Bhagavat Gita
3.3
న కర్మణా మనారంభా నైష్కర్మ్య౦ పురుషో అశ్నుతే
{3.4}
న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమదిగచ్ఛతి
మనుజుడు కర్మలను చేయకపోవుట చేతనే నైష్కర్మ్యమును పొందజాలాడు. కర్మములను వదిలినంత మాత్రమునను మోక్షమును పొందనేరడు
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్
{3.5}
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్గుణైః
కర్మమును చేయక ఎవడును క్షణకాలమైనను ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతి వాడును పరవశుడై కర్మల నాచరించుచునే యున్నాడు
ఆధ్యాత్మిక జీవితమంటే కఠోర శ్రమ పడనక్కరలేదని కాదు. మనం ధ్యానం, మంత్ర జపం ఎంత చేసినా, రోజూ కొంత కర్మ చెయ్యనిదే ఆధ్యాత్మిక స్థితి రాదు. మనము అనేక గత జన్మల ఋణాను బంధంతో పుట్టేము. దానిని తీర్చాలంటే ఎంతో పరిశ్రమ చెయ్యాలి. కొంత మందికి పదవీ విరమణ తరువాత ఇక పనికై ఆఫీసుకి వెళ్ళనక్కర లేదు. అయినప్పటికీ వారు ఏదో ఒక కర్మ ఆనందంగా స్వీకరించాలి. అలా కాకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో దూరం వెళ్ళలేము.
మనస్సు ఉద్రిక్తతతో, ప్రేరేపణతో ఉంటే మన దృష్టిని కర్మపై కేంద్రీకరించడం ఉత్తమం. అయితే మనకిష్టం లేని పనిమీద దృష్టి కేంద్రీకరించడం కష్టమే. కొందరు కళాకారులు, సృజనాత్మకతతో కూడి ఉన్న పనులే చేస్తామంటారు. నిజానికి వారికి శ్రమ పడడం ఇష్టంలేదు. మనకిష్టంలేని పని చేస్తే మనస్సు పరిపరి విధాల పోతుంది. అది ఎలాగంటే ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ ఒక బొమ్మను౦చి ఉంకో బొమ్మకు మారుతూ ఉంటాడు. ఇక బొమ్మలు లేకపోతే ఏడ్వడం మొదలెడతాడు. నా ఉద్దేశంలో మనకిష్టంలేని పని చెయ్యడానికై కొంత ప్రయత్నం చెయ్యాలి. ఇష్టాయిష్టాలు మనలోనే ఉన్నాయి గానీ; అవి పనియొక్క లక్షణం కాదు. మనము దృష్టి పూర్తిగా కేంద్రీకరించ గలిగితే పని ఇష్టంగా చెయ్యచ్చు. అలా చేయలేకపోతే పని భారమనిపిస్తుంది.
మనం పనిమీద దృష్టి కేంద్రీకరించి చేసినా, అప్పుడప్పుడు మన దృష్టి మారుతూ ఉంటుంది. అప్పుడు "నేను కేంద్రీకరిస్తున్నానా, లేదా?" అనే సందిగ్ద౦లో పడతాం. ఇలా మనం అంతర్ముఖులమై ఉంటే దానివలన పని మీద దృష్టి చెడుతుంది. మనము ప్రయత్నపూర్వకంగా పనిమీద దృష్టి కేంద్రీకరించి, క్రమంగా మన ఆసక్తిని పెంపొందించుకోవాలి. ధ్యానం మాత్రం చేస్తేనే ధ్యానాన్ని లోతుగా అనుభవించలేం. ధ్యానంతో పాటు కొంత వ్యాయామం, క్రమశిక్షణతో పనులు చేయడం, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూడడం, తగినంత విశ్రాంతి అవసరం. ఈ విధంగా రాజ యోగాన్ని-- అనగా ధ్యానం -- కర్మ యోగాన్ని -- అనగా స్వార్థం లేకుండా పనుల చేయడం--కలిపి ఆచరించగలం.
గాంధీ మహాత్ముడు ఆధ్యాత్మిక జీవితమంటే స్తబ్దుగా ఉండడమనే అభిప్రాయాన్ని తుడిచివేశారు. ఆయన జీవితం నిస్వార్థ సేవ చేస్తూ, ఆధ్యాత్మిక సాధన చేయడమనే కౌశల్యం అందరికీ అందుబాటులో ఉందనడానికి తార్కాణం.
