అంధుడిలా ప్రవర్తిస్తాడు. మనము అంధులను గౌరవంతో చూసి, వారికి సహాయం చేస్తాము. అలాగే ఒక ఉన్మాదిని కూడా గౌరవించి వానికి, మనకి మధ్యనున్న పొత్తును పెంపొందించుకోవాలి.

యోగులు ఇలా ప్రశ్నిస్తారు: ఒక తగవు దేని గురించో తెలియకపోతే, దాన్ని పరిష్కరించే మార్గాన్ని ఎలా వెతకగలం? మనం ప్రత్యర్థులు చెప్పే విషయాన్ని పూర్తిగా వినక పోతే సమస్యను ఎలా పరిష్కరించగలం? మనము ప్రత్యర్థులతో నిర్లిప్తంగా ఉండాలి. లేకపోతే మనము మన పక్షాన ఉన్న సమస్యనుకూడా పూర్తిగా అర్థం చేసికోలేము. అందుకే ప్రత్యర్థులు చెప్పేది, ఎంత విసుగు కలిగించినా, గౌరవంగా వినాలి.

క్రమంగా "నా దృక్పథం" లేదా "నీ దృక్పథం" అన్న తేడా ఉండదు. మన ఇద్దరం ఒప్పుకునే విషయాలను గుర్తిస్తాం. అలా చేస్తే తగవు ఇకలేదు. మనము సమస్యను పరిష్కరించాలంటే కలసి పని చేయాలి. అప్పుడు తగవు లేకుండా చేస్తాము. అవసరమైతే మనం ప్రత్యర్థుల పక్షంలో చేరి మన ఇరువర్గాలకు అనుగుణమైన పరిష్కారాన్ని వెదకాలి.

జాతులు, దేశాలు మధ్య సంఘీభావం లేకపోతే మిగిలేది ఓడిపోయినవారే. మనము పూనుకొని కలసి పని చేస్తే పరిష్కరించలేని సమస్య ఏమీ లేదు. అది అంత సులువుగా ఉండకపోవచ్చు. అలాగే అది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ ఎక్కడైతే పూర్తి వైరం ఉందో, అక్కడ ప్రేమను కలిగించవచ్చు. ఎక్కడైతే స్పర్థ ఉందో అక్కడ ఐకమత్య౦ చిగురించవచ్చు.

సెయింట్ తెరెసా ఆఫ్ లిసియూ ఇలా వ్రాసేరు:

నా పరిధిలో ఒక వ్యక్తి ఉండేది. ఆమె ఇతరులతో దురుసుగా ఉండేది. నాకూ మొదట్లో ఆమె నచ్చలేదు. కానీ దానిని పైకి ప్రదర్శించకుండా ఆమెను కలిసినప్పుడల్లా చిరు నవ్వు చూపేదాన్ని. ఆమెకి నా నిజభావన తెలియక నన్ను "మీరు నాయందు ఎప్పుడూ ప్రేమ చూపిస్తారు. మీరు నాలో ఏ లక్షణం చూసి అలా చేస్తారు?" అని అడిగింది. "నీలో ఉాన్న జీసస్ ని చూసి"అని సమాధానమిచ్చేను.

నేను ఒకరికి దూరంగా ఉండాలనుకుంటే, అతనూ నాతో ఎడంగా ఉంటే, నా పళ్ళు బిగించుకొని అతన్ని నా వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించేవాడిని. మొదట్లో అది చాలా ఇబ్బంది కలిగించేది. కానీ నేను నిరాశ పడక ప్రయత్నించేవాడిని. అలా అనేక ప్రయత్నాలు చేసి కొంతమందిని నా స్నేహితులుగా మార్చేను. కానీ కొన్ని సార్లు మైత్రి సాధించలేకపోయేను. అప్పుడు "నేను కష్టంతో చేసిన ప్రయత్నం వృధా ఎందుకు అయింది?" అని అడగలేదు. వానితో మాట్లాడడానికి, కలిసి నడవడానికి వెచ్చించిన సమయం వృధా కదా అని అనిపించేది. కానీ నేను నిజంగా దేన్నీ పోగొట్టుకోలేదు. అటుతరువాత నేను ఎటువంటి బంధంలోనైనా నెగ్గగలననే ధైర్యం వచ్చేది.

మనం రోజూ మనల్ని ఎలా మంచివానిగా తీర్చిదిద్దుకోవాలని కొన్ని నిమిషాలు ఆలోచించాలి. ఉదాహరణకి మనం ఆఫీసులో ఒకరిని ఒకరోజు ఎడంగా పెట్టి ఉండవచ్చు. మరుసటి రోజు వానిని మందహాసంతో పలకరించండి. ఇది చాలా చిన్న విషయం. ఇలా ప్రతిరోజూ ఇతరుల కొరకై ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకు మనము ఇతరులపై ప్రేమ సంపూర్ణంగా చూపగలము.

