Bhagavat Gita
2.18
ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేవ మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః
{2.29}
ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శ్రుణోతి శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్
ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యముగ చూచు చున్నాడు. మరియొకడు ఆశ్చర్యముగ చెప్పుచున్నాడు. వేరొకడు ఆశ్చర్యముగ ఆలకించుచున్నాడు. ఆలకించినను ఏ ఒక్కడును దీనిని తెలిసికొనుటలేదు.
బైబిల్ మార్క్ 4:3-8 లో ఒక కథ ఇట్లు చెప్పబడినది:
ఒక రైతు విత్తనాలు పట్టుకొని జల్లడం మొదలెట్టేడు. కొన్ని విత్తనాలు పొలం అవతల పడ్డాయి. వాటిని పక్షులు వచ్చి తినేసేయి. కొన్ని ఎక్కువ మట్టిలేని రాళ్ళప్రదేశంలో పడ్డాయి. అవి వెంటనే మొలిచేయి. కానీ వాటికి వేళ్ళు లేకపోవడం వలన, ఎండ వేడికి, కృశించిపోయేయి. కొన్ని ముళ్ళ మధ్య పడ్డాయి. ముళ్ళు పెరిగి వాటిని కప్పి వేసిన కారణాన వాటికి పళ్ళు కాయలేదు. మిగతావి సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి మొలకెత్తి విరివిగా కాసేయి.
"కొన్ని విత్తనాలు పొలం అవతల పడ్డాయి. వాటిని పక్షులు వచ్చి తినేసేయి" అనగా--
మన మనస్సులో ఆసక్తి ఉంటే తప్ప ఆధ్యాత్మిక విషయాలు అచేతన మనస్సులోకి వెళ్లలేవు. అవి ఎంత పెద్ద గురువైనా చెప్పినప్పటికీ కూడా. తెలివిగలవారు, పెద్ద చదువు చదువుకున్న వారలు, ఎంతో పేరుప్రతిష్ఠలు గలవారు "మనకు ధ్యానం ఎందుకు?" అని అడుగుతారు. నేను ధ్యానం వలన చేతన మనస్సులో మిక్కిలి అందవికారమైనది కూడా ఎంతో సౌందర్యంగా చేసికోవచ్చు అని చెప్తే కొందరు "మాకు ధ్యానం అవసరం లేదు, ఎందుకంటే మేము చాలా సౌందర్యవంతులం. మీకు ఇటువంటి మార్పు అవసరం. చూస్తూ ఉంటే మీలో మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి" అని అనేవారు. మరికొందరు "మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటాము. మేము నిద్రలేస్తూనే ఆనందంగా ఉంటాము. అలాగే నిద్రకి ఉపక్రమిస్తున్నప్పుడు కూడా. మేము ఎల్లవేళలా ఆనందంగా ఉంటాము" అని అనేవారు. జీసస్ చెప్పే పక్షులచే తినబడ్డ విత్తనాలు, ఇలా మంచి మాటలని పెడ చెవిని పెట్టే వాళ్ళగురించే.
ఎదగాలంటే కొంత దుఃఖ౦ అనుభవించాలి. ప్రేమ కలగాలంటే కొంత ఒత్తిడి ఉండాలి. కలత చెందితేనే మన మనస్సు లోతులకి వెళ్ళి ఉపసమనం పొందగలము. అలాగే మనం బాధ పడితే తప్ప ఇతరుల వేదన అర్థం చేసికోలేం. జీవిత౦లో ఎదురు దెబ్బలు తింటే తప్ప ఇతరులపై దయ కలుగదు. కొందరు ఎంత ఎదురీత ఈదినా, కాలక్రమేణా వాటిని మరిచిపోతున్నట్టు ఉంటారు. ఒక వృద్ధుడు యుక్తవయస్కులు చేసే కొన్ని క్రియలను, తాను చిన్నప్పుడు తప్పులు చేసినప్పటికీ, ఖండిస్తాడు. అలా కాక వాని చిన్ననాటి అనుభవాలు గుర్తు తెచ్చుకొని తనకన్నా చిన్నవారిపై దయతో నుండి, వారికి సహాయం చెయ్యగలగాలి.
"కొన్ని విత్తనాలు ఎక్కువ మట్టిలేని రాళ్ళప్రదేశంలో పడ్డాయి. అవి వెంటనే మొలిచేయి. కానీ వాటికి వేళ్ళు లేకపోవడం వలన, ఎండ వేడికి, కృశించిపోయేయి" అనగా--
కొందరు ఆరంభ శూరత్వంతో ఉంటారు. అంటే ఏ పని చేసినా మొదట్లో అత్యంత ఉత్సాహంతో ఉంటారు. వారు ధ్యానం మీద ప్రసంగం విని మిక్కిలి ఉత్తేజితులవుతారు. కొందరు ఆరంభ శూరులు నా వద్దకు వచ్చి "మీరు చెప్పేదే నేను చాలా కాలం నుంచి వెదకుతున్నాను" అని చెప్పేవారు. ఆ తరువాత వారు కనుమరుగై పోయేవారు. ఇంకొందరు ఆరంభ శూరులు ధ్యానానికై అగరబత్తులు, దిండు, రవి శంకర్ పాటలు కొనుక్కొని వచ్చి, అవి ఎందుకు కొన్నారో మరచిపోతారు. మనము ధ్యానం కొన్నాళ్ళు అభ్యాసం చేసి చూడాలి. దానికి ఈ హంగులన్నీ అక్కరలేదు.
"కొన్ని విత్తనాలు ముళ్ళ మధ్య పడ్డాయి. ముళ్ళు పెరిగి వాటిని కప్పి వేసిన కారణాన వాటికి పళ్ళు కాయలేదు" అనగా--
మేము కొన్నేళ్ళ క్రితం ఒక కాయగూరల తోటను వేద్దామనుకొన్నాం. దానికై టమాటా, జొన్న, గుమ్మడి విత్తనాలు నాటేం. ఒక బ్రిటిష్ దేశస్తుడు తనకు కాయగూరల తోటలగురించి చాలా తెలుసునని చెప్పి "కలుపు మొక్కలను పెరగ నివ్వండి" అని సలహా ఇచ్చేడు. నేను వానిని నమ్మడం వలన పంట చెడింది. మనం ధ్యానం ప్రతి ఉదయం చేసినప్పుడు మన మనస్సులోని కలుపు మొక్కల వలె ఉన్న చెడు ఆలోచనలను నియంత్రించి, కాయగూరల వలె నున్న మంచి భావాలను అలవరుచుకోవాలి.
"మిగతా విత్తనాలు సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి మొలకెత్తి విరివిగా కాసేయి" అనగా--
కొందరు ఆధ్యాత్మిక సాధన స్వార్థముతో కూడినదని అనుమానిస్తారు. సాధన మొదట్లో మన దిన చర్యను మార్చుకొని, కొందరు బంధుమిత్రులను విడనాడితే మనపై అసాంఘికములమని ముద్ర వేస్తారు. అప్పుడు మనము ధ్యానం వలన బంధుమిత్రులను ప్రభావితం చెయ్యగల శక్తిని పొందుతామని మరచిపోకూడదు. శ్రీ రామకృష్ణ లాంటి వారల లాగ మనం వేలాది మంది ఆదరణ చూరుగొనక్కరలేదు. మన సాధన దినదినాభివృద్ధి కలుగుతూ ఉంటే దగ్గిర సన్నిహితులకు మనము పొందిన జ్ఞానాన్ని వివరించవచ్చు. 81
No comments:
Post a Comment