Bhagavat Gita
7.17
యో యో యాం యాం తమం భక్త శ్శ్రద్ధయా అర్చితు మిచ్చతి
{7.21}
తస్య తస్యాచలా౦ శ్రద్ధాం తామేవ విదధా మ్యహమ్
యే భక్తుడు ఏ కోరికతో ఏ దేవతా రూపామును శ్రద్ధతో అర్చించుటకు అభిలషించుచున్నాడో వానికి స్థిరమైన అట్టి శ్రద్ధను నేనే కలిగించుచున్నాను
స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే
{7.22}
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్
ఆ శ్రద్ధతో అతడు దేవతుల నారాధించుచున్నాడు. ఆ తరువాత వాని ప్రియమైన కోరికలను దేవతల ద్వారా నేనే ఫలింప జేయుచున్నాను ఀ
శ్రద్ధకు అనేక అర్థాలు ఉన్నాయి. అది ఒక గాఢమైన కోరిక లేదా మన ఆలోచనలను, కర్మలను మలిచేది. అలాగే భక్తి ని కూడా సూచిస్తుంది. మన అభిప్రాయం, నమ్మకం కూడా శ్రద్ధ అనవచ్చు. మనం శ్రద్ధ వలన ప్రభావితమౌతాము. ఎందుకంటే మన నమ్మకాలు, అభిలాషలకు అణుగుణంగా మనం జీవిస్తాము.
పురాతనకాలంలో గ్రీకు దేశంలో మైదాస్ అనే వ్యక్తికి బంగారం మీద ఎనలేని ఆశ ఉంది. నిరంతరము బంగారం గురించే ఆలోచించేవాడు. ఒక దేవత ప్రత్యక్షమై వానికి ముట్టుకుంటే బంగారమయ్యే వరమిచ్చింది. వాడు పొంగిపోయేడు. తన దగ్గరున్న వస్తువులన్నిటినీ బంగారంగా మార్చేడు. తిందామని ఆహారాన్ని తీసికొ౦టే అది బంగారంగా మారింది. బంగారాన్ని తినలేడు కదా. సరే తోటలోకి వెళ్దామని నిశ్చయించుకొన్నాడు. అక్కడ ఒక అందమైన పూవుని ఆస్వాదించాలని ముట్టుకుంటే అది బంగారమయింది. అదే సమయంలో వాని కూతురు పరిగెట్టుకుంటూ వచ్చింది. వాడు ఆమెను ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తే ఆమె కూడా బంగారమయింది. చివరకు మైదాస్ భోరని ఏడ్చి దేవత ఇచ్చిన వరాన్ని వెనక్కు తీసికోమని వేడుకొన్నాడు.
మనం మైదాస్ లాగా ఒకే విషయం గురించి సుధీర్ఘమైన ధ్యానం చేసి దేవతలనుండి వరాలు పొందలే౦. కాని మైదాస్ శ్రద్ధ బంగారం మీద ఎలా ఉందో, కొందరికి ఆస్తులకై, పేరు ప్రతిష్ఠలకై అటువంటి శ్రద్ధ ఉంటుంది. వారికి తెలియకుండానే వారి కోర్కెలకై తమ ప్రేమను వెచ్చిస్తారు. ఏ వ్యక్తి మీదా ప్రేమను పెంచుకోరు. చివరకు తమ భాగస్వామితో కూడా ప్రేమ పంచుకోరు.
ఒకర్ని నిందించడంలో లాభం లేదు. ఈ కాలం అటువంటిది. మనమందరమూ దానివలన ప్రభావితమైనాము. కానీ మన శ్రద్ధను మార్చుకోగలిగే శక్తి మనకుంది. ధ్యానం ద్వారా మన నమ్మకాన్ని మనల్ని ఇతరులతో వేర్పాటు చేసేవాటినుండి -- అనగా ఆస్తి, పేరు, ప్రతిష్ఠ, కీర్తి మొదలైనవి-- దూరంగా ఉండి, ఇతరుల శ్రేయస్సుకై పాటు పడడానికి మలచాలి.