Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 46

Bhagavat Gita

2.46

అపూర్యమాణ ప్రవిశంతి మచల ప్రతిష్ఠ౦

సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ {2.70}

తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే

స శాంతి మాప్నోతి న కామకామీ

నీటిచే పూర్ణముగా నిండినదియు, నిశ్చలమైనదియు నగు సాగరమును నదీజలము మొదలగునవి ఎలా ప్రవేశించుచున్నవో అలాగే విషయము లన్నియు ఏ యోగయుక్తుని పొంది తద్రూపమై పోతున్నవో అతడే శాంతిని పొందుచున్నాడు. విషయలోలుడు శాంతిని పొందలేడు

అపూర్యమాణమ్ అనగా సంపూర్ణమైనది. ఇది మన లక్షణం. మనమనుకుంటాం డబ్బు, ఆనందం ఉంటేనే మనము పూర్ణులమని. మనము పుట్టుకతోనే సంపూర్ణులం. దాని నుండి తీసికొన్నా అది పూర్ణమే. మనము అహంకార పూరితులమై బ్రతికినంత కాలం పూర్ణత్వం, భద్రత మనలోనే ఉన్నాయని గ్రహించం. మనలోని అగాధాన్ని ఆత్మ జ్ఞాన మొక్కటే పూరించ గలదు.

బుద్ధుడు అహంకారులు దుఃఖాలను అనుభవిస్తారని చేప్పేడు. దుఃఖానికి (దు: అనగా చెడ్డ; ఖ అనగా రంధ్రం) పర్యాయ పదం అగాథం. మనలోని అగాథాన్ని పూరించడానికి సొమ్మును కట్టలు కట్టలుగా తెచ్చి వేస్తాం. కాని అది పూరింపలేని అగాథం. మన డబ్బు, వస్తువులు, ఆనందం, ప్రతిష్ఠ అంతా అందులో వేసినా అది పూరింప బడదు. మనము దాన్ని పూరించలేమని గ్రహించిన తరువాత సెయింట్ అగస్టీన్ చెప్పిన "భగవంతుడా, నీలో విశ్రాంతి తీసికోవడానికి ప్రయత్నిస్తున్న నేను వేరొక చోట ఎలా విశ్రాంతి పొందగలను?" అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పేది: క్షణిక సుఖాన్నిచ్చే విషయాల గూర్చి జీవితాన్ని ఎందుకు వృధా చేసుకొంటావు? నీకు వాటి అవసరం లేదు. నువ్వు నా కారణాన సంపూర్ణుడవు. నీ అంతర్గతం పరీక్షించుకొంటే నన్నే పొందుతావు.

అచలప్రతిష్ఠమ్ అనగా నిశ్చలంగా ఉండడం. ఇది బ్రహ్మన్ --అనగా సృష్టి కర్త -- యొక్క నిశ్చలత్వం. మనం మార్పులేని, నిశ్చలమైన భగవంతుని ప్రతిష్ఠి౦చుకోవాలంటే మన మనస్సును నిశ్చలం చేసికోవాలి. మనస్సును ఎక్కువగా సముద్రంతో పోలుస్తారు. సముద్రం ఉపరితలంలో అలలు, గాలులు ఉండి అలజడి కలిగించినా, సముద్ర గర్భంలో అలలు, గాలులు లేక ప్రశాంతంగా ఉంటుంది. మన అచేతన మనస్సులోని భగవంతుని తెలుసుకోవాలంటే ధ్యానం ద్వారా మనస్సును నిశ్చలం చేసికోవాలి.

నేను కొన్నేళ్ళ క్రితం మనస్సుని ఎలా నిశ్చలం చేసికోవాలి, ఊహాతీతమైన జ్ఞానం గూర్చి మాట్లాడుతున్నప్పుడు కొందరు ఇలా అడిగేవారు: "మనం తర్కాన్ని ఉపయోగిస్తాం. మనకు విజ్ఞానం, సాంకేతిక శాస్త్రం తెలుసు." మనం వాటికి తగినట్టు ఉంటే మంచిదే. కానీ మనస్సు వాటితో అనుసంధాన మవ్వదు. మనస్సు స్వతహాగా చంచలం. మనలోని ఒత్తిడి, నిరాశ, వైరం, అలసట, పట్టుదల లేకపోవడం మనస్సు నిరంతరం పనిచెయ్యడం వలన. ఎవరైతే క్రమశిక్షణ లేకుండా పనులు చేస్తారో, రాగద్వేషాలతో కూడి ఉంటారో వారి ప్రాణశక్తి వృధా అవుతుంది. మనకి ద్వేషముంటే, కలల్లో కూడా, ప్రాణ శక్తి వృధా అవుతుంది. కొందరు 8 గంటలు పడుకొని, ఉదయాన్నే లేచి "నేను ఎందుకు ఇంకా అలసటతో ఉన్నాను?" అని అనుకొంటారు. ప్రాణ శక్తి వృధా అవుతూ ఉంటే మనకు కలిగేది బలహీనత, నీరసం. అందుకే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

మనమెప్పుడ ధ్యానంలో పూర్ణత్వం, నిశ్చలత పొందుతామో అప్పుడు అమిత సంతృప్తి కరమైన స్థితి కలుగుతుంది. అంటే కొంత కాలం మనస్సు, ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో వ్యాపారం పెట్టుకోవు. దీనినే బుద్ధుడు శూన్యత అంటాడు. అక్కడ రాపిడి, అసఖ్యత, వేర్పాటు ఉండవు. దాన్నే యోగులు పూర్ణత అంటారు.

