Bhagavat Gita
5.2
జ్ఞేయ స్స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి
{5.3}
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధా త్ర్సముచ్యతే
అర్జునా! దేనిని ద్వేషించని వాడు, దేనిని కోరనివాడు నిత్య సన్యాసి యని తెలియదగి యున్నాడు. ద్వంద్వములను విడిచిన అతడు సుఖముగ బంధము నుండి విడిపడుచున్నాడు
సన్యాస మంటే హిమాలయాల్లోకో, అడవుల్లోకో వెళ్ళి నివసించడం అనుకుంటాం. శ్రీకృష్ణుడు అలాగ మనల్ని సన్యాసాన్ని పుచ్చుకోమని పురమాయించడం లేదు. సాధారుణులైన మనకు సన్యాసమంటే అహంకారం, స్వార్థం, వేర్పాటు, ఏవైతే ఆధ్యాత్మిక సాధానకి అడ్డుగా వస్తాయో, వాటిని విసర్జించడం.
పనస పండు కోసి, తినే వాళ్ళకు దానిలోని జిగటను గూర్చి తెలుసు. చేతులకి నూనె రాసుకుంటే తప్ప పనస తొనలను వేరుచేయలేం. అలాగే మనం ఇతరులను ప్రేమించి; కుటుంబంలో, సమాజంలో నిస్వార్థంగా బ్రతికి ఆనందాన్ని పొందాలంటే, సన్యాసమనే నూనెతో అహంకారమనే జిగటను తొలగించుకోవాలి.
మనందరికీ అమితమైన ప్రేమ ఉంది. దూరానికెక్కడకో పోయి ప్రేమించడం నేర్చుకోనక్కరలేదు. ప్రేమ మన గుండెల్లోనే ఉంది. దాన్ని నిరోధించి; మన ఇంటిని, సంఘాన్ని ఆనంద సాగరంలో ముంచక ఉన్నది అహంకారం అనే జిగట.
మనం అహంకారాన్ని జయించి, మనస్సును నిర్మలంగా ఉంచుకొని, వేర్పాటు లేకుండా ఉన్నామని ఎలా నిరూపిస్తాం? శ్రీకృష్ణుడు నిర్ద్వంద్వ౦గా ఉన్నప్పుడు అని సమాధాన మిస్తాడు. అంటే మనము మంచి-చెడు, తప్పు-ఒప్పు, జయం-అపజయం, పుట్టుకు-మరణం అనే ద్వంద్వాలకు అతీతమైనప్పుడు అని అర్థం. ఎంతకాలం మనము ఇష్టాయిష్టాలు అనే నియంతలకు లోబడి ఉంటామో, ఉల్లాసాన్ని సదా కోరి, ఉల్లాసం లేనివాటికి దూరంగా ఉంటామో, అంతకాలం మనస్సు అల్లకల్లోలమై ఉంటుంది.
నా మామయ్య కుటుంబానికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు నా అమ్మమ్మ అందరికీ సమ్మతంలేని పెళ్లి చేసికోవద్దని సలహా ఇచ్చింది. పెళ్ళయిన తరువాత కుటుంబ సభ్యులెవ్వరూ వారిని పలకరించలేదు. అప్పుడు నా అమ్మమ్మ వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. స్వతంత్రత భావాల్లో కూడా ఉండాలి. అప్పుడప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రతిఘటించాలనే భావన మనకుంటుంది. కానీ మనం నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే, నిర్ణయాన్ని పునః పరిశీలిస్తే భావనను మార్చుకుంటాం. సహజంగా ఇలా చెయ్యగలిగేవారు అరుదు. కానీ ధ్యానంతో మన ఇష్టాయిష్టాలను మార్చుకోవచ్చు.
దైనింద జీవితంలో ఇష్టాయిష్టాలకు అతీతంగా బ్రతకడం మన సమస్య. బంధు మిత్రులతో కలిసి ఉన్నామంటే అది సాధ్యం. ఎందుకంటే వారిని మనకన్నా ముఖ్యులని తలచడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అర్జునునికి అన్నదమ్ములు ఉన్నారు. వారితో కలిసి ఉండడంవలన ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండే అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆహారం, వినోదం, సుఖాలు, తదితర విషయాలలో ఇతరులను మనకన్నా ముఖ్యులని తలంచడం మంచిది. ఉదాహరణకి మనము, మిత్రుడితో సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మనం చూద్దామనుకొన్న సినిమా గురించి చాలా విన్నాం, చదివేం. కానీ మన మిత్రుడు వేరే సినిమాకి వెళ్దాం అని అన్నాడు. మనం అనుకున్న సినిమాకే వెళ్లాలని పేచీ పెట్టడానికి అనేక కారణాలు ఉండచ్చు. కానీ సర్దుకు పోయి మన మిత్రుడు కోరిన సినిమాకే వెళ్తాం. ఇదే ఆధ్యాత్మిక సాధన వలన కలిగే సమైక్యత. 301
No comments:
Post a Comment