Bhagavat Gita
5.11
బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా విందత్యాత్మని య సుఖమ్
{5.21}
స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే
బాహ్య విషయములందు ఆసక్తి లేనివాడై, ఆత్మసుఖము ననుభవించెడి బ్రహ్మవిదుడు నాశరహితమైన బ్రహ్మపదమును పొందును
మన మనస్సును సమంగా ఉంచి, ద్వంద్వాలను -- సుఖదుఃఖాలు, మిత్రుత్వం-శతృత్వం మొదలైనవి -- అతిక్రమించి, అందరినీ గౌరవంతో, ప్రేమతో చూసుకోగలుగుతే, మనలోని దైవత్వమును అవగాహన చేసికొన్నట్టే. అప్పుడు మన ప్రేమ అందరిలోనూ, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రసరింప బడుతుంది. ఇదే నిజమైన ప్రేమ అంటే. సెయింట్ బెర్నార్డ్ ఇలా చెప్పేరు: "ప్రేమకు తను తప్ప వేరే కారణము లేదు, ఫలము లేదు. అది దాని ఫలమై, దాని ఆనందానికై ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నాకు ప్రేమ ఉంది గనుక. నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నాకు ప్రేమించడం వచ్చు కనుక." మనము ప్రతిఫలము నాశి౦చి ప్రేమిస్తే, అది నిజమైన ప్రేమ కాదు.
మనము జీవులన్నిటినీ ప్రేమిస్తే, వాటి క్షేమానికై పాటు పడితే, దానికి కావలసిన శక్తి మనలోనే ఉత్పన్నమౌతుంది. ఇతరులనుండి ప్రేమ ఆశిస్తే, మనము వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. అలాకాక హృదయపూర్వకంగా, ఎటువంటి ప్రత్యుపకారము ఆశించకుండా ప్రేమిస్తే మనము స్వతంత్రులము. మనలో ప్రతిష్ఠితమైన భగవంతుని మీద సంపూర్ణముగా ఆధారపడితే, ఇతరుల సహాయ౦ అవసరం లేదు. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం, భద్రత కలుగుతాయి.
స్వతంత్రము లేకపోతే మనము భౌతిక వనరులను కూడా సమంగా ఉపయోగించలేము. వాటిని సమంగా ఉపయోగించాలంటే వాటిపై వైరాగ్యం ఉండాలి. ఉదాహరణకి డబ్బు, దస్కం పై వైరాగ్యం లేకపోతే వాటితో తాదాత్మ్యం చెంది జీవితమంతా వాటి వెంట బడతాం. డబ్బు వెంట పడకపోతే సంపూర్ణమైన సంతృప్తి పొందుతాము. ఇల్లు, వాహనము, వీణ సమంగా ఉపయోగించాలంటే వాటిపై కొంత వైరాగ్యం అవసరం. ఉదాహరణకి: వీణతో తాదాత్మ్యం చెందితే, ఆఫీసు మీద లేదా పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించ లేక, సదా వీణే గుర్తుకొస్తుంది.
శ్రీకృష్ణుడు చెప్పే బోధ: మీరు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలంటే బయట వస్తువులపై ఆధారపడక, నిత్యం ధ్యానం చేసి, మీలోని దైవం మీద దృష్టి కేంద్రీకరించాలి. మొదట్లో ధ్యానం చేతన మనస్సును దాట లేక కష్ట మనిపిస్తుంది. చేతన మనస్సు లోతులకు వెళ్ళ గలిగితేగాని, శాంతి కలుగదు. మన నాడీ వ్యవస్తను సమం చేసికొని ధ్యానం చేస్తే , అఖండమైన శాంతిని పొందుతాము. 324
No comments:
Post a Comment