Bhagavat Gita
7.11
యే చైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చయే
{7.12}
మత్త ఏ వేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి
సాత్త్విక, రాజస, తామస గుణములచే కలుగు భావములు ఏవైనను అవి నా వలననే కలుగుచున్నవి. అవి నాయందున్నవి. కానీ నేను వాని యందు లేదు
త్రిభి ర్గుణమయై ర్భావై స్సర్వమిదం జగత్
{7.13}
మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయమ్
త్రిగుణములచేత సమ్మోహింపబడిన ఈ ప్రపంచము వీటికంటె విలక్షణమై, నాశరహితమైన నన్ను గ్రహించలేకున్నది
సృష్టి అఖండమైన చైతన్యం నుంచి ఉత్పన్నమైనదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన వేకువలోని, స్వప్నావస్తాలోని జ్ఞాపకాలు సుషుప్తిలో ఎలా గుర్తుకురావో, అలాగే పరమాత్మ చేతనములో విశ్వమనే ఆలోచన గుప్తంగా ఉంది. విష్ణు మూర్తి అనంత అనబడే సర్పము మీద, విశ్వ సముద్రము పైన పడుకొనిఉన్నాడు అని పురాణాలు చెప్తాయి. అట్టి స్థితిని స్పందింపజేసేదేమీ లేదు. అక్కడ వెలుగు కూడా లేదు. సర్వం విష్ణు మయం. విష్ణువు కల గంటాడు. అదే మన ప్రపంచం -- అనగా మాయ-- మరియు ఆ కల మూడు గుణాలతో కూడినది: సత్త్వ, రజస్, తమస్. సృష్టి ఆరంభంలో ఆ గుణాలు వివిధ ప్రమాణాలతో కలసి, తద్వారా ప్రకృతిని ఆవిర్భవింపజేసేయి.
మనలో కూడా ఈ త్రిగుణాలూ ఉన్నాయి. సాధారణంగా ఏదో ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బద్దకంతో స్తబ్దు గా ఉంటారో, పనులు వాయిదా వేస్తూ ఉంటారో, కార్యాలను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తూ ఉంటారో, వారు తామసికులు. వారిని విగ్రహాల వంటి వారని చెప్పవచ్చు. కాని వారిలో శక్తి, క్రియా శీలత గుప్తంగా ఉంటుంది. అట్టి వారు ధ్యానం చేయడం మొదలపెడితే వారి తామసిక గుణాన్ని -- అనగా బద్దకం, ఉదాసీనత మొదలగునవి-- జయించి అధిక వృద్ధి చెందగలరు.
రాజసికులు ఒక మెట్టు మీద ఉన్నారు. వాళ్ళు గొప్ప వాటిని సాధించాలనే నిశ్చయంతో ఉంటారు. వాళ్ళు తామసికులకన్నా ఎక్కువ పరిణామం చెందినా, వారి భావోద్వేగం తుఫానులాగ ఉంటుంది. సినిమా నాయకులు, దేశాధినేతలు, క్రీడలలో అగ్ర పూజ పొందేవారు ఆ కోవకు చెందినవారు. వాళ్ళు పోటీ పడి ఎవ్వడూ, ఎన్నడూ సాధించనిది సాధిస్తారు. వాళ్ళలో అధిక శక్తి, ఉన్నా దానికి ఒక దిశ లేదు. వాళ్ళు ఆహ్లాదకరమైన విషయాల్లో మునిగి, అనర్థాన్ని తెచ్చుకుంటారు.
ప్రస్తుత ప్రపంచం రాజసికులతో నిండి ఉంది. రాజసికులు వ్యక్తులను (వ్యష్టి), దేశాలను (సమిష్ఠి) తమ మాయ మాటలతో మభ్య పెడతారు. పర్యావరణ కాలుష్యం రాజసికులు మితిమీరిన లాభాలకై పరిశ్రమలు నడుపడం వలన కలుగుతున్నాది. మనం తినే పదార్థాలలో హాని కలిగించే చెక్కెర, కొవ్వు మొదలైనవి ఎక్కువ పాళ్లలో అమ్మి, లాభాలు చేసికొనేవారుకూడా రాజసికులే.
రాజసికులు ఎప్పుడూ అశాంతితో ఉంటారు. ఎవరైతే అలాగ ఉండి, ప్రతి ఏడాదీ ప్రపంచాన్ని చుట్టి, తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారో, అట్టి వారు ధ్యానం అలవరచుకొంటే వృద్ధిలోకి వస్తారు. యోగానంద పరమహంస అనే ఆధ్యాత్మిక గురువు --సెల్ఫ్ రియాలైజేషన్ ఫెల్లోషిప్ అనే కార్యక్రమాన్ని లాస్ ఏంజలీస్ లో ప్రారంభించేరు-- ఒక గొప్ప పెట్రోలియం ఆయిల్ కనిపెట్టే సంస్థ యజమాని జేమ్స్ లిన్ ను ధ్యానంలోకి ప్రోత్సహించేరు. లిన్ తనకున్న రాజసిక గుణాన్ని ధ్యానంలో ఉపయోగించి ఉత్తమ స్థితిని పొందెను.
ధ్యానం ద్వారా మనకున్న రాజసిక గుణాన్ని -- సాధారణంగా స్వార్థకర్మలు చేయించేది--సాత్త్వికముగా మార్చుకొని పరోపకారం చేయాలి. క్రోధం బదులు క్షమ, చికాకుకు బదులు ఓర్పు, లోభి కాకుండా పరులకు మేలు చేయడం మొదలైనవి సాత్త్విక గుణాలు. సాత్త్వికులు పైకి నిర్మలంగా కనబడినా, మనము వారికి శక్తి లేదని తప్పు అంచనా వేయరాదు. వారు తమ శక్తిని అశాంతితో అనేక విషయాలపై వెచ్చించ కుండా, ఒక మంచి కార్యానికై దార పోస్తారు. విచక్షణా జ్ఞానంతో, సమంగా ఉండే మనస్సుతో, స్థిరమైన కర్మ లతో వారు ప్రపంచానికి ఎనలేని సేవ చేస్తారు.