Bhagavat Gita
7.12
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
{7.14}
మామేవ యే ప్రపద్య౦తే మాయామేతాం తరంతి తే
దైవ సంబంధమై, త్రిగుణాత్మకమైన ఈ నా మాయ దాట శక్యము కానిది. ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారు మాయను దాటుచున్నారు
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః
{7.15}
మాయ యా అపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః
ఎవరి జ్ఞానమును మాయ అపహరించినదో అట్టివారు రాక్షస భావములను ఆశ్రయించు చున్నారు. పాపులు, మూఢులు నగు నరాధములు నన్ను పొందలేరు
మాయను వివరించడం చాలా కష్టం. ఎందుకంటే అది సర్వ వ్యాప్తమై మన ఆలోచనలను, అవగాహనను ఆవరించి యున్నది. మన వేర్పాటును కలిపించి తికమక పెట్టే మహా శక్తి. అది ఒక క్లిష్టమైన కల లాంటిది. దానివలన ప్రతీదీ దాని కితరమైనదిగా కనిపిస్తుంది. మనమందరము ఒక్కటే అయినప్పటికీ మనం వేర్పడి ఉన్నామని భ్రమ కలిపిస్తుంది. దానివలన సుఖం, శక్తి, వస్తువులు మనను ఆనందింప చేస్తాయని నమ్ముతా౦. మనం ఎంత సుఖం కలిగించే వస్తువుల వైపు పరిగెడతామో అంత నిరాశ పడతాం. మనం ఎంత ఉత్తేజం పొందాలనుకుంటామో, జీవితం అంత పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. మనం ఎంత ఇతరులను మభ్య పెడతామో అంత అభద్రతను పొందుతాం. మాయ మన ఆనందాన్ని అపహరించి, దానికై అన్ని చోట్లా వెదక జేస్తుంది.
మన శాస్త్రములలో మాయ యొక్క ఆవరణం, దారి మళ్లించే అంశాలను రాజసిక, తామసిక గుణములుగా చెప్పబడినది. ఈ రెండు గుణాలే మాయ యొక్క మూలం. తామసికుడు ఎప్పుడూ తన వేర్పాటును, దేహమే తానను భ్రమలో ఉంటాడు. రాజసికుడు అశాంతితో స్వార్థానికై అనేక కోర్కెలు కల్పించి, ఎండమావులకై పరిగెత్తిస్తాడు.
మాయ ఇటువంటి అబ్బురపరిచే కోర్కెలతో మన జీవితాన్ని సంపూర్ణముగా చూడనివ్వదు. మన౦ స్వార్థానికై, సుఖానికై ప్రాకులాడి, మనకి ఇతరులికి మధ్య గోడను కట్టి వేర్పాటు కలిగించుకొంటాం. మాయ యొక్క క్రూరత్వము వలన మనం గోడ వెనుక ఒంటరితనముతో, వేర్పాటుతో బ్రతుకుతాం. మనం ఎంత కోర్కెలను తీర్చుకోడానికి ప్రయత్నిస్తామో, గోడ ఎత్తును అంత పెంచుతాం.
నేను ధ్యానం అలవరుచు కున్న ముందు, కొండని లేదా నదిని లేదా ఆకాశాన్ని చూసినప్పుడు వాటి సౌందర్యాన్ని ఆస్వాదించేవాడిని. అలాగే నాలో వ్యక్తిత్వము గూర్చి అవగాహన ఉండి, పరుల యందు సానుభూతితో ఉండేవాడిని. ధ్యానం అలవరుచుకున్నాక అవన్నీ అందంగా ఉ౦డి, అన్నీ ఒకటే అని తెలిసికున్నాను మాయ యొక్క ముసుగు తొలగితే మనం వేర్పాటుతో ఉన్నా, ప్రపంచంలోని భేదాలు -- వేర్వేరు ముఖములు, నడవడి, జాతులు, నమ్మకాలు-- దేవుని లీల అని తెలిసికొ౦టాం.
నేను మొదటిసారి అమెరికాకు వచ్చినపుడు నాకు అమెరికన్ లు, ఇతర దేశస్తులుకు గల భేదాల గూర్చి చెప్పేరు. నేను వారి మధ్య కలిసి యున్న లక్షణాలను గురించి ఆలోచించేవాడను. ఎందుకంటే మన మధ్యనున్న భేదాలు పైపైవి మాత్రమే. అవి మన మధ్యనున్న ఆహారము లేదా దుస్తులు మొదలైన వాటివలన ఉన్న తేడాయే. అమెరికాలో ఎన్నో అంతస్తులున్న, నేనెన్నడూ చూడని, భవనాలను చూసి ఆశ్చర్య పడ్డాను. కాని నేను మిక్కిలి ఓర్పుతో ఉండే యోగి కన్నా అవి ఎక్కువ ఆశ్చర్యము కలిగించేవి అని తలచలేదు. నా తోటి వారు టైమ్స్ స్క్వేర్ లో ఉన్న నియాన్ దీపాలు, ఎత్తైన భవనాలు చూస్తూ ఉంటే నేను అక్కడి మనుష్యులను చూసేను. వారు పైపై ఎంత తేడాలతో ఉన్నా, అంతర్గతంలో వారంతా ఒకటే కదా అనే భావన ఆనందాన్ని కలిగించింది.
మనము మన కళ్ళతో కాక మనస్సుతో చూస్తాం (ప్రశ్నోపనిషత్తు). మనస్సు తేడాలను చూస్తుంది. ఎక్కడైతే క్రోధం, ధైర్యం, లోభ౦, వేర్పాటు లేవో మనస్సు స్పందించదు. దేని గురుంచీ ఉద్రేకము చెందకుండా, సంపూర్ణమైన ఆనందం తో ఉంటే మనస్సు ఆస్వాదించలేదు. మాయను దాటాలంటే ఈ మనస్సు లక్షణాన్ని తెలిసికోవాలి. ధ్యానంతో మన మెంత మనస్సును కట్టడి చేస్తే, మనమ౦త పైపై మెఱుగులు చూడక ఉంటాము. మనస్సును నిశ్చలముగ ఉంచితే మాయ యొక్క ప్రభావం తగ్గుతుంది. అందుకే నేను చెప్పేది ఎల్లప్పుడూ మనగురించే ఆలోచించక, ఇతరులకై ఆలోచించండని. అలాగే సహనంతో, చికాకు లేకుండా ఉండండి. ఎందుకంటే అవి మన అహంకారాన్ని ఉత్తేజ పరచి వేర్పాటు కలిగిస్తాయి. మనస్సు యొక్క ఉత్తేజము మాయ. మనము ప్రతీదీ, ప్రతి వ్యక్తినీ, మనస్సుతో చూడ గలిగితే దానిని నిశ్చలముగా, నిర్మలముగా ఉంచాలనే ప్రేరణ కలుగుతుంది.