Bhagavat Gita
7.18
అంతవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్పమేధసా౦
{7.23}
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి
దేవతల నారాధించువారు దేవతలనే పొందుచున్నారు. అల్పబుద్ధి గలవారు పొందెడి ఆ ఫలము నశించును. నా భక్తులు నన్నే పొందుచున్నారు.
ప్రతీ గాఢమైన కోరిక ఒక ప్రార్థన. మనమందరము చేతనపు లోతులలో సదా ప్రార్థన చేస్తూ ఉంటాము. మన ప్రార్థన గాఢంగా ఉండి, స్థిరంగా ఉంటే మనము జీవితాన్ని ప్రార్థన ఫలించినట్టుగా జీవిస్తాము. తేడా ఎక్కడంటే మనము దేని గురించి ప్రార్థిస్తున్నామో. మనం ఇంద్రియాలకు సంబంధించిన దేవతలను ప్రార్థిస్తే -- ధనము, హోదా, ఆనందము , కీర్తి ప్రతిష్ఠలు -- మనము ప్రపంచములో కూరుకు పోతాము. అట్లు కాక మన ప్రార్థన శ్రీకృష్ణునికై చేస్తే మనము క్రమంగా మార్పులన్నిటికీ అతీతమై, చివరికి మరణమనే మార్పునుకూడా అతిక్రమిస్తాము.
ప్రతిఒక్కరికీ ఎంతోకొంత నమ్మకం ఉంటుంది. మనము వాహనం ఎక్కేమంటే, దానికి ఇంజిన్ ఉందని, దాని చక్రాలు నడిమార్గంలో ఊడిపోవని, నమ్మకం ఉంటుంది. దానినే శ్రద్ధ అంటారు. మనం ఒక వస్తువు కొని, నాణెములు ఇస్తే మనకి, ఆ కొట్టు యజమానికి వాటిమీద శ్రద్ధ ఉంది. శ్రద్ధ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలి పోతుంది.
మనం ఎలాగైతే నాణెములను నమ్ముతామో, మనము వేరని, దేహమని, మన వ్యక్తిత్వానికి , నడవడికకి జన్యువులు కారణమని నమ్ముతాము. పై శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పేది: సదా మార్పు చెందే భౌతిక ప్రకృతితో తాదాత్మ్యం చెందితే, కాలం యొక్క ప్రభావం మన దేహం మీద చూపబడి చివరకు మరణం వరకూ దారి తీస్తుంది. కానీ శ్రద్ధను శ్రీకృష్ణుడు మీద పెడితే మన నిజస్వరూపమైన ఆత్మని తెలిసికొని, వృద్ధాప్యముచే బాధింపబడము. మన నమ్మకం ఇంకా బలిష్టంగా ఉంటే మనము శ్రీకృష్ణుడులో లీనమవుతాం.
శ్రీకృష్ణుని యందలి నమ్మకం మూఢమైనది కాదు. అది ఆధ్యాత్మిక విలువల యందు నమ్మకం. వాటియందు, స్వీయానుభవం వలన, గట్టి విశ్వాసం. మనం రాత్రి పడుక్కొని, ఉదయం లేచి శ్రద్ధ గలవారమైపోము. శ్రద్ధ కాల క్రమేణా వస్తుంది. యోగులు తాము చెప్పిన పద్ధతిని ఒక మారు ప్రయత్నించి చూడమని అంటారు.
ఇది భౌతిక శాస్త్రము వంటిదే. ఐసాక్ న్యూటన్ తన సిద్ధాంతాలను భక్తిభావం వలన చేయలేదు. ఆయనకు తన ఆలోచనా రీతి మీద గట్టి నమ్మకం ఉంది. ఆయన "చంద్రుని కదలికకు, ఆపిల్ చెట్టునుండి క్రింద పడుటకు ఏదో సంబంధం ఉండచ్చు" అని అనుకొన్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఉండచ్చు అన్న దృక్పధం. శ్రద్ధతో తన ఆలోచనతో కార్యాచరణము చేసి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేడు.
మనలో చాలామంది న్యూటన్ చేసిన ప్రయోగాలు చెయ్యలేదు. కాని అతని సిద్ధాంతం నిజమని నమ్మేము. సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అసీసీ లేదా శ్రీరామకృష్ణ "మమ్మల్ని గెలీలో, న్యూటన్ లను నమ్మినన్త నమ్మరా? మేము ఎక్కడో చదువుకున్న లేదా వినిన జ్ఞానం చెప్పటంలేదు. జీవితాంతం చేసిన సాధనతో స్వీయానుభవం చెప్తున్నాము" అని అడుగుతారు.
బుద్ధుడు ఒక గ్రామని కొచ్చి తన బోధను చేస్తున్నాడు. ఒకడు లేచి ఇలా అడిగేడు: "మీరు మాకు నిర్వాణం గూర్చి చెప్పినది చాలా బాగుంది. మేమందరం దుఃఖాన్ని, బాధలను దాటే మార్గం కాంక్షిస్తున్నాము. మీరు చెప్పే మార్గం చాలా క్లిష్టమైనది. అది పనిచేయక పోతే మా జీవితాలు వ్యర్థమవుతాయి. మేము నిర్వాణమనేదాన్నిపొందగలమని ఎలా నమ్మడం?"
బుద్ధుడు తిరిగి ప్రశ్న వేసేడు: "ఇక్కడికి ఉత్తర దిశలో పర్వతాలేమయినా ఉన్నాయా?"
"హిమాలయాలు ఉన్నాయి"
"నీకేలా తెలుసు. నువ్వెప్పుడైనా హిమాలయాల్ని చూసేవా"
"లేదు. కానీ అందరూ ఉన్నాయని చెప్తారు. నా తండ్రి వాటి గురించి చెప్పేడు. గంగా నది అక్కడే ఆవిర్భవించింది."
"నీ తండ్రి ఆ పర్వతాల్ని చూసేడా"
"నా తండ్రి తన తండ్రి ద్వారా తెలిసికొన్నాడు. నా తాత మామయ్య హిమాలయాలను చూసేడు"
"బహుశా అతను ఊహించివుంటాడు"
"అతను మాకు అబద్ధం చెప్పలేదు. ప్రతి ఒక్కరికీ అతను నిజాయితీపరుడని తెలుసు"
"నీకు వినికిడి ద్వారా తెలిసికొన్న విషయంపై అంత నమ్మకముంటే, నిర్వాణాన్ని చూసిన వ్యక్తి నీము౦దు ప్రత్యక్షంగా ఉంటే ఎందుకు నమ్మవు?" అని బుద్ధుడు అడిగేడు.