Sunday, April 10, 2022

Eknath Gita Chapter 12 Section 6

Bhagavat Gita

12.6

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ {12.8}

నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వ౦ న సంశయః

నీ మనస్సును నా యందు నిలుపుము. నీ బుద్ధిని నాయందు ప్రవేశపెట్టుము. ఆ తరువాత నీవు నా యందే వసి౦తువు. ఇందులో సంశయము లేదు

ఒక క్రీడాకారుడు ఎంతో ఆలోచించకుండా యాంత్రికంగా తన క్రీడను ఆడవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో అలాగే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనలో ఆవేదన అహంకారం వలన కలుగుతుంది. అది నిశ్చలంగా ఉంటే మనచే ఏ పనీ బలవంతంగా చేయబడదు. అలాగే మన అనుబంధాలకు అవరోధాలుండవు.

మన మాటే నెగ్గాలి, అంతా మన ఇష్టమే అనే భావనలు ఉంటే అవి మన అనుబంధాలకు అడ్డు వచ్చి ఇతరులపై ప్రేమ కలుగజేయవు. ఆ భావనలను ఎంత తగ్గించుకుంటే మన నుండి మనము అంత ఎక్కువగా వైరాగ్యము చెందుతాము. అట్టి వైరాగ్యము లేకపోతే ఇతరులయందు అసూయ, క్రోధము మొదలగు అవలక్షణాలు కలుగుతాయి.

మన మనస్సు మనకు కావాలసినట్టు జరిగితే ఉవ్విళ్ళూరుతుంది. అలా కాకపోతే క్రుంగిపోతుంది. మనకు స్వీయ వైరాగ్యం కలిగితే మనస్సులోని చలనం తగ్గుతుంది. అప్పుడు మనము జీవైక్యముతో ఉంటాము. దాని సహజ లక్షణం ఒక వ్యక్తి యందే కాక, అన్ని జీవులమీద ప్రేమ ఉండడం. ప్రేమించడానికి ఏదో గొప్ప వస్తువు అవసరం లేదు. మనమెప్పుడైతే మనమనుకున్నట్టు జరగాలనే పట్టుదలను వీడుతామో, మన వ్యక్తిత్వంలో మిగిలి ఉండేది ప్రేమ.

మన మనస్సు పరమాత్మ మీద కేంద్రీకరించాలంటే మనము అహంకారాన్ని విడనాడాలి. అంటే మీ గురించే ఎక్కువ ఆలోచించ కండి. మీకు గతంలో కలిగిన అవమానాలను గూర్చి గాని, మీయందు దుష్ప్రవర్తనను చూపినవారి గురించి గాని ఆలోచించవద్దు. కొందరికి ఊహాతీత భావనలు కలగవచ్చు. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు వారికి ఫోన్ చేసి మాట్లాడుతారనే భ్రాంతి. ఇలా ఉంటే మన మనస్సును అహంకారం మీద కేంద్రీకరించా౦. అదే జరిగితే మంత్రోచ్చరణ తప్ప వేరే మార్గం లేదు.

కొందరి ఆలోచనా సరళిని విశ్లేషిస్తే ముఖ్యంగా తేలేది "నాకిది నచ్చదు" అనే భావన. వారికి ఒకరి ప్రవర్తన నచ్చకపోవచ్చు. అలాగే భార్య వండిన వంట నచ్చక పోవచ్చు. "నువ్వు నాకు నచ్చలేదు" అని చెప్పిన తరువాత, అది తప్పా, ఒప్పా అని ఆలోచించవద్దు. మంత్రోచ్ఛారణ చేయడమే ఉత్తమం.

గోఫర్ అనే ఉడుత భూమి ఉపరితలం క్రింద బొరియలు త్రవ్వుకొని వాటిలో నివసిసస్తుంది. గోఫర్ ల చర్యలు పరిశీలిస్తే ఆకలి వేసినప్పుడు బొరియల వెలుపకు వస్తాయి. తిరిగి లోపలకు పోతాయి. నా ఇంటి వెనకాల ఉండే గోఫర్ లకు నేనంటే భయం లేదు. నేనున్నప్పడు వాటి సహజ చర్యలు చేసికుంటూ పోతాయి. అదే నా పిల్లి వస్తే అవి భయపడి బొరియల లోకి పారి పోతాయి.

