Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 25

Bhagavat Gita

3.25

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే ర్జ్ఞా నవానపి {3.33}

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి

జ్ఞానవంతుడు కూడా ప్రకృతి ననుసరించియే ప్రవర్తించు చున్నాడు. ప్రాణులు తమ ప్రకృతి నాశ్రయించియే చరించుచున్నవి. కావున నిగ్రహమేమి చేయగలదు?

జీవైక్య సమానతను పాటించినా, మనమంతా సంస్కారాల వలన వేర్వేరు వ్యక్తిత్వము గలవారలము. ఉపనిషత్తులలో ఒక కథ చెప్తారు. సృష్టికి ముందు బ్రహ్మన్ ఒక్కటే ఉంది. అది అద్వైత మైనది. కానీ అది రెండవ్వాలనుకొంది. అలాగా తనను విభజించుకొని సమస్త సృష్టిని, దానిలో నివసించే జీవులను సృష్టించింది. కాబట్టి మనమందరమూ ఒకే మూసలోనుంచి వచ్చే౦.

మనమంతా విశ్వ యోని లోంచి ఆవిర్భవించేము కాబట్టి ఒకరి మీద ఒకరు ప్రేమతో, గౌరవంతో బ్రతకాలి. మొదట్లో దీన్ని కుటుంబంలో అలవరుచుకొని క్రమంగా ప్రపంచమంతా వ్యాపింపజెయ్యాలి. దిన పత్రికలు చదివితే ప్రపంచంలో హింసాకాండ, కలహాలు, మనమంతా ఒకటే అనే భావన లేకుండా చెలరేగుతున్నాయని మనకు తెలుస్తుంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది ఒకే బ్రహ్మన్. కానీ మనం స్వార్థ పూరితులమై, మన లాభం, మన కీర్తులకై ప్రాకులాడితే జీవైక్య సమానత గురించి తెలిసికోలేం. స్వార్థపరుడు ఎక్కడైతే వేర్వేరుగా చూస్తాడో, నిస్వార్థపరుడు అక్కడ తనతో పొత్తుగా నున్న లక్షణాలను చూస్తాడు.

బ్రహ్మన్ వ్యష్టిలో ఆత్మ అని చెప్పబడుతుంది. దాన్నే పురుషుడు అని కూడా అంటారు. పురుషుడు మనలని ఏకంగా చూస్తే, ప్రకృతి మనలని వివిధ రూపాలగా చూస్తుంది. మన భౌతిక, మానసిక పరిణామం ప్రకృతి వలన కలిగినది. మానవులలో కూడా వేర్వేరుగా పరిణామం చెందిన వారున్నారు. ఉదాహరణకు, డబ్బే ప్రపంచం అనుకునేవారు, ఈ మధ్యనే జంతువుల నుంచి పరిణామం చెందినవారు.

ఇంద్రియాల గూర్చి తెలిసినవారు వాటితో తాదాత్మ్యం చెందరు. మనం క్షణికమైన సుఖాలను ఆశించేవారిని విమర్శించనక్కరలేదు. వాళ్ళకే కొన్నాళ్ల తరువాత వాటి మీద వ్యామోహం తగ్గుతుంది. మనందరికీ ఒక ఉన్నతమైన లక్ష్యం చేరుకోవాలనే ఆకాంక్ష ఉ౦టుంది. మానవుడు చంద్రుని మీద కాలు వేసి, ఇప్పుడు గ్రహాల మీద అడుగెయ్యాలని తలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మనము దేశ కాల పరిమితిలోనే మనుగడ చెయ్యాలి. మనకి అపరిమితమైన ఆనందం, ప్రేమ, జ్ఞానం, పరుల సేవ కావాలి. ఆ లక్ష్యం చేరేవరకూ మనకు మనశ్శాంతి లేదు. ధ్యానం మొదలుపెట్టిన రోజు నుండీ, మన ఇంద్రియాలను నిగ్రహించి, ఇతరులను మనకన్నా ముఖ్యులుగా తలంచి, మనమా లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తాము.

ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మనకు ఎంతో ఓర్పు, సహనం కావాలి. అది ఇతరుల యందు మాత్రమే కాదు, మన యందు కూడా. ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు, మన గత చరిత్ర గుర్తుకు రావచ్చు. అది మనల్ని కృ౦గదీయవచ్చు. మనము ఎన్ని రోజులు, ఎంత శక్తి పనికి మాలిన పనులకై వృధా చేసేమో గుర్తుకు రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది మంచి లక్షణాలతో పాటు బలహీనతలను కూడా కలుపుకొని మనల్ని మనం చూసుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనలను పరీక్షించే ఘటనలు ఎన్నో ఉంటాయి. అవి మనలను శక్తిమంతులుగా చెయ్యడానికే. అందుకై మనకు ఎనలేని ఓర్పు, సహనం అవసరం. ఈ శ్లోకం చెప్పినట్లు మనందరికీ వేర్వేరు సంస్కారాలు, లక్షణాలు ఉన్నాయి.

మన సాధన మొదలుపెట్టే కేంద్రం ప్రకృతి మీద ఆధారపడి ఉంది. అలాగే మన వేగం మన చేత నిర్ణయింపబడినది. కొంత మంది ధ్యానం ముందు తమస్ తో బద్దకంగా ఉంటే, ధ్యానం అలవరుచుకున్న తరువాత రజస్ తో చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. వారికి అమితమైన ఉత్సాహం ఉండి సాధన ఆలావోకగా చేస్తారు. మరికొందరు డబ్బుకై ప్రాకులాడుతారు. అటువంటివారు వారి రజస్ ని ధ్యానం వైపు త్రిప్పుతే చాలా పురోభివృద్ధి సాధిస్తారు. ఇంకొంతమంది ఎలాగైతే ఒక తేనెటీగ పువ్వు నుంచి పువ్వుకి మారుతుందో, చంచలంగా ఉండి "ధ్యానం ఎందుకు? మంత్ర జపం అవసరమా?" అని ప్రశ్నిస్తారు. అటువంటివారు సమాధి ఎన్నటికీ పొందలేరు. ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికై ఉత్సాహం ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే అది మనస్సును ఏకం చేసి, దృష్టిని కేంద్రీకరించడానికి పనికి వస్తుంది.

మనం పరిణామంలో ఎంత వెనకబడి ఉన్నా భగవంతునిపై దృష్టి సారించవచ్చు. యోగుల్లో అనేక మంది పాపాలు చేసి, భగవంతుని దయవలన సంపూర్ణమైన వ్యక్తులుగా మారేరు. తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు: "ఒకడు స్వార్థ పూరితుడు, పాపపు జీవనం సాగించినవాడు, ఇతరులకు తీవ్ర దుఃఖం కలిగించినవాడు, అయి ఉండి నన్ను శరణు కోరినచో వానిని సంపూర్ణునిగా చేయుదును. ఎవ్వడైనా, వాని గత చరిత్ర ఎలా ఉన్నా, నన్ను హృదయ పూర్వకంగా సేవిస్తే, వానిని స్వతంత్రుని చేసి నాలో ఐక్యం చేసుకొంటాను" (9:31-2 )

మన గత చరిత్ర ఎలా ఉన్నా, ప్రస్తుతం మన కెన్ని బలహీనతలు ఉన్నా, ఆధ్యాత్మిక సాధన చేయవచ్చు. అది మనం నిర్ణయించుకున్న వేగంతో సాగవచ్చు. మనము ఒకరితో పోలిక పెట్టుకోనక్కరలేదు. ఎవరి స్తోమతను బట్టి వారు సాధన చెయ్యాలి. 193

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...