Bhagavat Gita
2.47
విహాయ కామాన్ యస్సర్వాన్ పుమా౦ శ్చరతి నిస్పృహః
{2.71}
నిర్మమో నిరహంకార స్స శాంతి మధిగచ్ఛతి
సమస్తమైన కోరికలను త్యజించి, వానియందు స్పృహలేనివాడై, మమకార అహంకారములను విడనాడి చరించు పురుషుడు శాంతిని పొందుచున్నాడు
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అన్ని కలహాలు పరిష్కరించే, అన్ని కోరికలను తీర్చే, అన్ని భయాలను దూరం చేసే శాంతిని పొందే మార్గం బోధిస్తున్నాడు. మన చేతన మనస్సులో ఒక చీలిక ఉంది. దాని వలన మనం పూర్తిగా ప్రేమతో లేక విశ్వాసంతో ఉండలేము. స్పర్థలు ప్రేరేపించి, అవిశ్వాసంతో ఇతరులతో వేర్పాటు చేసే విధంగా ప్రవర్తిస్తే ఆ చీలిక మన చేతన మనస్సును రెండు భాగాలుగా చేస్తుంది. ధ్యానం ఆ రెండు భాగాలనూ ఏకం చేసి అఖండంగా చేస్తుంది. ధ్యానం ద్వారా పొందేది: మన హృదయంలోని, మనస్సులోని చీలికలను తొలగించడం; బాహ్యంగా మనల్ని కుటుంబంతోనూ, సమాజంతోనూ, ప్రపంచంతోనూ వేర్పాటు కలిగించే నిరోధాలను తొలగించడం.
మన చేతన మనస్సును ఏకం చెయ్యాలంటే మనమెవరియందూ అవిశ్వాసంతో ఉండకూడదు. ఉదాహరణకు మన తలిదండ్రుల యందు అవిశ్వాసంతో ఉంటే అది మన బంధుమిత్రుల యందు కూడా వ్యాపిస్తుంది. చిన్న వయస్సు నుంచీ ప్రేమను, విశ్వాసాన్ని ఏకం చేసే విధానాన్ని నేర్చు కోవచ్చు. అలాకాకపోతే ఇంటిని వదిలి బయట ప్రపంచంలోని సమస్యలతో లావాదేవీ పెట్టుకుంటే అవిశ్వాసం మన బంధాలను ప్రభావితం చేస్తుంది.
అవిశ్వాసం బుద్ధునుకి అనేక ఇబ్బందులు కలిగించింది. పీటర్ జీసస్ తో "మీయందు ఎప్పుడూ విశ్వాసంతో ఉంటాను" అని చెప్పేవాడు. కానీ జీసస్ "కోడి కూసేముందు నీవు నన్ను మూడు మార్లు ధిక్కరిస్తావు" అనెను. అవిశ్వాసం చీలికలు తెస్తే, విశ్వాసం ఐకమత్యాన్ని కలిగిస్తుంది. ప్రతి బంధంలోనూ పూర్తి విశ్వాసాన్ని కల్పించుకోగలం. నేనిది కుటుంబ నేపధ్యంలో చెప్పడం ప్రతి ఒక్కరూ వివాహం చేసికొని, పిల్లల్ని కనమని కాదు. ఎక్కడ మిత్రులు కలసి ఉంటారో, ఎక్కడ మనం పని చేస్తూ ఉంటామో, అవి కూడా కుటుంబాలే. మనం ఎవరో ఒకరిని ముందు పెట్టవచ్చు; మిత్రుడు లేక పోతే, మనం ఒక శత్రువును ఎన్నుకోవచ్చు. వాని మీద పగ తీర్చుకోకుండా వాని సమస్య యొక్క పరిష్కారం చెయ్యగలిగితే మన మధ్యనున్న చీలిక పోయి, ఐకమత్యాన్ని అనుభవిస్తాం. సెయింట్ ఫ్రాన్సిస్ "ఎవరైతే తమ శత్రువులను క్షమించలేరో వారు ఆనందాన్ని పొందలేరు" అని అన్నారు.