మన మంత్రము ఒక పిల్లి లాగ ఉండి, స్వార్థ పూరిత ఆలోచనలనే గోఫర్ లను అణచివేస్తుంది. మంత్రం లేకపోతే దురాలోచనలు గోఫర్ లవలె మన మనస్సుని పూర్తిగా ఆధీనంలో పెట్టుకొంటాయి. క్రమంగా ఒక దురాలోచన కలిగినప్పుడు, మంత్రం వెంటనే మనస్సులో తళుక్కుమంటుంది. ఈ విధంగా స్వార్థ పూరితమైన ఆలోచనలు లేదా దురాలోచనలు నియంత్రింప బడతాయి.

మనస్సు నిశ్చలంగా ఉంటే సరిపోదు. బుద్ధి కూడా దానికనుగుణంగా ఉండాలి. బుద్ధి యొక్క కార్యం: "నేను ఇది చేస్తే దాని పర్యావసానమేమిటి? నేను ఇది చేయకపోతే ఏమవుతుంది?" అనే ప్రశ్నలకి సమాధానాలు వెదకడం. బుద్ధి పనిచేయాలంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే బుద్ధి పనిచేసే బదులు మనస్సు పనిచేసి "నాకిది నచ్చింది" లేదా "నాకది నచ్చలేదు" అని ఇష్టానుసారంగా పని చేస్తుంది. శ్రీకృష్ణుడు "బుద్ధి నాయందు ఉంచు" అని చెప్పడానికి కారణం: జీవితాన్ని అహంకారంతో గడపవద్దు. ఆత్మతో అనుసంధానము చెయ్యి. అనగా నీ మనస్సులో కలిగే ఇష్టాయిష్టాలతో విషయాలను విచారించ వద్దు.

కొందరు "ఆత్మ ఏ దృక్పథంతో ఉంటుంది?" అని అడుగుతారు. అది మనకు కనబడదు. అది ఎక్కడుందో మనకు తెలియదు. ఆత్మ యొక్క దృక్పథం తెలిసికోవాలంటే మనము ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు "దీని వలన ఎవరికి లాభం?" అని ప్రశ్నించుకోవాలి. మన అహంకారం "ఇది పరుల గురించి చేయబడుతున్నది" అని చెప్పి మననని సంతృప్తి పరచవచ్చు. కానీ అక్కడితో ఆగికపోక బుద్ధిని ఉపయోగించి నిర్ధారణ చేసికోవాలి. చివరకు "దీని వలన ఎవ్వరికీ ఎటువంటి లాభమూ లేదు" అని కూడా తీర్మానించవచ్చు.

అలాగని మన స్వార్థాన్ని పూర్తిగా చంపుకోనక్కరలేదు. తక్కిన వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచి౦చి క్రియలు చేస్తే, వాటిలో మన కోర్కెలు కూడా కలసి వస్తాయి.

రెండవ అంశం, మనము ఆలోచన దీర్ఘంగా చెయ్యాలి. అంటే అహంకారాన్ని వీడి ఆత్మతో అనుసంధానం చేసి, పది మందికీ ఉపయోగపడే కార్యాలు చెయ్యాలి. ఎందుకంటే ఆత్మకి వైరాగ్యం సహజం. ఇది అహంకారానికి పూర్తిగా వ్యతిరేకం.

మనము వస్తువులు చూపే ఆశలు, చివరకు ఇచ్చే సుఖములలోని తారతమ్యం తెలిసికోవాలి. ఉదాహరణకు ఒక రసగుల్లా తింటే పది నిమిషాల పాటు దాని తీపిని ఆస్వాదీస్తాం. కాని అదేపనిగా రసగుల్లాలు తింటూ ఉంటే అనేక రోగాలు వస్తాయి. అది వెంటనే కాకపోవచ్చు. కాని దాని పర్యావసానము జీవితంలో ఎప్పుడోఒకప్పుడు ఉంటుంది.

మూడవ అంశం, శ్రీకృష్ణుడు మత్పరాః -- అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకో -- అంటాడు. మనమేదైనా కార్యం చేసేముందు "ఇది నా ధ్యానాన్ని, ఏకాగ్రతను, నిస్వార్థాన్ని మెరుగుపరుస్తుందా?" అని అడగగలగాలి. అవును అంటేనే అది చెయ్యాలి. ఒకదాని వలన ఏకాగ్రత చెడి, ఇతరులనుండి ఎడంగా ఉంచబడి, అతి చలనం కలిగి, పాత జ్ఞాపకాలు, కోరికలతో ఉద్రేకం కలగవచ్చు. అటువంటి దానిని విడనాడాలి. కఠోపనిషత్తు ఇలా చెప్పును: "ఏది ఆనందదాయకమో ఒకటి; ఏది జ్ఞానముతో కూడినదో వేరొకటి. మొదటి దానివలన దుఃఖం కలుగక మానదు. రెండవది, ఆరంభంలో క్లేశాన్ని కలిగించినా, శాశ్వత సుఖం ఇస్తుంది. "

