Bhagavat Gita
4.18
యదృస్చా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
{4.22}
సమ సిద్ధావ సిద్ధౌచ కృత్యాపి న నియధ్యతే
లభించిన దానితో తృప్తి చెందువాడును, ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, జయాపజయములందు సమబుద్ధి గలవాడును అగు మనుజుడు కర్మలను నాచరించినను బంధింపబడడు
జీవితము ద్వంద్వాలతో కూడినది: వెలుగు-చీకటి, ఆనందం-బాధ, పొగడ్త-తిట్టు, జయం-అపజయం మొదలగునవి. ఇవి అన్నీ కలిసి వస్తాయి. అంటే ఎప్పటికీ పొగడ్తలే వినం. అప్పుడప్పుడు తిట్లు కూడా భరించాలి.
మనని ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆందోళన చెందనక్కరలేదు. ఎందుకంటే మనం స్వతంత్రంగా, విలేఖరులు మొదలగు వారి బెడద లేకుండా, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అలాగే మనంఎవరి పొగడ్తలకోసమై ఎదురుచూడనక్కరలేదు. ఇదే నిజమైన యోగుల పద్దతి. ఎందుకంటే పొగడ్తలు, మన్నన, భద్రత మనలోనే ఉన్నాయి.
సర్కస్ లో విన్యాసాలు చేసేవారు, క్రీడలలో ప్రసిద్ధి పొందిన వారు, ఒక్క రోజులో తమ కౌశల్యం పొందలేదు. దాని వెనుక తీవ్రమైన కృషి ఉంది. అలాగే ధ్యానం కూడా. మనలో కొందరు సున్నితమైన స్వభావమున్నవారు పొగడ్త, మన్నన పొందకపోతే చాలా బాధపడతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసింది దేవుడు మనలనెన్నడూ తిరస్కరించడు. అదొక్కటే చాలు మనమన్ని తిరస్కారాలని సహించడానికి.
గీత చెప్పేది ద్వంద్వాలతో ప్రపంచాన్ని చూస్తే సృష్టిలోని ఏకత్వాన్ని చూడలేం. మన బుద్ధి ద్వంద్వాలతోటే పనిచేస్తుంది. దాని పని విభజించడం, వర్గీకరించడం, క్రమంలో పెట్టడం. అది అలా పనిచేయకపోతే మనం మనుష్యులము కామని కొందరంటారు. రమణ మహర్షి తన అనుచరులకు సుఖదుఃఖాలకు అతీతంగా ఉండండి అని చెప్పడంలో అంతరార్ధం వాటిని పట్టించుకోకుండా ఉండమని కాదు; వాటిని దాటి ఊహాతీతమైన ఆనందం పొందమని.
శ్రీకృష్ణుడు విమత్సర -- అనగా పోటీ పడకుండుట -- అనే విశేషణము వాడేడు. కొందరు స్పర్థయా వర్ధతే విద్యా అంటారు. పోటీ లేనిదే ఏమీ సాధించలేమనే భావన చాలా మందిలో ఉంది. మనము పరోపకార౦ చేసి, కుటుంబాన్నీ, సమాజాన్ని, దేశాన్నీ, ప్రపంచాన్నీ ప్రభావితం చేసే దిశలో నడవాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం నిజంగా దేవునిగురించి తెలిసికోవాలని, ఆయనలో ఐక్యం అవ్వాలని అనుకొంటే, మన స్వార్థం వదిలిపెట్టి, పరుల ఆనందానికై పాటు పడాలి.
విమత్సరము లేనందువలన కొందరు ఇతరులతో పోలిక పెట్టుకొన్ని, వారికన్న ఎక్కువ స్థాయిలో ఉండాలని పోటీ పడతారు. దేవుడు మనందరినీ అద్వితీయంగా ఉండమని సృష్టించేడు. కాబట్టి మన మార్గంలో మనము సుస్థిరంగా ఉండాలి. ఒక పాశ్చాత్య దేశస్తునికి గురువు ఇచ్చిన నామము అతులానంద. దాని అర్థం: మనుష్యులలో పోలికలు చూడక, అబేధంగా ఉండేవాడు. అదే విధంగా కాళిదాస శాకుంతల్యం లో అనసూయ అనే పాత్ర ఉంది. దాని అర్థం: ఎప్పటికీ అసూయ లేనిది. అలా ఉండేవారు చాలా అరుదు. మనందరి విలువ మనలో ప్రతిష్ఠితమైన దేవుని వలన కలిగింది కానీ, పోటీ పరీక్షలలో గెలిచినందు వలన కాదు.
సమః సిద్ధౌ అసిద్ధౌ చ: సిద్ధ అనగా విజయం; అసిద్ధ అనగా అపజయం. శ్రీకృష్ణుడు తనను నిజంగా ప్రేమించినవాడు జయాపజయాలలో సమంగా ఉంటాడని అంటున్నాడు. నాకు తెలిసి అపజయంలో ఉద్రేకము చెందకుండా ఉండవచ్చు. కానీ విజయం కలిగినప్పుడు అందరికీ ఆ వార్త చెప్పాలనే అభిలాష ఉంటుంది. కొందరు నడిమంత్రపు సిరి కలిగినప్పుడు గానీ, పేరు ప్రఖ్యాతలు గడించినప్పుడు గానీ, తమ బాల్య మిత్రులకు స్వస్తి చెప్పి, క్రొత్త ఊరు, క్రొత్త మిత్రులను ఎంచుకొంటారు. అదే ఆధ్యాత్మిక మార్గంలో విజయుడైనవాడు తన బాల్య మిత్రుల వద్దకు వెళ్ళి "మీవలన నేను చాలా తెలిసికొన్నాను. నేను మీకు ఎంతో ఋణపడి ఉన్నాను. ఇప్పుడు మీరంతా నాతో విజయాన్ని పంచుకోండి" అంటాడు. మనమెంత ఎత్తుకు ఎదిగినా మనకన్నా దురదృష్టవంతులను మరచిపోకూడదు. ఇతరులు మనని పొగిడినా, తిట్టినా, నిరసించినా, ద్వేషించినా మన శాంతాన్ని, భద్రతని కోల్పోక, దేవుడు మనలో ప్రతిష్ఠుతుడయి ఉన్నాడని తలంచి ఉపశమనం పొందాలి. 263
No comments:
Post a Comment