మన వివాహాలు, తద్దినాలు "ఓం శాంతి, శాంతి, శాంతి" అని అంతమవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శాంతిని పొంది తరించాలి. అది మాటలతో వ్యక్తపరచబడలేనిది. ప్రతి రోజూ మనం చేసే ధ్యానం మనల్ని శాంతికై తయారు చేస్తున్నాది. మీరు తక్కువ నిద్రతో, మనస్సు నిగ్రహం లేక, మంత్ర జపం సరిగ్గా చేయకపోయినా మీరు శాంతి వైపు పయనం సాగిస్తున్నారు. భౌద్దులు చెప్పేది నమనస్కం -- అంటే మనకు ఇంద్రియాలతోనూ, బుద్ధితోనూ సంబంధం లేకుండా సమ స్థితిలో ఉండడం. యోగులు ఇటువంటి సహజమైన జ్ఞానం బుద్ధి యొక్క పరిమితులను దాటి ఉంటుందని అంటారు.
శాంతిని పొందడానికి చాలా కాలం పడుతుంది. ఆ అనుభవం కొద్దిగా ఉందంటే మనస్సు కొన్ని క్షణాలు పనిచేయలేదు. ప్రతి చోటా నిశ్చలత్వం, నిశ్శబ్దం ఉండి మనని ఆహ్లాద పరుస్తాయి. అట్టి అనుభవం దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని -- అనగా అహంకారం తప్పించి అన్నిటినీ--ఉపశమనం చేస్తుంది. శాంతి అంటే మనము ప్రేమ స్వరూపము కాగల శుద్ధమైన స్థితి. మన ప్రేమ ఒక వ్యక్తి మీదే కాక, సర్వ జీవ సమైక్యతకై ఉంటుంది.
నిస్పృహ -- అంటే ఇంద్రియ చాపల్యం లేకుండా, బాహ్య ప్రపంచం వలన సంతృప్తి పడాలనే కోర్కె లేక పోవడం. క్రమక్రమంగా ఒక్కొక్క కోరికను వదిలేయాలి. అందుకే ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవడానికి చాలా కాలం పడుతుంది. మనలో చాలా మంది ధనార్జన, లేదా పేరుప్రతిష్ఠల వలన ఆనందం కలుగుతుందని అనుకొంటాము. కానీ పతంజలి ఇలా చెప్పేరు: మనం ఆనందాన్ని ఎందుకు పొందేమంటే ఒక కోరిక తాత్కాలికంగా తీరి, ఉంకో కోరిక రావడానికి తగినంత సమయం లేదు. మనస్సు తాత్కాలికంగా కోరిక లేకుండా ఉంటుంది. మనస్సు నిశ్చలంగా ఉంటేనే ఆనందం కలిగేది. అప్పుడు మనం శాంతిని అనుభవిస్తాం. కొన్నాళ్ల తరువాత ఉంకో కోరిక వస్తుంది. ఈ విధంగా చక్రం సాగుతూ ఉంటుంది. నేను తాత్కాలికమైన ఆనందం ఉపశమనం కలిగించదని అనను. కానీ మనము ఒక కోర్కెకు లొంగితే, తరువాత వచ్చేది మరింత శక్తివంతమైనది. ఇలాగ మన స్వార్థ పూరిత కోర్కెలను తీర్చుకొంటూ ఉంటే, కోర్కెకి, కోర్కెకి మధ్య కాలం తగ్గి మనమనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం.
బాహ్య ప్రపంచ వస్తువులకై ఉన్న ఆకాంక్ష ప్రాణ శక్తిని ప్రభావితం చేస్తుంది. మనము బజారులో ఏమీ కొనకుండా తిరుగుతూ, ఒక వస్తువుని కాంక్షించినా, లేదా ఒక వ్యక్తిపై అసూయ చెందినా మన ప్రాణ శక్తి క్షీణిస్తుంది. నిస్పృహ స్థితిని పొందాలంటే "ఇది నాకు అవసరమా?" అని ప్రశ్నించగలగాలి.