ఇంకా ఒకే అంశం మీద తీవ్ర కృషి చెయ్యనక్కరలేదు. అలా చేస్తే రాగద్వేషాలు కలుగుతాయి. వైరాగ్యం రాదు. దాని వలన సమిష్ఠి నుండి విడబడతాము. ఒక గొప్ప లక్ష్యం ఉంటే తప్ప దీనిని అర్థంచేసికోవడం కష్టం.

కొందరు మరాథాన్ లలో పరిగెడతారు. దానికి చాలా శిక్షణ పొందుతారు. వారికి అదొక వ్యాపకం. అది ఒక వ్యాయామం అనడంలో నిజముంది. కానీ దాన్నే అతిగా చేస్తే ధ్యానం కుంటుబడుతుంది, శారీరక సమస్యలు -- కీళ్ల నొప్పులు మొదలగునవి- రావచ్చు.

మెహర్ బాబా "గట్టి ప్రయత్నం చెయ్యి. విచారించ వద్దు. ఆనందంగా ఉండు" అని చెప్పేరు. విచారం మనము స్వీయ వైరాగ్యం పొందకపోవడం వలన కలిగేది. ఉదాహరణకి "నేనిది చెయ్యగలనా? ఫలానా వాడు నేను అనుకున్నట్టు చెయ్యగలడా?" అనే ప్రశ్నలతో సతమతమవ్వడం. మనమెప్పుడైతే ధ్యానంలో గట్టి ప్రయత్నం చేస్తామో, మనకు విచారించడానికి సమయం దొరకదు. అప్పుడు మన సర్వస్వం పరమాత్మ మీద భారం వేసి ఉంటాం.

ఈ అంశాలన్నీ మన అనుబంధాలకు అన్వయం చేసికోవాలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండవు. కానీ కొందరు వివాహ బంధాన్ని ఒక ఒప్పందంగా చేసికొంటారు. "నాకు ఎంత ఇస్తావో, నీకు అంతే ఇస్తాను" అనే బేరాలకు అనుబంధాలలో తావు లేదు.

వేకువలోనే కాకుండా, సర్వ వేళ సర్వావస్థల యందు, మనస్సు నిశ్చలంగా ఉంటే శ్రీకృష్ణుడు "అనుమానం లేకుండా నువ్వు నాలోనే సదా నివసిస్తావు" అని అంటాడు. ఎందుకంటే మన భక్తి ఉండి-పోయేది కాదు. మనమెక్కడికి వెళ్ళినా ధ్యానం చేసుకొంటూ చలిస్తాము. లారెన్స్ అనే యోగి ఇలా వ్రాసేరు:

నాకు వ్యాపారం చేసే సమయానికి, ధ్యానం చేసే సమయానికి తేడా లేదు. వంటగదిలో పలువురు గుమిగూడి శబ్దాలు చేస్తున్నా, నేను క్షోభలేని స్థితిలో దేవుని పాదాలముందు మోకాళ్ళ మీద నుండి ధ్యానం చేస్తున్నట్టు ఉంటాను

ఇంకోవిధంగా చెప్పాలంటే ప్రేమ అనబడే సరస్సు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ప్రేమ మనకి సహజంగా కలుగుతుంది. ద్వేషం రమ్మన్నా రాదు. మనము వేరొకరితో ఎలా స్పందించాలో అని ఆలోచించనక్కరలేదు. మనము ఇతరుల మంచి గురించే సదా మెలగుతాము. అనుబంధాలలో స్పర్థలు, అనుమానాలు, క్రోధం మొదలగు దుర్లక్షణాలు ఉండవు. ఇతరులను ప్రేమించడం, నమ్మడం, క్షమించడం సహజంగా జరుగుతాయి. సెయింట్ బెర్నార్డ్ "ప్రేమకి తనకంటే వేరే కారణం లేదు; దానికి ఫలాపేక్ష కూడా లేదు. అదే దాని ఫలం. నేను ప్రేమించేది ప్రేమ కోసమే. నేను ప్రేమించేది ఇంకా ఎక్కువ ప్రేమించడానికి" అని చెప్పిరి. 357

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...