Bhagavat Gita
6.1
శ్రీ భగవానువాచ:
{6.1}
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
స సన్న్యాసీ చ యోగీ చ స విరగ్నిర్న చా క్రియః
తాను చేయవలసిన కర్మను ఫలాపేక్ష లేకుండా చేయువాడే నిజమైన సన్యాసి. అతడే నిజమైన యోగి. అగ్నిహోత్రాలు విడిచినంత మాత్రాన సన్యాసి కాడు. కర్మలు చేయనంత మాత్రమున యోగికాడు
గీత మనకు మూడు మార్గాలు చూపుతుంది: కర్మ యోగం, జ్ఞాన యోగం మరియు భక్తి యోగం. ఇవి అన్నీ ధ్యానంలో కలిసి వస్తాయి.
కర్మ యోగం చాలామంది అనుసరిస్తారు. మొదట్లో ఎంతో ఉత్సాహంతో, చాకచక్యంతో కర్మలు చేసి, అటు తరువాత వాటి వలన లాభము ఆశిస్తారు. నిజమైన కర్మ యోగం దానికి విరుద్ధం. డబ్బు, దస్కం, పేరు ప్రఖ్యాతులు కర్మ వలన సాధ్యమే కాని, అవి స్వలాభానికై చేస్తే కర్మ యోగం అనిపించుకోదు. అందుకే కర్మ యోగంలో లక్ష్యం చేరడం కష్టం. గాంధీజీ వంటి వారు నిజమైన కర్మ యోగులు. వారు జీవితాంతం ప్రజా సేవ చేసి, తమకు ఏమి మిగిలింది అని విచారించలేదు. మనమంత ఎత్తు ఎదగాలంటే చాలా సాధన అవసరం. ముఖ్యంగా నిస్వార్థ సేవ వలన కొంత వెసులుబాటు ఉంటుంది. దానికి ధ్యానం చెయ్యడం తప్ప, వేరే మార్గం లేదు.
రెండవది జ్ఞాన యోగం. అది మరింత కష్ట సాధ్యం. ఇక్కడ జ్ఞానమంటే కూటి కోసమై కోటి విద్యలు అనబడే శాస్త్రీయ జ్ఞానం కాదు. ఉదాహరణకి ఎవడైతే ద్రష్ట, దృక్కు, దృశ్యాలకు అతీతంగా ఉంటాడో వాడు జ్ఞాన యోగి అనబడతాడు. అంటే వానిలో బుద్ధికి అందిన జ్ఞానము (intellectual knowledge) ఒక్కటే కాక ఊహా జ్ఞానము (intuitive knowledge) సహజంగా ఉంటుంది. రమణ మహర్షి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మొదలగువారికి అట్టి యోగం సహజ సిద్ధంగా వచ్చింది. మనలో చాలామందికి మూడవదైన భక్తి యోగం సులభ సాధ్యము.
ప్రేమ అనే భావన గూర్చి చదవడం, వ్రాయడం సులభమైనా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉందంటే, వారు తమ సుఖాన్ని తక్కువగా చూసుకొని తన భాగస్వామికి ఎక్కువ ఇవ్వాలి. క్రమంగా ఆ భావన బంధుమిత్రులయందు, కుటుంబము యందు, సమాజము యందు, చివరకు మానవాళి యందు కలిగి ఉండాలి. ఒకరు నాటక ఫక్కీలో ప్రేమ గురించి చెప్పవచ్చు. కానీ వారు అనేక విమర్శలు ఎదుర్కొన వలసి వస్తుంది. అదేపనిగా విమర్శ తరువాత విమర్శ వస్తే ఒక్కొక్కపుడు మానసిక క్లేశ మనుభవించి, మానసికంగా తట్టుకోలేని స్థితి రావచ్చు. అప్పుడు ధ్యానం వలన వానిలో సహనం కలిగి, విమర్శలను ఆనందంగా, అప్రయత్నంగా స్వీకరిస్తాడు.
నాకు భావి తరం కేవలం వస్తు సేకరణే జీవిత లక్ష్యమనుకోదని గట్టి నమ్మకం ఉంది. అంటే వారు తమ కోర్కెలను నియంత్రించుకోగలరు. అదే వైరాగ్యం కూడా. కానీ అంతటితో ఆగి పోక తమ అహంకారాన్ని యందు కూడా వైరాగ్యం పొందాలి. కొందరికి పటిష్టమైన భావాలు ఉంటాయి. వాటిని వారు అమ్మలేరు, ఇతరులు కొనలేరు. కానీ అవి అలాగే చలామణీ అవుతాయి.
మనల్ని ఇతరులు అపహాస్యం చేసినా, లేదా మనపై నింద వేసినా, మన మనస్సు ఆందోళన చెందకుండా వుండాలంటే ధ్యానం ఎంతో అవసరం. ముఖ్యంగా అనుబంధాలలో భావ వ్యక్తీకరణం వలన సహజంగా రాపిడి, ఒత్తిడి, సమస్యలు కలుగుతాయి. ఎవరైతే ఏకాకిగా ఉంటారో, వారికి కుటుంబంవలన కలిగే ఆనందాన్ని పొందక -- అంటే జీవితంలో ఇచ్చిపుచ్చుకోడాలు చేయక -- జీవైక్య సమానత గురించి తెలిసికోలేరు. కుటుంబంతోనైనా లేదా మిత్రులతోనైనా సహజీవనం చేస్తూ, ఇతరులను మనకన్నా ఎక్కువగా చూసుకొంటే, మన ఆనందానికి అవధులు లేక ఉంటుంది. ఈ విధంగా ఏకీకరించే యోగంలో, నిస్వార్థ కర్మ, జ్ఞాన సముపార్జన, ప్రేమ లకు గుర్తింపు వస్తుంది. అవి పొందడానికి ధ్యానం ఎంతో సహకరిస్తుంది. 336
No comments:
Post a Comment