Bhagavat Gita
3.4
కర్మే౦ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
{3.6}
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే
కర్మే౦ద్రియములను వశపరచుకొని మనస్సుతో శబ్దాది విషయములను చింతించు అవివేకి కపటవర్తుడని పిలువ బడుచున్నాడు
నేనొకమారు ఆలీ అక్బర్ ఖాన్ సరోద్ కచేరికి వెళ్ళ దలిచాను. దానికై రెండు రోజులు ముందునుంచీ నా మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా నా మనస్సు కచేరి వైపు మళ్ళిపోయేది. అతి కష్టంతో నా మనస్సును అదుపులో పెట్టుకున్నాను. అందువలన కచేరీపై పూర్తిగా కేంద్రీకరించి ఆనందించేను.
మనం మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించే సాధాన చేయలేదంటే శ్రీకృష్ణుడు మనల్ని మిథ్యాచార -- అనగా కపటి -- అంటాడు. ముఖ్యంగా సాధన మొదట్లో ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యాలి. అది క్రొత్తలో సాధ్యం కాదు. కానీ పట్టువదలకుండా ప్రయత్నిస్తే సాధ్యమవ్వచ్చు.
అటు తరువాత మనం ధ్యానంలో పరిపక్వమౌతే, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఉదాహరణకు మనము ధ్యానము చేసి ఇంద్రియాలు స్వాధీనంలో ఉన్నాయనే సంతృప్తితో బయటకు వస్తే, మళ్ళీ ప్రాపంచిక విషయాలలో మునిగి ఇంద్రియాలపై స్వాధీనం తప్పుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులు మన ధ్యాన పరిపక్వతకు పరీక్ష పెడతాయి. యోగుల జీవిత చరిత్ర చూస్తే మనకు తెలిసేది: మన ఆలోచనలను, మనస్సును ఎంత స్వాధీనంలో ఉంచుకొంటే, పరీక్ష అంత తీవ్రంగా ఉంటుంది. నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఉన్నత విద్యార్థులకు పరీక్ష పెట్టేవాడిని. అప్పుడు వేరొక విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుని నియమించి, వారి చేత బాహ్య విషయాల గూర్చి పరీక్ష పెట్టమనేవాడిని. నేను అంతర్గత విషయాలను పరీక్షించేవాడిని. ఈ విధంగా ధ్యానంలో అనేక పరీక్షలు ఉంటాయి. కాముడు బాహ్య విషయాలపై పరీక్ష పెడితే, మనలో ప్రతిష్ఠితమైన దేవుడు అంతర్గతుడై పరీక్షిస్తాడు. ఈ రెండూ నెగ్గితే మనమెవరమో తెలిసికోవచ్చు.