శ్రీకృష్ణుడు నిర్మమో అంటాడు. నేను అనే అహంకారం వలన మిత్రుల్ని దూరం చేసికొంటే, నాది అనుకోవడం కూడా అంతే. రాజకీయాలలో ఇది బాగా వర్తిస్తుంది. నాది అని ఎప్పుడైతే ధృడంగా పాతుకుపోతుందో, దానికై యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. జీసస్ "శాంతి దూతలు భగవంతుని పిల్లలు" అని చెప్పెను. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పేడు. మనము మిత్రులకు, సంఘాలకు, దేశాలకు, శత్రువులకు మన జీవితాన్ని ఆదర్శప్రాయంగా చేసి చూపించి, వారి మధ్య శాంతిని నెలకొల్పవచ్చు.
నిర్మమో అని చెప్పడంలో ఇంకో విశేష మేమిటంటే దేవుడు మనకీ వనరులు, జీవితం ఎందుకు ఇచ్చేడంటే మనల్ని భూమి యొక్క రక్షకులుగా చేయడానికి. శ్రీకృష్ణుడు ధర్మ కర్త, యజమాని. మనము అద్దెకు౦టున్న వారలము. మన అద్దె ఇల్లును సరిగ్గా వాడకపోతే ఇంటి యజమాని మనల్ని తరిమేస్తాడు. కానీ దేవుడు మనం చేసే ఆగడాలను కొంతవరకు క్షమిస్తాడు; మన దగ్గర నుంచి అద్దె తీసికోడు. మన నుండి ఆయన కోరేది పరులకై బ్రతకడం. కానీ మన గురించే బ్రతికి, ఆయనను మన స్వార్థ పూరిత కోర్కెలను తీర్చమని అడుగుతాం. మనం నీరు, గాలి ఎప్పుడూ ఉండి మనకు ఉచితంగా ఇవ్వబడ్డాయని అనుకొంటాం. నేటి కాలంలో ఆ వనరులు పరిమితమైనవని తెలిసికొ౦టున్నాం. అందుకే వాటిని సద్వినియోగం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. పర్యావరణాన్ని, నీటిని, గాలిని అశుద్ధం చేస్తే, అవే భావి తరాలకు మనమిచ్చే ఆస్తి.
నిరహంకార -- సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి తన అహంకారాన్ని జయించేడు అని చదివేను. జీసస్ తానెవరనే ప్రశ్నకి సమాధానం కావలిస్తే తనను తాను పోగొట్టుకోవాలి (అహంకారాన్ని విడవాలి) అని చెప్పెను. హెరత్ కి చెందిన అన్సారీ అనే సూఫీ ఇలా చెప్పెను: నిన్ను నీవు పోగొట్టుకొంటే -- అంటే అహంకారాన్ని తుడిచి వేస్తే -- నీ ప్రేమికుడ్ని చేరుతావు. దీనికంటే వేరే రహస్యమేమీ లేదు. నా కింతకన్నా ఎక్కువ తెలీదు.
మన అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే నేను అనే భావాన్ని వదులుకోవాలి. అది మనల్ని ముఖ్యమైనవారలుగా, ప్రతి ఒక్కరి దృష్టిలో అపురూపమైనవారలుగా చిత్రీకరిస్తుంది. నేనున్న బెర్క్ లీ ప్రాంతంలో యుక్త వయస్కుల చేష్టలు చూసి నవ్వుకుంటాను. ఒక యువకుడు వాహనం మీద పియానో వాయిస్తూ అందరి ద్రుష్టినీ తనవైపు త్రిప్పుకున్నాడు. అలాగే కొందరు విచిత్రమైన దుస్తులు వేసికొని బయట తిరుగుతారు. అవే చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవాళ్లకు అటువంటి ప్రదర్శన అక్కరలేదు. మనము మనలోని ప్రేమ స్వరూపుడైన భగవంతుని దృష్టిని ఆకర్షించాలి. అది మంత్ర జపంవలన సాధ్యం. అలా చేస్తే మనం భద్రత ఎక్కడినుంచో వచ్చి మన మీద వాలటంలేదని తెలుసుకొంటాము. దేవుడు మనలో ప్రతిష్ఠితమై ఉన్నందువలన మనమంతా ముఖ్యులమే. మనము ఒకరిలాగ, వాళ్ళ ననుకరించి ఉండాలనే పగటి కలలు కననక్కరలేదు. మనము మన సహజ స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలం. అలాగే మనం శాంతి మనలోనే ఉందని తెలుసుకొంటే, ప్రేమ మన౦ ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తుంది.