కొందరు అద్దంలో తమ ముఖంలోని ముడతలు చూసుకుంటూ ఉంటారు. నేను ఆ అద్దాన్ని అంతర్గతంగా చూసుకోమంటాను. అలా చూసుకొని "నేను ఈ రోజు మంచిగా గడిపేను--రేపు ఇంకా ఓర్పుతో ఉండి, ఇంకా ఎక్కువగా ప్రేమి౦ఛాలి" అని అనుకోవాలి. మనం హృదయపూర్వకంగా ప్రేమించాలంటే ఇదే చిట్కా. ఎప్పుడూ "నాకు ప్రేమిస్తే ఏమి వస్తుంది?" అని అడగకండి. "నేను ఇతరులకు ఏమి ఇవ్వగలను?" అని అడగండి.

యోగులు చెప్పేది ఒక వ్యక్తి ఎంత మంచివాడనేది నిర్ణయించాలంటే అతను ఎంత ప్రేమిస్తున్నాడో అనే దాని బట్టి. మనము ఒకరు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలిసికోవడానికి వాని దయా గుణము, ఓర్పు రోజులు కలిసొచ్చినపుడే కాదు, కష్టాలలో ఎలా ఉంటాయి అని అడగాలి. ఒక పడవ ఒడ్డున సరిగానే ఉండవచ్చు. కానీ సముద్రంలో మునిగిపోవచ్చు. అనేక శాస్త్రజ్ఞులు, కళా కారులు, తత్త్వవేత్తలు, సైనికులు జీవితం సక్రమంగా ఉంటే బాగానే ఉంటారు. కానీ జీవితం ఎదురు తిరుగుతే ఢీలా పడిపోతారు. గాంధీ, సెయింట్ తెరెసా మొదలగువారు ఒకరు తమను వ్యతిరేకిస్తే వారి నుంచి ఎడంగా ఉండరు; దగ్గిరవ్వడానికి ప్రయత్నిస్తారు. ఒకరు వారియందు క్రోధం ప్రదర్శిస్తే వారిపై దయతో ఉంటారు.

మనకు అనుబంధాలలో సమస్యలు ఎదురవుతే అది ప్రేమ విఫలం అవ్వడం వలన కాదు; దానికి కారణం మన ప్రేమలో ఉన్న లోపాలు. ఈ రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసికోవడం ఎక్కువగా జరుగుతున్నాది. మనము చేతులెత్తేసి ప్రేమ విఫలం అవుతున్నాది, శాశ్వతమైన అనుబంధాలు ఉండవు అంటే సరికాదు.

షేక్స్ పియర్ వ్రాసిన వన్నీ చదవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అలాంటిది మనకు ప్రేమంటే అవగాహన లేక ఒక రోజులో, లేదా సంవత్సరంలో ప్రేమ పరిపక్వమవ్వాలంటే ఎలా వీలవుతుంది? ఒక జంట ఐకమత్యంతో ఉంటేనే వారి మధ్య ప్రేమ సాధ్యం. "మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి ఇతరులతో ఎడంగా ఉండండి" అనేది దానికి పూర్తి వ్యతిరేకం. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకొని "నా పరిధిలో నేను ఉంటాను" అని అనుకోవడం ఎన్నటికీ ప్రేమకు దారి తీయదు. మన చుట్టూ ఉన్న వృత్తాలతో ఏకమైనప్పుడే ప్రేమ సాధ్యం.

నిజానికి ఉన్నది ఒకటే వృత్తం. ప్రతి ఒక్కరిదీ ఒకటే కేంద్రం. మనము భారత దేశంలో పుట్టిపెరిగి, అమెరికాలో పుట్టిపెరిగిన వారితో అనుబంధం పెట్టుకోవచ్చు. మన భాషలు, సంస్కృతి వేరైనా ఆత్మ దృష్ట్యా మనమంతా ఏకమే. ఈ విధమైన అవగాహన సమాధిలో వస్తుంది. అన్ని వృత్తాలు కలిసిపోతాయి. మనము అందరినీ, అన్ని జీవులనూ ప్రేమించాలనే అనుభవం కలుగుతుంది.

ఇద్దరి మధ్య నిజంగా ప్రేమ కలగాలంటే అన్ని వేళలా కలసి ఉండాలి. అలగాని ఒకరిమీద ఒకరు ఆధారపడడానికే పరిమితం కాదు. ఒక నిస్వార్థ కార్యానికై కలసి పనిచేయాలి. అలా ఉంటే మనకి వంద సంవత్సరాలు కలిసి ఉన్నా తనివి తీరదు. పరిమితమైన వస్తువుతో సంతృప్తి పడితే మన ప్రేమ పూర్ణం కాదు. మన వృత్తాలు కలిసిపోతే "మన మధ్య వేర్పాటు వద్దు" అని అనగలము. 414

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...