మనమెంత ఆధ్యాత్మిక సాధన చేసినా అప్పుడప్పుడు మనస్సులో కోర్కెలు కలగవచ్చు. ఎందుకంటే మనము మానవ మాత్రులము కాబట్టి. అలా కోర్కెలు కలిగినప్పుడు వాటిని పట్టించుకోక, వాటి ప్రోద్భలంతో కర్మలు చేయక ఉండాలి. కోర్కెలు, నదులు సముద్రం వైపు ప్రవహిస్తున్నట్లు, వస్తాయి. కానీ సముద్రమెలా నిశ్చలంగా ఉంటుందో మనమూ అలాగే ఉండాలి. మనము ఇతరులకు సేవ చెయ్యక, స్వార్థంతో కూడి ఉంటే, పెద్ద పెద్ద అలలతో కూడిన ఒక కాలువ ఎలాగ గట్టును ధ్వంసం చేస్తుందో అలాగ మనలోని ఆలోచనలు అతలాకుతలం చేస్తాయి. అదే మనము ధ్యానముతో మన చేతన శక్తిని వాడుకొని, జీవైక్య సమానతని పాటిస్తూ ఉంటే మనవైపు గంగా నది వలె పొంగి పొరలే కోరికలు ఉదయించినా, సముద్రమెలాగ ఉంటుందో అలా నిశ్చలంగా ఉంటాం.

కామకామీ -- అనగా కోర్కెలను కోరేవాడు. మనమెంత సాధన చేసినా మనలో కామం అంత సులభంగా పోదు. మనము కామదేవుడు, లేదా మన్మథుడు, కామాన్ని కలిగించేవాడని నమ్ముతాము.

మదనో మన్మథో మారాః ప్రద్యుమ్నో మీనకేతనాః

కందర్పో దర్పకో అన౦గాః కామాః పంచశరాః స్మరాః

మన్మథుని ప్రభావం వలన మనము నిశ్చలంగా కూర్చోలేం, ఊపిరి సరిగ్గా తీసికోలేం, సరిగ్గా ఆలోచించలేం. ఇవన్నీ మనస్సులో కలిగే విషయాలు. మన్మథుని మర -- అనగా దెబ్బ కొట్టే వాడు -- అనికూడా అంటారు. అతడు శ్మర అనగా ఎప్పటికీ మరిచి పోనివ్వని వాడు. ఒక మారు కామానికి లొంగి లైంగిక కార్యాలు చేస్తే, వాటిని ఎన్నటికి మరిచిపోలేం. అవి మనస్సుని దొలిచేస్తాయి. పరమ శివుడు ఒక్కడే మనకు గతి. అతడు శ్మరారి అనగా శ్మర యొక్క శత్రువు. అతడే మనలో లైంగిక కార్యాల గురించి కలిగే ఆలోచనలను నియంత్రించి మన ప్రాణ శక్తిని కాపాడేవాడు. పంచశర అనగా 5 బాణాలు కలవాడు. మన్మథుడు మనమీద ఎప్పుడైతే బాణాలను ప్రయోగిస్తాడో మన౦ వాటిని తప్పించుకోలేం. మంత్ర జపమే మనకు శరణ్యం.

ఒక గాఢమైన కోరిక ఉదయం ధ్యానంలో వస్తే దాన్ని నియంత్రించుకొంటాం. కానీ అక్కడితో అయిపోక, అది రోజంతా మనల్ని వెంటాడవచ్చు. అప్పుడు మనము ధ్యానంలో పొందిన శక్తితో దాన్ని ఎదిరించి తరిమివేయ వచ్చు. ఇలాగ కోర్కెలు మనల్ని వెంటాడితే మనస్సుని నిశ్చలం చేసికొని, మంత్ర జపం చెయ్యడం ఉత్తమం. ఇదే జీవితంలోని పెద్ద సవాలు. మనము కోర్కెలను తరిమి వేస్తుంటే మన పట్టుదల పెరుగుతూ వస్తుంది. క్రమంగా మనకు తెలిసేదేమంటే: సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన సృష్టి కర్త మన కోర్కెలను నియంత్రించడానికి అపారమైన శక్తిని, మనోనిగ్రహతను ఇచ్చేడు. లైంగిక కార్యాలు దీనికి వ్యతిరేకం కాదు. అవి కుండలిని శక్తికి సంబంధించినవి. ఆ శక్తికి లోబడక, దానినే స్వాధీనం చేసికొంటే మనలోని సృజనాత్మక శక్తి ఉద్భవించి మనలను సత్కర్మలు చేయుటకు ప్రోత్సాహిస్తుంది. 140

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...