నైష్కర్మ్య -- అనగా కర్మ చెయ్యకుండా ఉండడం-- స్థితి శ్రీ రమణ మహర్షి లాంటి వారికే సాధ్యం. ఎవరైనప్పటికీ ఆయన వద్దకు సంశయాలతో వస్తే వారిని సంతృప్తి పరిచేవారు. ఆయనకు ప్రాపంచిక విషయాలతో సంబంధంలేదు. ఆయన ఎన్నడూ ఒక తప్పు పని చెయ్యలేదు. శ్రీ రామకృష్ణ లాగే చిన్న వయస్సులోనే జ్ఞానోదయం పొంది జీవితాంతం పరిశుద్ధుడుగా ఉన్నారు. కొందరు పాశ్చాత్యులు "మీకు ఉత్పాదకమైన జీవితం గడపాలని ఉండదా?" అని అడిగితే ఆయన నవ్వి ఊర్కొనేవారు. అలాగ ఆయన దైవత్వం ఎల్లలు దాటింది.
నైష్కర్మ్య అందరికీ ఇష్టమైనది. కానీ ఏ పనీ చేయక, మానవాళిని ఉద్దరించవచ్చనుకుంటే అది తప్పుడు ఆలోచన. అందుకే శ్రీకృష్ణుడు కర్మలు చేయకుండా ఆ స్థితిని పొందలేమని ఘంటాపథంగా చెప్తున్నాడు.
అర్జునుని సందేహం: "కాషాయం ధరించి, రుద్రాక్ష మాల వేసికొని, ఊరూరూ తిరుగుతూ, కీర్తనలు పాడుతూ, గుడిలో పడుకొని, బిచ్చమెత్తుకొని తిరిగితే అది నైష్కర్మ్య కాదా?"
శ్రీకృష్ణుడు న చ సన్న్యశానా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి అంటాడు. అనగా అన్నీ పరిత్యజిస్తేనే గాని సంపూర్ణత రాదనుకోవడం మిథ్య. మనం హిమాలయాల కెళ్ళి కొన్నేళ్ళు తపస్సు చేసినా నైష్కర్మ్య స్థితి పొందలేము.
కర్మ ఋణ విముక్తులమవ్వడానికి కూడా ఆచరించాలి. ప్రతి అణువులో నిక్షిప్తమైన చిత్రగుప్తుడు మన సత్కర్మలు, దుష్కర్మలు లెక్క పెడుతున్నాడు.
నేను ఒకమారు పరిశ్రమవేత్తలకు ధ్యానం మీద ఉపన్యాస మివ్వడానికి వెళ్ళేను. ఉపన్యాసం తరువాత భోజనాల కార్యక్రమం మొదలయింది. నేను శాఖాహారినని తెలిసి "మీరు పాశ్చాత్య దేశాలన్నీ తిరిగి ఇంకా శాఖాహారమే తింటున్నారా?" అని అడిగేరు. నేను ఒక్కడినే కాదు; నా మిత్రులను కూడా శాఖాహారులను చేసేను అని చెప్పేను. ఒక క్రిస్టియన్ "బహుశా కర్మ సిద్ధాంతం హిందువులకు, భౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. క్రిస్టియన్ లకు వర్తించదేమో" అని అడిగేరు. అలా అయితే నేను హర్షించేవాడిని. కానీ జీసస్ "నువ్వు ఏ విత్తు నాటితే, ఆ పంట పొందుతావు" అని చెప్పెను. ఇతరులకు కష్టనష్టాలు కలిగిస్తే మనకూ అవే కలుగుతాయి. అలా కాక ఆనందం పంచిపెడితే మనమూ సుఖాలనుభవిస్తాము.
సుఖదుఃఖాలు, ఆనందవిషాదాలు మనం చేసికొన్న కర్మలవలననే అని తెలిసికోవడం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మనలో అనేకమంది "నా తలిదండ్రులు నన్నిలా చేసేరు; నా సహధర్మచారిణి, పిల్లలు, సమాజం నన్నిలా చేసేరు" అని అంటారు. అది కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం. మనమే పరిస్థితుల్లో, ఏ దేశంలో బ్రతుకుతున్నా మనకో ఎన్నిక ఉన్నది: నా లాభానికై, ఆహ్లాదానికై పనిచేయాలా లేదా పరుల ఆనందానికై, మేలుకై పాటుపడాలా?