Bhagavat Gita
4.11
చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
{4.13}
తస్య కర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్
గుణములను బట్టియి, కర్మములను బట్టి నాలుగు వర్ణముల వారిని నేనే సృజించితిని. నేను వాటికి కర్తనయినను నన్ను అవ్యయునిగ, అకర్తునిగ గ్రహింపుము ఀ
త్రిగుణాల -- సత్త్వ, రజస్, తమస్ -- వేర్వేరు పరిమాణాల వలన మనలో తేడాలుంటాయి. ఉదాహరణకు మన బొటన వేలు, చూపుడువేలు వేర్వేరు. అలాగే చిటికిన వేలు. కానీ ఆ వేళ్ళకు ఆధారమైన అరచేయి ఒకటే.
మన తేడాలు పైపైనే. ధ్యానమాచరించి, మన దృష్టిని అంతర్ముఖం చేస్తే మెహర్ బాబా చెప్పినట్లు "నీవు, నేను, మనము కాదు; నీవు, నేను, ఒక్కటే".
అన్నిటికన్నా నీచమైన గుణం తమస్. తామసికుడు "ఎవరికోసం కర్మ చెయ్యాలి? సమాజం నుంచి వేరైపోతే పోలే? నా రాజ భవనం లాంటి ఇంట్లో కాలంగడిపేస్తే, ఇతరులతో పొత్తులు నాకెందుకు?" అని అనుకొంటాడు. కొందరు సమాజం నుండి వేర్పడి, ప్రపంచాన్ని పట్టించుకోక పోతే, ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుందని భావిస్తారు. అది గీత ఒప్పుకోదు. ఒక రాయి లేదా చెట్టు స్పందించక పోతే ఫరవాలేదు. ఎందుకంటే అది వాటి సహజ గుణం. కానీ మనుష్యులమైన మనం మానవాళి ఎదుర్కొనే సవాళ్లను స్వీకరించి, వాటికి తగిన పరిష్కారం వెదకాలి. శ్రీకృష్ణుడు (3:12) ఇలా చెప్పేడు: ఎవడైతే వేర్పాటుతో, ప్రపంచ సమస్యలను పట్టించుకోడో, వాడు స్తేన -- అనగా దొంగ. గీత నిస్వార్థ౦తో మన కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి పరోపకారము చేయమంటుంది.
నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు విద్యార్థులు పెద్ద పరీక్షలు జరిగే ముందు దేవుని ఎక్కువగా పూజి౦చేవారు. వారు గుళ్ళలో దేవునికి -- ముఖ్యంగా విఘ్నాలను తీసివేసే విఘ్నేశ్వరునికి -- కొబ్బరికాయలు కొట్టేవారు. ఎందుకంటే సంవత్సరం పొడుగునా వారు చదువును వాయిదా వేసి జాప్యం చేసేరు. ఇదే తామసికుని లక్షణం.
మనకెప్పుడైతే ఒక పనిని వాయిదా వేద్దామని అనిపిస్తుందో, అది ఇంటి పనైనా లేదా ఆఫీసు పనైనా, అప్పుడు నడుం బిగించి చెయ్యాలి. మనకిష్టం లేని పనిని వెంటనే చెయ్యాలి. మన కిష్టమైన పనులు నెమ్మదిగా చెయ్యవచ్చు.
నేను ఇవ్వగలిగిన సలహా: మీకు ఒక పని చేయడానికి బద్దకంగా ఉంటే, దీర్ఘంగా మంత్రం జపిస్తూ నడవండి. అది మన దృక్పథాన్ని ఒక గంటలో మార్చేస్తుంది. ఒక గుర్రం లాగ మనం పని వైపు దూసుకు వెళ్ళాలి. ఈ విధంగా రక్త ప్రసరణ జరిగితే, ఊపిరి తిత్తులు ఎక్కువగా పని చేస్తే, మంత్రం చేతన మనస్సులో ప్రతిధ్వనిస్తుంటే, మనలో ఎనలేని మార్పు వస్తుంది. దానివలన మనలో ఒకపని ఎన్నటికీ చేయలేమనే భావన లేకుండా పోతుంది. ఒక గొప్ప కార్యక్రమానికి ముందు -- ఉదాహరణకు ఉపన్యాసం ఇవ్వాలంటే-- మంత్రం జపిస్తూ దీర్ఘమైన నడకకు వెళ్ళండి.
