Bhagavat Gita
2.48
ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ నైనా౦ ప్రాప్య విముహ్యతి
{2.72}
స్థిత్వా అస్యా మంతకాలే అపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి
అర్జునా! ఇదియే బ్రహ్మీ స్థితి. దీనిని పొందిన వాడు మోహము నొందడు. అంత్యకాలమున కూడ ఈ యోగమునందు నిలిచి బ్రహ్మప్రాప్తిని పొందుచున్నాడు
అహంకారాన్ని జయిస్తే మనము శాశ్వతమైన స్థితిని పొందుతాము. ధ్యానం యొక్క పరాకాష్ఠ సమాధి స్థితి చేరినప్పుడు, మన దేహే౦ద్రియమనోబుద్ధులతో తాదాత్మ్యం చెందక, మనము ఆత్మ స్వరూపులమని తెలిసికొని, మరణాన్ని అతిక్రమించి, అమృతత్వాన్ని పొందుతాము. శ్రీ రామకృష్ణ తన ప్రియ శిష్యులతో మరణం అందరికీ కలుగదు అని చెప్పేరు. శ్రీ రమణ మహర్షి ఆత్మ జ్ఞానం పాఠశాలలో ఉన్నప్పుడే పొందేరు. అప్పుడు ఆయన పేరు వెంకటరామన్ -- మహర్షి కాదు. ఆయనకు ఆంగ్ల వ్యాకరణంలో పరీక్ష జరగబోతోందని తెలిసి, పాఠశాలకు వెళ్ళక ఇంట్లో సాధన చేసేరు. ఆ సాధనతో తన అహంకారాన్ని పోగొట్టుకున్నారు. ఇదే నిర్వాణ మంటే: పరిమితమైన హద్దులతో వేర్పాటు చెంది మన నిజమైన, శాశ్వతమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించడం.
ధ్యానం ఎంతో కాలం చేస్తే మన ప్రాణ శక్తిని గతం నుంచి, భవిష్యత్ నుంచి వెనక్కి తెచ్చుకోగలం. సమాధిలో గతం, భవిష్యత్ ఉండవు--ప్రస్తుత కాలంలో ఉంటాము. ఈ విధంగా ఉండగలిగితే అమృతత్వాన్ని ఇక్కడే, ఇప్పుడే పొందగలము. ఇలా సాధన చేసిన యోగులు చెప్పేది: అఖండమైన చేతన మనస్సుతో కాలం నుండి విముక్తులమై, దాని నుండి శాశ్వతమైన స్థితి పొందుతాము.
నా గ్రామంలో ఒక కొలను ఉంది. దాని చరిత్ర ఏమిటంటే--శ్రీ రాముడు, సీతాదేవి అరణ్యవాసం చేస్తున్నప్పుడు, సీతమ్మకి దాహం కలిగి శ్రీ రాముని నీరు తెమ్మ౦ది. అప్పుడు శ్రీ రాముడు ఒక బాణం భూమివైపు సంధించి విడిచి, భూమి నుండి జలాన్ని బయటకు తెచ్చేడు. నా అమ్మమ్మ ఒక అర్థ శతాబ్దం ఆ కొలనులో స్నానం చేసి, అక్కడి శ్రీ రాముని పాదుకలను భక్తితో సేవించేది. నా అమ్మ చెప్పడం, ఆమె భూమి మీద ఆఖరి క్షణాల్లో "నేను రాముని పాదాలు పట్టుకొన్నాను" అన్నదట.
మరణం ఆసన్నమైన అనుభవం గూర్చి అమృతత్వాన్ని పొందిన అనేక యోగులు అనేక విధాలుగా వర్ణించేరు. మన చైతన్యాన్ని అఖండం చేసికోకుండా, కాలానికి బానిసగా ఉండి, వంద లేదా వెయ్యేళ్ళు బ్రతికినా సంతృప్తి ఉండదు. మనకు కావలసినది అమృతత్వం.