Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 7

Bhagavat Gita

6.7

సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు {6.9}

సాధుష్యపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే

సుహృత్తులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సాధువులు, పాపులు మొదలగు వారియందు సమబుద్ధి గలవాడు శ్రేష్ఠుడు

సమబుద్ధి అనే విశేషణానికి అర్థం అందరియందు సమమైన దృష్టి కలవాడు. దాని వలన తెలిసేది మనమంతా దేవుడి నుంచి ఆవిర్భవించి, దేవుని యందే నివసించి, చివరికి దేవునితోనే ఐక్యమవుతాము. అలాగే అందరితోనూ సామరస్యంగా ఉండడము సమబుద్ధి. సమాధి స్థితిలో మనమందరిలోనూ కొలువై యున్న దేవుని దర్శించి, జీవైక్య సమానతను తెలిసికొ౦టాము.

మనము సహాయము చేసిన వారలయందు, అడ్డంకులు కలిగించిన వారలయందు, మనతో మంచి సంబంధాలు కల వారలయందు, అలాగే ఎటువంటి సంబంధము లేని వారలయందు గౌరవముతో మెలగాలి. మన తలదండ్రులకు, మిత్రులకి, చివరికి శత్రువులకి గౌరవమివ్వ గలగాలి. అది మనకే కాక వారికి కూడా ఉపయోగపడుతుంది. ఒకరు ఎటువంటి గౌరవానికీ అర్హులు కాకపోయినా, మనము గౌరవిస్తే స్పందించి మనయందు గౌరవంతో ఉంటారు. మిక్కిలి అహంకారియందు మన నమ్మికను ఉంచి, ఎదగడానికి ప్రయత్నము చేస్తాడని విశ్వశిస్తే అతడు తప్పక మన అంచనాకు వస్తాడు. ఇతరులు మనయందు ఎటువంటి నడవడికను చూపిస్తారని విచారపడక, వారిపై ఎలా స్పందించాలని సదా ఆలోచించక ఉండాలి. "మీరు ఒక అడుగు ముందెయ్యండి. అది ఎంత పొడవో నిర్ణయించి, నేనూ ఒక అంగుళం అటుఇటూ కాకుండా అడుగేస్తాను" అని అంటే మన క్రియలు ఇతరుల క్రియలపై ఆధారపడి, క్రమంగా మన౦ చిన్నచిన్న అడుగులు వేసి, చివరికి అడుగువేయకుండా ఆగిపోతాం. మన అనుబంధాలలో గౌరవము, ప్రేమ ముఖ్యమైన అంశాలు. ప్రత్యుపకారం ఆశించక, ఇతరులకు సేవ చేస్తే, ఇతరులు గాఢంగా స్పందించి వారిలోని దైవత్వాన్ని మనకి చూపుతారు.

నాగరీకులు నాయందు ప్రేమతో ఉంటే, మీయందు ప్రేమతో ఉంటాను; నన్ను ద్వేషిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తాను అనే దృక్పథంతో ఉంటారు. ధ్యానాన్ని చేసి, శ్రీకృష్ణుని లాగ, జీసస్ క్రైస్ట్ లాగ, బుద్ధుని లాగ, మన వ్యక్తిత్వాన్ని మలచుకొని, మనము ఇతరుల స్పందనతో సంబంధం లేకుండా ఆనందంతో బ్రతకవచ్చు. ఇదే నిజమైన స్వతంత్రత. ప్రస్తుతం మన౦ స్వతంత్రత అనుభవించడంలేదు. ఎందుకంటే ఇతరుల స్పందన గురించి విచారిస్తున్నాము. అలాకాకుండా ఉంటే మనమే కాకుండా, ఇతరులు కూడా స్వతంత్రతను అనుభవిస్తారు. మనము కలిసే క్రొత్త వ్యక్తులు మనను చూసి జంకు పడక, మనతో సామరస్యంగా ఉంటారు.

కుటుంబంలో ఒక్క అహంకారి ఉంటే చాలు, వాని యందు అందరూ జంకుతో ఉంటారు. ఇది ఒక అప్రయత్నమైన స్పందన: "నన్ను అతడు ఇబ్బంది పెడతాడు." మనమెప్పుడైతే సానుకూలంగా ఉంటామో, ఇతరులు ఇబ్బంది పడక మనయందు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అనుబంధాలలో ఇబ్బందులు శాశ్వతంగా తొలగించాలంటే ఇతరుల క్షేమాన్ని మన క్షేమంకన్నా మిన్నగా చూడాలి.

ఒక వడ్రంగి బల్ల చేస్తున్నప్పుడు బల్ల కాళ్ళు విడి విడిగా చేస్తాడు. వాటికి అనేకమైన అతుకులు ఉండవచ్చు. కానీ బల్ల పూర్తిగా చేసిన తరువాత ఆ అతుకులు కనిపించవు. అలాగే ఇతరుల లోపాల గురించి తక్కువ ఆలోచించి, వారిని మిత్రులుగా చేసికొని వారి స్పందనకై ఎదురచూడకుండా, మన దృష్టిని మనమెలా నడచుకోవాలో అన్న అంశం మీద కేంద్రీకరి౦చాలి. అలా చేస్తే ఇతరులు మనల్ని చికాకు పెట్టినా, వారిని ఆదరిస్తాం.

మనలో చాలామంది విభిన్న స్థిర భావనలు ఉన్నవారాలతో జీవిస్తాము. ప్రతి ఒక్కరి భావాలు, దృక్పథం మనకన్నా విభిన్నంగా ఉంటాయి. కానీ మనందరిలో ఒక హారంలో సూత్రం వంటి తత్త్వం కూడా ఉంది. నన్ను "మీరు అమెరికాకి వచ్చి 12 ఏళ్లు అయింది. మీకు అమెరికా నచ్చిందా?" అని అడిగేవారు. నేను ఇచ్చే సమాధానం "నాకు అక్కడ ఎలా వుందో ఇక్కడ కూడా అలాగే ఉంది" ఏ దేశం లేదా ఖండం వారలమైనా --ఆఫ్రికా, అమెరికా, యూరోప్, ఇండియా -- మన అంతర్గతంలో తేడాలు లేవు. మన ప్రత్యేకత మనలోని అంతర్గతమంతా ఒక్కటే. దానిమీద దృష్టి కేంద్రీకరిస్తే జీవైక్య సమానతని గ్రహిస్తాము. 349

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...