మన శరీరము ఒక యంత్రము లాంటిది. కానీ నేటికాలంలో దాని సహజ గుణాన్ని మర్చిపోయేం. మనము ఉదయం లేచి౦దగ్గరనుంచీ ఇంట్లో, ఆఫీసులో, వాహనంలో కూర్చొని మన గుండెకు తగినంత పని ఇవ్వము. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే: మితంగా తిని, పోషకాహారాన్నే తిని, ఆకలి వేసినప్పుడే తిని, వీలయినప్పుడల్లా మంత్రాన్ని జపిస్తూ వ్యాయామం చెయ్యాలి.
తమస్ ని రజస్ గా మార్చుకోవాలంటే చురుగ్గా ఉండాలి. అలాగే రజస్ ని సత్త్వ గుణంగా మార్చుకోవాలంటే నిస్వార్థంగా ఇతరులకు మేలు చెయ్యాలి. మన అశాంతిని, శక్తిని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు కేంద్రీకరించాలి. అశాంతిగా ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ, చేతన మనస్సు లోతులకు వెళ్ళాలి.
నిర్మలంగా, ప్రశాంతంగా, వైరాగ్యంగా ఉండడం వలన సత్త్వ గుణము అబ్బుతుంది. నేటికాలంలో ఇది చలా అవసరం. సత్త్వ గుణమున్నవారు ఎక్కువ పనిచేసినా, అది వారికొరకై కాక, పరుల సేవనార్థము. కానీ సాత్త్వికుడు కర్మఫలాన్ని ఆశిస్తాడు. కాబట్టి సత్త్వ దగ్గరే ఆగిపోకూడదు. మన జీవిత లక్ష్యం, అన్ని మతగ్రంథాలూ చెప్పేవి, మన౦దరిలోన ప్రతిష్ఠితమైన దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడం. క్రైస్ట్, బుద్ధుడు, గాంధీజీ త్రిగుణాతీతులు. మహాత్మా గాంధీ దేశాకాలమానాలకి అతీతమై మనల్ని ప్రభావితం చేసేరు.
గీత చెప్పేది: అందరికన్నా నీచమైన వారు దేన్నీ పట్టించుకోరు. వారికన్నా ఉన్నతమైన వారు తమ స్వార్థానికై పనిచేస్తారు. మరింత ఉన్నతమైనవారు నిస్వార్థంగా పరులను సేవిస్తారు. అందరికన్నా ఉత్తమమైన వారు జీవైక్య సమానతను తెలిసికొన్నవారు. ఆధ్యాత్మిక పరిణామమే మన వర్ణ వ్యవస్థకు మూలం. సనాతన౦గా ఒక వర్ణంలో పుట్టినవాడు కర్మల వలన వేరొక వర్ణమును పొందవచ్చును. కానీ నేటి కాలంలో వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థగా మార్చేరు. అంటే పుట్టుకతోనే కులాన్ని అపాదించి మరణించేవారకూ అదే కులమని శాసించేరు. అందువలన దేశం అనేక విధాలుగా వెనుకబడింది. గాంధీజీ కుల వ్యవస్థను అహింసతో ఎదుర్కొన్నారు. కాబట్టి అది కొంచెం క్షీణించింది.
నేను అమెరికాలో పలుచోట్ల కుల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొన్నాను. నేను చూసిన ప్రతి దేశంలోనూ కుల వ్యవస్థ ఉంది. కాకపోతే వారు దేశం, మతం, ఆస్తి, జాతి, రంగు, చదువు మొదలైన అంశాలను తెలిసికొని దాని ప్రకారం విచక్షణ చేసి, వారిని వాడుకొంటారు. మన దేశంలో, ఐరోపాలో, ఆఫ్రికాలో, అమెరికాలో వేర్వేరు కులవ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడైతే ప్రజలు దేవుడు మనందరిలోనూ ఉన్నాడని తలంపక ఇతరులను ప్రేమతో, గౌరవంతో చూడక ఉంటారో, అక్కడ కుల వ్యవస్థ పాతుకు పోయి ఉంటుంది. 239
No comments:
Post a Comment