Bhagavat Gita
4.28
యాథైధాంసి సమిద్ధో అగ్ని ర్భస్మసా త్కురుతే అర్జున
{4.37}
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా
అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను భస్మము చేయునట్లు, జ్ఞానమనెడి అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
{4.38}
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి
జ్ఞానముతో సమమైనది, పవిత్రమైనది ఈ లోకమున మరొకటి లేదు. ఈ జ్ఞానమును పొందినవాడు కాలక్రమమున తన ఆత్మనుండే దానిని పొందుచున్నాడు
శ్రీకృష్ణుడు మనము గతంలో ఎంత హీనమైన కర్మలు, ఇతరులను బాధించి, చేసినా, జ్ఞానం వాటిని తుడిచిపెట్టేస్తుందని చెప్తున్నాడు. గతం గురించి విచారించకూడదు. దాని వలన ఒత్తిడి కలిగించుకోకూడదు. మనము మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరడానికై మన దృష్టిని కేంద్రీకరిస్తే, పాత తప్పులు మన మార్గానికి అడ్డురావు.
జ్ఞానం పొందాలంటే నాకు ధ్యానంతప్ప వేరే ఉత్తమమైన మార్గం తెలీదు. అన్ని మతాలలోనూ ధ్యానం ఒక్కటే దేవుని చేర్చే మార్గం, నిచ్చెన అని అంటారు. ధ్యానం బదులు ఇంద్రియ నిగ్రహం, పరోపకారం అదే దిశలో ఉండవచ్చు. వాటిని పొందుటకై ధ్యానం మొదలపెట్టకపోయినా అవి కలిసి వస్తాయి.
ధ్యానానికి శాఖాహారం ఎంతో అవసరం. మన తోటి జీవులను హింసించి మన పొట్ట నింపుకోవడం తప్పు. ధ్యానం గాఢమవుతున్నప్పుడు మిగతా జీవుల దృక్పథాన్ని అర్థంచేసికొనే జ్ఞానం వస్తుంది. శాస్త్రజ్ఞులు చెట్లు, చేమలు వంటి ప్రకృతి వనరులను సమంగా ఉపయోగించాలని హెచ్చరిస్తునారు. గాంధీజీ పూల మాలలను నిరాకరించేవారు. ఆయన దృష్టిలో పూలు మొక్కల మీద ఉంటేనే వాటి అందం.
ప్రకృతితో, జీవులతో సమంగా ఉండడంతో పాటు మన బంధు మిత్రులయందు కూడా సమంగా ఉండాలి. చెట్లు, జీవులు మాట్లాడవు. వాటి బాధను చెప్పుకోలేవు. అవి మూగ జీవులు. కానీ మనం ఒక వ్యక్తిని పలకరించి "ఇప్పుడు నేను చెప్పేది విను" అంటాం. అతడు స్పందించి "మొదట నేను చెప్పేది విను" అని అనవచ్చు. అలాటప్పుడు మనం సహనం పాటించాలి. మన చుట్టూ ఓర్పు లేని వ్యక్తులు లేకపోతే మనం సహనం ఎలా నేర్చుకుంటాం? మనకైతే "నిశ్శబ్దంగా ఉండు" అని చెప్పడం ఉత్తమమనిపిస్తుంది. కొందరికి లేదు, వద్దు అనే పదాలు నచ్చవు. మన మనస్సును శుద్ధి చేసికొని, సహనం అలవరచుకొని, మనలోని, ఇతరులలోనూ, ప్రతిష్ఠితమైన దేవుని దర్శించవచ్చు. 288
No comments:
Post a Comment